మహాబలిపురం: కోరమాండల్ కోస్తాలో మిలమిల మెరిసే వజ్రం
రాళ్లను కరిగించి పోత పోశారేమో అనిపించే అద్భుత కళా ఖండాల నిలయం;
2025 మే 7న మా ఫ్రెండ్ కు ఎందుకో ఫోన్ చేశాను. ‘కంప్యూటర్ అక్క, నేను చెన్నైలో విజయవాళ్ళ ఇంటిలో ఉన్నాం. వచ్చేయి మహాబలిపురం వెళ్దాం,’ అన్నది. ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను. అయినా ఇప్పుడా!? ట్రైన్ రిజర్వేషన్ లేకుండా అన్నాను. వెంటనే మా కంప్యూటర్ అక్క! ఏందమ్మా! రిజర్వేషన్. నెల్లూరుకు మూడు గంటలు. అక్కడి నుంచి చెన్నైకి మూడు గంటలు. ఇంటికి ఒక గంట. బస్ టికెట్ రిజర్వేషన్ చేస్తాం. ఇక్కడ క్యాబ్ బుక్ చేస్తాం. వచ్చేయ్, వచ్చేయ్ అంది.
మహాబలిపురం అనగానే ‘మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు. ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు’ పాట గుర్తొచ్చింది. పైగా శిలలు శిల్పాలు చూడటం అంటే ఇష్టం కదా. ఇక ఆగలేకపోయాను. ఐదు గంటలకు బస్ టికెట్ రిజర్వేషన్. బస్సు పదకొండు గంటలకు.
ఐదు గంటలకు చెన్నై. 6: 30 కు విజయ ఇంటికి. కబుర్లు. టిఫిన్లు. తీసుకెళ్లడానికి స్నాక్స్, పులిహార, పెరుగన్నం,వాటర్. ఇలాంటివి రెడీ చేయడంలో విజయ సిద్ధహస్తురాలు. చిన్న విషయం కూడా మరిచిపోదు. అవడి వరకు ఆటో. అక్కడ నుండి బస్సు ఎక్కి తామ్రం. మాకు రక్షణగా తామ్రంలో విజయ తమ్ముడు మల్లికార్జున రావుగారు వచ్చారు. మరో బస్సులో తామ్రం నుండి మహాబలిపురం. మధ్యలో వండలూరు, కేలంబాకం, తిరుపోరూరు.
తిరుపోరూరు దాటగానే రోడ్డు పక్కన దూరాన్ని సూచిస్తూ "మా మల్లపురం" బోర్డులు కనిపించాయి. మహాబలిపురం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి అరవై, కంచికి డెభై ఐదు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ఒడ్డున గ్రేట్ సాల్ట్ లేక్ మధ్య భూభాగంలో ఉన్న చిన్న పట్టణం. మహాబలిపురాన్ని ఇక్కడ "మామల్లపురం" గా పిలుస్తారు. ఇక్కడ ఆ పేరే ప్రసిద్ధి. బలి చక్రవర్తి పాలించడం వల్ల మహాబలిపురం పేరు వచ్చిందని అంటారు.
మూడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్య కంచిని రాజధానిగా చేసుకుని పాలించిన పల్లవ రాజులు గొప్ప మల్ల యోధులు. పల్లవరాజు మొదటి నరసింహవర్మ గొప్పవీరుడు, మల్ల యోధుడు."మమల్ల" బిరుదాంకితుడు అయినందున అతని పేరు మీద "మా మల్లన్" అని, క్రమంగా మా మల్లపురం అని పిలుస్తున్నారు.
నరసింహవర్మ 1 కాలంలోనే కళలు సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది. మహాబలిపురం కొంతకాలం పల్లవులరాజదాని కూడా. పల్లవుల ప్రధాన ఓడరేవు కూడా ఇదే. ఎడూ ఎనిమిది శతాబ్దాల కాలంలో పల్లవరాజుల కాలం స్వర్ణయుగం గా పిలవబడింది. చరిత్రాత్మకంగా ఉన్న పేరు కూడా "మామల్లపురం". వలసరాజ్య నిర్వాహకుల భాష వైవిధ్యాలు, ఉచ్చారణ కారణంగా పేరులో మార్పు జరిగి 'మహాబలిపురం' గా కావచ్చు.
మొదటి, రెండవ నరసింహవర్మల కాలంలో మామల్లపురం లో రాతి, గుహ దేవాలయాలు, ఏకశిలారధాల నిర్మాణాలు జరిగాయని చారిత్రక ఆధారాలను బట్టి చరిత్రకారులు నిర్ణయించారు. మహాబలిపురం మొత్తం విగ్రహాలు చెక్కే శిల్ప (కుటీరపరిశ్రమ) శాలలు ఉన్నాయి. అన్ని అత్యద్భుతంగా ఉన్నాయి. దారులకు రెండు వైపులా శిల్పశాలలే ఉన్నాయి. కానీ బస్సులో వెళ్లడం వలన ఆగి శిల్పశాల లను నిదానంగా చూడలేకపోయాం.
మండుటెండలో ఒంటిగంటకు "మా మల్లపురం' చేరుకున్నాం. బస్సు దిగంగానే ఆటో వాళ్ళు మనిషికి ఇరవై అంటూ ఊపిరి తిప్పుకొని వ్వలేదు. ఈ గోలలో బస్సు స్టాండుకు దగ్గర్లోనే ఉన్న గుడి సంగతి గుర్తుకు రాలేదు. అయినా నాకు శిలలు శిల్పాలే ఇష్టం కదా. మహాబలిపురానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న 'టైగర్ కేవు' వెళదాం అన్నాను.
మల్లికార్జున పదేళ్ళ నుండి ఇక్కడే ఉన్న, నేను చూడలేదు. తెలియదు అన్నాడు. ఐదుగురికి ఐదువందలు రానుపోను మాట్లాడుకున్నాం. పావుగంటలో 'టైగర్ కేవ్' దగ్గరకు వెళ్ళాం. పావుగంటలో వచ్చాం, నాలుగైదు కిలోమీటర్ల లేదు. చాలా ఎక్కువ అన్న అన్నాను. ఉందమ్మ! రోడ్డు బాగుంది. ట్రాఫిక్ లేదు కదా అన్నాడు. సర్లే ఏదైనా చెప్తావులే అని నవ్వుకుంటూ మా లగేజీ ఆటో లోనే పెట్టి బయలుదేరాం. మహాబలిపురం మహాబలిపురం పాట మొదలెట్టాం. మా కంప్యూటర్ అక్క ఆరోగ్యం బాగా లేకుండానే బయలుదేరింది ఇంటి నుండి. నేను రాలేను అని ఆటోలో ఉండిపోయింది.
టైగర్ కేవ్: వంద మీటర్లు నడవగానే అద్భుతమైన చల్లదనం. పచ్చటి పెద్దపెద్ద చెట్లు. కింద అంతా శుభ్రంగా ఉంది. భూమి మీద నుండి ఆకాశం వైపు ఏటవాలుగా వాలిన పెద్ద రాయి (యాలి మండపం అని అంటారట) మమ్మల్ని ఆకర్షించింది. అంత ఎత్తున అలా వంగి ఉండటం మమ్మల్ని ఆశ్చర్య చికితుల్ని చేసింది. ఇది ఒక శాసనం అట. ఈ శాసనం వల్లనే 'సంఘం' కాలంనాటి "మురుగన్" ఆలయాన్ని తవ్వారట. మాకు మాత్రం శాసనం కన్నా ఒక పడిపోని అద్భుతమైన (అక్షరాలు కనిపించటంలేదు) రాయిగా కనిపించింది.
చుట్టూ పచ్చటి గడ్డి. చల్లని నీడనిస్తున్న చెట్లు. బంగాళాఖాతం మీద నుండి వస్తున్న చల్లటి గాలి. పరవశంలో మునిగిపోయి ఆ శాసనాన్ని తాకి కరువు తీరా ఫోటోలు దిగేం. ఆటో అతను ఫోన్. మేము ఇంకా టైగర్ కేవ్ దగ్గరికి వెళ్ళనే లేదు అన్నాం. దూరం నుండే టైగర్ కేవు సౌందర్యం ఆస్వాదిస్తున్నాం. దగ్గరగా కన్నా దూరం నుండి చాలా బాగుంది. అద్భుతమైన శిల్ప సంపద.
టైగర్ కేవ్ ఏడవ శతాబ్దానికి చెందినది. ప్రవేశద్వారం చుట్టూ గుహనుప్రేమ్ చేస్తూ అద్భుతమైన పదకొండు గాండ్రిస్తున్న పులి తలల శిల్పాలు ఒక హారములా చెక్కబడినవి. అందువలనే ఈ గుహకు టైగర్ కేవ్ గుహ అని పేరు వచ్చింది. రాక్ కట్ దేవాలయం అంటారట. ఇది దుర్గాదేవి (శివుని భార్య) కు అంకితం చేయబడినది. మధ్యలో మందిరం. మందిరం మెట్లకు రెండు వైపులా రెండు సింహాల తలలు. మందిరానికి పోర్టుకోలాగా ముందుకు వచ్చిన చూరు.
పక్కనే రెండు ఏనుగుల శిల్పాలు చెక్కిన రెండు గుహలు. పల్లవ రాజుల పరాక్రమానికి, శిల్పకళా నైపుణ్యానికి గుర్తుగా సింహాలు ఉన్నాయా అనిపించింది. శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన నిర్మాణం కూడా అనిపించింది. ఈ గుహ నేల కన్నా అరమీటరు లోతుగా ఉంది. చుట్టూ చాలా శుభ్రంగా ఉంది. బంగాళాఖాతం చాలా దగ్గరగా కనిపిస్తు, అలల శబ్దం వినిపిస్తుంది.
చూడాల్సినవి చాలా ఉన్నాయని ఆటో ఎక్కాం. ఆటో నేరుగా పాండవగుహలు దగ్గరకు వచ్చింది. ఎదురుగా పార్కులో లంచ్ తిన్నాం. పర్వాలే. కొద్దిగా శుభ్రంగానే ఉంది .ఎదురుగా మూడు చెట్లు కలిసి ఓ పూరిపాకలా భలే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఫోటో తీద్దాం అని మల్లికార్జున, నేను అనుకున్నాం. తిని తినకముందే టైం చాలదు ఎదురుగా పాండవగుహలున్నాయి చూసి రండని ఆటోవాల తొందర చేయడంతో, అన్ని దబదబా సర్దుతూ ఫోటో సంగతి మర్చిపోయాం. ఇక్కడ టికెట్లు తీసుకున్నాం. అన్ని చోట్లకు ఆ టిక్కెట్లే పనికి వస్తాయట. మళ్ళిమళ్ళి టిక్కెట్లు తీసుకోకుండా ఈ టిక్కెట్లు చూపిస్తూ ఉండాలని డైరక్షన్ కూడా ఇచ్చాడు.
ఐదు రథాలు (five Rathas): ఐదు రథాలు ఉండడం వల్ల వీటిని పాండవ రధాలు అంటారు. పాండవులకు ఈ రథాలకు ఎలాంటి సంబంధం లేదు. ఏకశిలఆలయాలను స్థానికంగా రధ (రథం) అని పిలుస్తారు. ఆలయంలోని ఊరేగింపు రధాలను పోలి ఉన్నాయి. ఎక్కడా అతుకు లేదు. ఏకశిలపై చెక్కబడిన రాతిరధాలు. ఈ రథాలు మొదటి నరసింహవర్మ (630_668CE )కాలములో నిర్మింపబడినవి. ప్రతి రథం ఎదురుగా దాని బోర్డును పెట్టారు. మొదటగా ద్రౌపది రథం. మిగతా రథాలకన్నా కొంచెం చిన్నదిగా ఉంది. రథం లోపల దుర్గాదేవి విగ్రహం ఉంది. రథం తెల్లటి గ్రానైట్ రాతితో బెంగాలీ స్టైల్ లో ఉంది. రథం చుట్టూ, పైన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. రథం పక్కన వర్షం నీరు పోవడానికి ఏర్పాటు కూడా ఉంది. పంచ రథాలలో ద్రౌపదికి ప్రాధాన్యత ఇచ్చారు. పర్వాలేదు అనుకున్నాను.
నకుల సహదేవుల రథం, ఏనుగు, ద్రౌపది, అర్జున, భీమ రధాలు.
రెండవది అర్జునుని రథం. గర్భగుడి లోపల విగ్రహం ఏమీ లేదు. పోయినట్లుగా కనిపించింది. సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంది. శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి శివాలయంలో నంది ముందు ఉంటుంది. ఇక్కడ వెనకవైపున నంది ఉంది. ముందుకు స్తంభాలతో కూడిన మండపం ఉంది. దీనికి రెండు అంతస్తుల విమానం ఉంది. మూడవది భీమరథం. దీర్ఘ చతురస్రంలో భీముని లాగే అన్నింటికన్నా పెద్దగా ఉంది. స్తంభాలపైన సింహాల బొమ్మలున్నాయి .శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఉన్నాడు. అంటే విష్ణువుకు అంకితం చేయబడింది. గ్రామీణ- బండి పైకప్పుగా ఉంటుంది.
భీముని తరువాత ధర్మరాజు రథం. బ్రహ్మదేవునికి అంకితం చేయబడింది. అష్టభుజి ఆకారంతో మూడు అంతస్తుల సదరపు విమానాన్ని కలిగి ఉంటుంది. ఈ నాలుగు రథాలు ఏకశిలపై ఉన్నాయి. నకుల సహదేవులివి ఏవి అనుకున్నాం. ద్రౌపది రథం ఎదురుగా ఒక రథం ఉంది చూసి వస్తాను ఉండండి (అప్పటికీ ఎండ అదిరి పోతుంది. అందరం ఓ చెట్టు కింద చేరాం) అవును! అది నకుల సహదేవులదే. ఇద్దరికీ ఒకే రథం. గణపతికి అంకితం. నకుల సహదేవుల రథాన్ని గజపుష్ప అని పిలుస్తారట. అయ్యో! ఇద్దరికీ ఒకే రథం అనుకున్నాను. ద్రౌపది, నకుల సహదేవుల రధాల మధ్యలో ఏకశిలపైనే ఏనుగు, సింహం, నంది అతి సుందరంగా ఉన్నాయి. ఏనుగు సౌదర్యం ఉట్టిపడుతుంది. ప్రతి రథం మీద ఏదో ఒక శిల్పం చెక్కారు. ఆ శిల్పాలు తడిమితే ఏదో అనుభూతి కలుగుతుంది. ప్రతి రధం కిందవైపున లాగుతున్నట్లుగా ఏనుగులున్నాయి. ప్రతి రథంకు వర్షపు నీరు పోవడానికి ఏర్పాట్లు చూస్తే సూక్ష్మ విషయాలను కూడా చెక్కారని ఆశ్చర్యం కలిగింది. కొండను బయట నుంచి తొలుస్తు ఈ రధాలను చేక్కెరు. చూడాల్సిందే. చూసి ఆనందించాల్సిందే. ప్రతి శిల్పంలోనూ ఏదో ఒక అందం. ప్రతి రథం కింద (టాప్ టు బోటం) నుండి పై దాకా ఏదో ఒక శిల్పం ఉంది. సింహాలు, జంతువులు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఏ దేవునికి, దేవతలకు పూజలు జరగవు. పూజలు లేవు కనుకనే తళతళ మెరిసిపోతున్నాయి.
పంచ రధాలను చూస్తుండగానే ఆటో అతను వచ్చి టైం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి అనడంతో పాండవ లోకము నుండి ఈ లోకంలోకి వచ్చి ఆటో ఎక్కి కృష్ణ మండపం వైపు వెళ్ళాం. ఈ కృష్ణ గుహ దేవాలయం పల్లవుల గుహ ఆలయాలన్నింటిలో కెల్లా అతి పెద్ద రాక్ కట్ గుహ ఆలయo. కృష్ణ మందిరం గుహలోపల 18 పిల్లర్స్ పై ఉన్న నిర్మాణంలో కృష్ణుడు ఎడమ చేతితో గోవర్ధన పర్వతం ఎత్తుతున్నట్లు మరొక చేతితో ఇంద్రుని వరదప్రవాహ వైఖరిని మార్చుతున్నట్లు ప్రధానంగా చూపబడింది. గ్రామీణ జీవన విధానం చూపే గ్రామీణ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. గొడ్డలితో ఉన్న వుడ్ కట్టర్, పశువుల పాలు తీస్తున్న మనిషి, నాట్యo చేస్తున్న స్త్రీ పురుషులు, గడ్డిమోపును మోస్తున్న మనిషి, కడవను తీసుకెళుతున్న గోపిక, జంతువులు... చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. పక్కనే లెక్కించడానికి వీలు కాని విధంగా ఉన్న సంభాల పై నిర్మించిన కృష్ణ మండపం బహుశా మనుషుల నివాసం కోసం ఏర్పాటు చేయబడిందేమో అనిపించింది. చాలా స్తంభాలు ఉన్న ఈ భాగంలో ఎలాంటి శిల్పాలు లేవు. మొదటి పరమేశ్వరవర్మన్ (672-700CE)కాలంలో (మొదటి నరసింహవర్మన్ శైలి 630- 688CE) 'మామల్ల' శైలిలో నిర్మింపబడినదట. పిల్లర్స్ పై ప్రత్యేకమైన ప్రణాళికతో చెక్కిన (నిర్మింపబడిన) గుహ ఆలయంలా ఉంది. ముందు భాగంలో ఉన్న మండపం 16వ శతాబ్దంలో నిర్మింపబడినదట. చాళుక్యుల నిర్మాణం వలే స్తంభాల ఫలకపై, కపోటా క్రింద వ్యాల (వ్యాల అంటే ఒక వాహనము యొక్క రెండు చక్రాల మధ్య ఉండే దూరం) కలిగి ఉండడం దీని ప్రత్యేకత. స్థానికంగా ఈ మండపాన్ని పంచ పాండవ మండపం అంటారు. అక్కడ బోర్డు కూడా పాండవ మండపం అని ఉంది.
కృష్ణ మండపం
కృష్ణ మండపాన్ని ఆనుకుని ఉన్న ఏకశిలపై (ఓ పెద్ద కొండ వాలు) ఉన్న శిల్పాలు రా రమ్మని పిలుస్తున్నన్నాయి. ఇది అర్జున ఫిలాన్సి. దీనికి అర్జునుడికి ఏ సంబంధం లేదు. పేరు ఎందుకు పెట్టారో తెలియదు. కిరాతర్జునీయం అన్న బోర్డు ఉంది. ఏదో గుర్తు వచ్చింది. కానీ స్పష్టంగా తెలియటం లేదు. విజయని అడిగితే తెలియదు, పైన ఏముందో చూద్దాం అన్నది.ఎవరిని అడగాలి చుట్టుపక్కల చూసాను.సరైన వాళ్ళు కనిపించలే.
గూగులమ్మను అడిగీతే అర్జునుడుకు, మారువేషంలో ఉన్న శివుడుకు జరిగిన భయంకర యుద్ధం అంది. అప్పుడు గుర్తొచ్చింది భారతంలో లేని ఓ కథ, భారవి అందమైన కావ్య సృష్టి అని. దీనినీ భగీరథ పిలాన్సి అని కూడా అంటారట. అంగుళ అంగుళంలోనూ సౌందర్యం ఉట్టిపడే పురాణ ఘట్టాలు, మానవ జీవన విధానం, జంతువులు, మూడు లోకాలను తెలిపే చిత్రాలు, పాతాళం నుండి పైకి వచ్చే పాములు, నాట్య భంగిమలు,కోతులు, పెద్దపెద్ద ఏనుగులు, వంటికాలుపై నిలుసున్న భగీరథుని ఘట్టం, మహిషాసుర మర్దని ఘట్టం స్పష్టంగా అందంగా శిల్పాకళ నైపుణ్యంతో ఉట్టిపడుతున్నాయి. దాదాపు పన్నెండు, పదమూడువందల నాటివైన చెక్కు చెదరకుండా ఉన్నాయి.
మనుషులకు అందనంత దూరంలో ఉండటం, ఇనుప కంచె ఉండటం వలన ఆ శిల్పాలు క్షేమంగా ఉన్నాయి. కంచె లేకపోతే వాటిమీదకూడా పిచ్చి రాతలు, లవ్ సింబల్స్, పేర్లు చెక్కడాలు చేస్తారు మన ఘనులు. ఏకశిలపై ఒకే చోట ఇన్ని చెక్కడం మామూలు విషయం కాదు ఓ అద్భుతం. ఏ సౌకర్యాలు లేని ఏడో శతాబ్దంలో ఆ శిల్పులు ఈ శిల్పాలు చెక్కడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారో! అనిపించింది. రాజుల సొమ్ము (అది ప్రజల సొమ్ములే) రాళ్లపాలు అయినా అద్భుత శిల్పాలు చూసే0 అనిపించింది. ఫోటోగ్రాఫర్ చెప్పినదాని బట్టి, అర్జున పిలాన్సి 31 మీటర్ల పొడవు, తొమ్మిది మీటర్ల ఎత్తు ఉన్న ఏకశిల. ఈ చిత్రాలన్నీ ఫోన్ లో బంధించడం సాధ్యం కాలేదు. ఫోటోగ్రాఫర్ కి వంద రూపాయలు ఇచ్చి మొత్తం రావాలి అన్నాను. దాదాపు ఆ ఏకశిలా చిత్రాలను ఫోటోలో బంధించి ఇచ్చాడు.
సీ షోర్ టెంపుల్ కన్నా ముందు చూసాం కనుక భోలేడంత ఆశ్చర్యం కలిగింది. శిల్ప సౌందర్యములో మునిగిపోయిన నన్ను వదిలి మా వాళ్ళు చాలాముందుకు వెళ్ళిపోయారు. ఇది ప్రపంచంలోనే పెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం అట. దానిపైభాగాన కూడా పెద్ద పెద్ద బండ రాళ్లు ఉన్నాయి.
పరిగెత్తుకుంటూ వెళ్లి మా ఫ్రెండ్స్ ని కలిసాను. మల్లికార్జునరావు శ్రీకృష్ణుని బట్టర్ బాల్ (వెన్నముద్ద) ని చూద్దాం అన్నాడు. ముందుకు పోయాం. శ్రీకృష్ణుడికి ఈ బాల్ కి ఎలాంటి సంబంధం లేదు. ప్రకృతి సిద్ధంగా గుండ్రంగా ఏర్పడిన ఓ పెద్ద రాయి. సుమారు 6 మీటర్లు ఎత్తు, ఐదు మీటర్ల వెడల్పు ఉన్నప్పటికీ చాలా చిన్న బేస్ (అర మీటర్ కన్నా తక్కువ ప్రాంతం ఉంటుందేమో) నేలపై అని ఉంది. భూమి ఆకర్షణ శక్తి ప్రకారం అది కిందకు దొరలాలి. కానీ భూమి ఆకర్షణ శక్తి ఈ బాల్ విషయంలో పనిచేయకపోవడమే చిత్రంగా అనిపించింది. కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు మన మీదకు దొర్లదు కదా అన్నాను. దొర్లేదైతే ఎప్పుడో దొర్లేదే కదా అంది మా ఫ్రెండ్. దగ్గరకు వెళ్ళగానే ఆ భయాలన్నీ పోయి దాని నీడన చేరాం. జారేం. ఫోటోలు దిగేo. ఈ రాయిని పల్లవ రాజులు కదిలించడానికి ప్రయత్నించారో లేదో కానీ 1908లో ఈ ప్రాంతానికి అధికారిగా ఉన్న ఆర్థర్ హౌలాక్ ఈ రాయిని ఏడు ఏనుగుల చేత కదిలించడానికి ప్రయత్నించినా ఒక్క అంగుళం కూడా కదలలేదట.
ఇది ఉత్తరాయి కాదు. యునిస్కో ఈ బాల్ ని ప్రపంచం వారసత్వ సంపదగా ప్రకటించింది. దూరంగా ఉన్న మూడు పెద్ద పెద్ద రాళ్లు ఓ నిటారు గుడిసెలా భలే ఆకర్షించాయి. నేను మా ఫ్రెండు బట్టర్ బాల్ చుట్టూ తిరుగుదాం అని, జారుతున్నాయని చెప్పులు వదిలీ ఆ బాల్ చుట్టూ తిరిగాం. చెప్పుల్లేని కాళ్ళు చురచుర మంటున్నాయి. అయినా ఎడమవైపు ఉన్న ఆ మూడు రాళ్ల వైపు నేను, కుడివైపు ఉన్న గుహాలయాల వైపు మా ఫ్రెండ్ వెళ్ళాం. తల ఎత్తి ఆ మూడురాళ్ళ పైఅంచుల దాక చూశాను. రాళ్ళ నీడన చాలా చల్లగా ఉంది. నాలాంటి వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరికీ బండలు నాకు మాత్రం నిట్టాడు గుడిసకు గుంజలు పాతినట్లున్న ఆ రాళ్ళు అత్యద్భుత పకృతి సోయగంలా కనిపించాయి.
మా ఫ్రెండ్ వెళ్ళిన వైపుకు పరిగెత్తాను. వరాహ గుహాకేవ్ ఉంది.ఈ రాక్ కట్ ఆలయము నరసింహవర్మ1 కాలంలో ప్లాన్ ప్రకారం నిర్మింపబడింది. ఆలయం వెనక గోడకు ఒక మందిరంతో ఆర్కేడ్ హల్ ఉంది. ప్రవేశం ద్వారము, వ్యాల బేస్ తో కూడిన రెండుస్తంభాలు ఉన్నాయి. స్తంభాలపైన సింహం బొమ్మలు. ఈ గుహ ఆలయంలో పెద్ద వరహ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. దాని ఎదురుగా త్రివిక్ర అవతారం చాలా అందంగా చెక్కిన మరొక గుహాలయం ఉంది. అద్భుతంగా ఉంది. దాని పక్కనే గణేష్ రథ ఆలయం ఉంది.
ఈ ఏకశిలా ఆలయంను, ఈ ఆలయ శాసనం ప్రకారం "అత్యంత కామ పల్లవేశ్వరం" అని పిలుస్తారు. 'అత్యంతకామ' అనే బిరుదు పరమేశ్వరవర్మన్1 (672-700CE)కు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏకశిలా దేవాలయం దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. పైన ద్వితలసాల విమానం ఉంది. ముఖ మండపంలో రెండు సింహాస్తంభాల పిల్లస్టర్ లు ఉన్నాయి. (పిల్లస్టర్లు అంటే అందమైన చదునైన గోడ, లేదా సదునైన స్తంభాలు. స్తంభాలు కొంతవరకు అలంకారాలు ఉంటాయి) లోపల గణేష్ చిత్రం ఉన్నందున ఈ ఏకశిలా ఆలయాన్ని గణేశ రథంగా పిలుస్తారు. పూజలు చేస్తున్న ఆనవాళ్లు ఉన్నాయి. మొదట శివుని కోసం ఈ రథం నిర్మించారట. తర్వాత కాలంలో ఊరివాళ్లు గణపతిని ప్రతిష్టించారట. ఇది అంతా ఎదురుగా చెట్టు కింద వస్తువుల అమ్ముతున్న అతను చెప్పాడు. గుడి పైన బయట శివలింగాన్ని చూడవచ్చు.
రథం పైన రాకెట్ నమూనాన్ని, ఆపైన త్రిశూలాన్ని చెక్కారు. బాగా గమనిస్తే రాకెట్ లో ఆస్ట్రోనాట్ కూడా కనిపిస్తాడు. ఏడవ శతాబ్దంలో ఆస్ట్రోనాట్ను చెక్కడం ఊహకు కూడా అందడం లేదు. శివలింగాన్ని, త్రిశూలాన్ని ప్రత్యేకంగా (డిఫరెంట్ గా) చిత్రీకరించారు అంటారు. ఈ గుహా ఆలయాలన్ని దాదాపు అర్జున ప్రిలాన్సి ఉన్న కొండపై ఉన్నాయనిపించిoది. చూడటంలో లీనమైన నన్ను టైం అవుతుంది షోర్ టెంపుల్ కి వెళ్దాం రమ్మని కేకలేట్టారు. ఎదురు వచ్చిన మా ఫ్రెండు ఆ కాలం నాటి లైట్ హౌస్ మూసేశారు అని చెప్పారని చెప్పిOది. అది ఎక్కడుందో వివరంగా కూడా కనుక్కోలేకపోయాను. ఆటో ఎక్కి షోర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాo.
ఆటో దిగి ఓ వంద అడుగులేయ్యగానే షోర్ టెంపుల్ కనిపిస్తూ ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు. మన సృష్టికే అందాలు తెచ్చినారు పాట గుర్తొచ్చింది. దూరానికే చాలా బాగుంది. దారిలో నుండే ఫోటోలు తీసాం. నిజంగానే దగ్గర కన్నా దూరానికే చాలా బాగుంది. పన్నెండు వందల ఏళ్లకు పూర్వం ఈ ఆలయాన్ని రెండవ నర్సింహవర్మన్ కాలంలో గ్రానైట్ రాయితో నిర్మించారట. షోర్ టెంపుల్ బంగాళాఖాతం ఓడ్డుకు అభిముఖంగా ఉన్న మూడు దేవాలయాల సముదాయం. 1984లో యునెస్కో (వరల్డ్ హెరిటేజ్) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. పురాతన రాక్ కట్ దేవాలయం. మార్కోపోలు ఆ తర్వాత వచ్చిన యూరోపియన్లు ఏడు పగోడాలు అని పిలిచారు. ఆరు సముద్రపు అలల్లో మునిగిపోయాయట. షోర్ టెంపుల్ నావికులకు బహుశా ఒక ల్యాండ్ మార్క్ గా, పగోడాలాగా కనిపించి ఉండవచ్చు. 2004లో వచ్చిన సునామీ సమయంలో ఆ పగోడాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు కనిపించాయని మత్స్యకారులు, సందర్శకులు చెప్పారట.
పల్లపుల్లను ఓడించిన చోళులు కూడా షోర్ టెంపుల్ నిర్మాణాన్ని కొనసాగించారు. చిన్న శివాలయంలోని శాసనాల ప్రకారం మూడు ఆలయాలను క్షత్రియ సింహ పల్లవేశ్వర, రాజసింహ పల్లవేశ్వర, ప్లీకొoడ రులియా-దేవర్ అంటారట. మూడు ఆలయాలు ఒకే వేదికపై రాజమల్ల బిరుదాంకితుడైన రెండవ నరసింహ వర్మన్ (695- 722CE) కాలంలో పిరమిడ్ ఆకారంలో ఐదు అంతస్తులతో నిర్మింపబడిన ఆలయ సముదాయం. పిల్లిస్టర్ గోడలతో చుట్టూ నంది, సింహాల యొక్క శిల్పాలతో సముద్రపు అలలకు, తుఫానుల కు, ఉప్పుగాలులకు కూడా చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం ఆలయ సముదాయాన్ని జలశయన ఆలయం అని పిలుస్తారట.
ప్రధాన ఆలయం మరొక చిన్న ఆలయం శివునికి, మరొక ఆలయం శయన విషష్ణువుకు అంకితం చేయబడినవట. శివుడు లింగ రూపంలో, విష్ణువు శయనభంగిమలో ఉంటారట. గుడికి తాళాలు ఉన్నాయి. రెండు శిఖరాలు పిరమిడ్ ఆకారపు రూపురేఖలను కలిగి ఉన్నాయి. ఆలయం చుట్టూ నాలుగు వైపులా నంది విగ్రహాలు ఉన్నాయి. అయితే మామూలు గుళ్ళల్లో ఉన్న నంది విగ్రహాలకు ఈ విగ్రహాలకు కొంత తేడాగా కనిపిస్తున్నాయి. అన్ని నందులు తెల్ల గ్రానైటు రాయితో చెక్కబడి ఉన్నవి. ఆలయాల గ్రానైట్ మాత్రం అంత తెల్లగా కాకుండా కొద్దిగా నలుపు లేదా రాగి రంగులో కనిపిస్తుంది. పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన అతి పురాతన ఆలయాలలో ఇది ఒకటి. దీనిలో కూడా ఒక వైపున ఉన్న మూల కొంత కొట్టుకుపోయినట్లు ఖాళీ ఏర్పడింది.
గుడి కుడి వైపున ఓ పెద్ద కోనేరులా మెట్లు మెట్లుగా భలే ఉంది. దానిలో ఓ చిన్న రంధ్రం నీళ్లు పోవడానికా అన్నాను అక్కడున్న ఓ యాత్రికునితో. అతను నవ్వి అలల తాకిడిని బట్టి దీనిలో వాటర్ లెవెల్ పెరగడం తరగటం ఉంటుంది. దానిని బట్టి ఆలయ పూజారి తుఫాను హెచ్చరికలు చేసేవాడట ఇప్పటి వాతావరణ పరిశోధకల్లాగా అన్నాడు.
ఆ కోనేరులో ఉన్న గుంట చిన్న బకెట్ మూత అంత ఉంది. ఈ గుంటకు ఎడమ వైపున ఆ కోనేరులోనే ఓ విగ్రహం చాలా బాగుంది. పక్క గోడకు తొండం ఉన్న ఓ పెద్ద బొమ్మ చెక్కి ఉంది. బహుశా ఈ గుంటలోని నీటి పెరుగుదల ఆ విగ్రహానికి వచ్చేలెవెల్ని బట్టి హెచ్చరికలు ఉండేవి కావచ్చు. ఇది చాలా నచ్చింది. ఆ కాలంలోనే ఇది గొప్ప సాంకేతిక పరిజ్ఞానం. ఈ సాంకేతి పరిజ్ఞానం అబ్బురం అనిపించింది.
ఆలయం ఎడమవైపున సింహం, కోరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాని ఉదరంలో ఒక చతురస్రాకారపు రంధ్రం. దానిలో పార్వతి దేవి చెక్కబడింది. సింహం కుడి వైపు కాలిపై మరొక దేవత విగ్రహం చెక్కబడింది. ఈ సింహం ఎదురుగా తల తెగిపడిన మహిషం,కింద పడిన తల కూడా ఉంది. ఇది అలానే చెక్కారట. ఇది మహిషాసుర మర్దని యొక్క వృత్తాంతం తెలియజేస్తుంది. చిన్న శిల్పము లో ఎంత వృత్తాంతం ఉందో కదా! అనిపిస్తుంది. ఇంకా ఏమి ఉందో చూద్దామని మా వాళ్లు ముందుకెళ్ళి పోయారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అరుణాచలం, కంచి, మహానంది, ఆహోబిలం లాంటి చాలా పెద్ద పెద్ద ఆలయాలు, వాటి శిల్పాలు చూసినవారికి ఈ మహాబలిపురం ఆలయాలు చాలా చిన్నగా అనిపించి, ఆ! ఏముందిలే అనిపించవచ్చు. ఓ క్షణంలో పావుక్షణం నేను అనుకున్నా! కాని ఇవి రాతితోనూ, ఇటుకలతోను కట్టినవి కావు. రాళ్ళపై చెక్కిన శిల్పాలు కాదు. చిన్న చిన్న గ్రానైట్ కొండలను తోలుస్తూ చెక్కిన చిన్న చిన్న ఆలయాలు. ఆలయాలపై శిఖరాలు, ఆ శిఖరాలపై అద్భుతంగా చేక్కిన ఆస్ట్రోనాట్లు. ఏకశిలపై చెక్కిన పంచరథాలు,వాటి శిఖరాలు. వాస్తవ జీవితాలను ప్రతిబింబించే అర్జున, పాండవ కేవులు. భూమి ఆకర్షణ శక్తి పనిచేయని శ్రీకృష్ణుని వెన్న ముద్ద. ఒకే రాతిపై మూడు ఆలయాలు చెక్కిన షోర్ టెంపుల్, సముద్రపుగాలికి కూడా చెక్కుచెదరకపోవడం.కోనేరు లాంటి వాతావరణ హెచ్చరిక కేంద్రం. అన్ని సాంకేతిక అద్భుతాలుగానే అనిపించాయి. దాదాపు పన్నెండువందల సంవత్సరాలు అయినా ఇక్కడి ఏ ఆలయo దాని సహజ రంగు మారలేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే మహాబలిపురం మహా అద్భుతంగా ఉంటుంది. చరిత్ర కొంత తెలిసినా, చూడాల్సిన అంశాలు కూడా తెలుసుకొని వెళ్ళి, వాటిని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయాలను క్షుణ్ణంగా పరిశీలించే సమయం లేనందుకు చాలా దిగులేసింది. అయినా చదువుకునే కాలం నాటి కోరిక పైపైనన్న తీరిందన్న ఆనందం హృదయములో తొనికిసలాడింది. మరోసారి చూద్దాం అని,దారి తప్పుతానని, నా పరిశీలన ఆపి వారి దగ్గరికి వెళ్లాను. అదంతా చెట్లతో నిండిన పార్క్. గుడి, పార్కు సముద్రమట్టం కన్నా చాలా ఎత్తుగా ఉంది. సముద్రం వైపు నాలుగు అడుగుల ఎత్తున గోడ, దానిపైన ఇనప సువ్వలు. సముద్రపు ఒడ్డున జాలర్లు, కొంతమంది పర్యాటకులు. పార్కులో ఆశ్చర్యపరిచిన అంశం, పిండం తినటానికి కూడా కాకులు లేకుండా అంతరించిపోతున్న కాలంలో, మనుషులకు దగ్గరగా ఆహారం కోసం కాకులు రావడం. కాకులను చూసి చాలా కాలం అయిందని బిస్కెట్లు వేస్తూ, ఫోటోలు తీస్తూ ఆనందించాం.
లైట్ హౌస్ సంగతి మర్చిపోయాం. బస్టాండ్ దగ్గర ఉన్న గుడి అన్న చూద్దామని గుడి దగ్గరకు వచ్చాం. తల సేన పెరుమాళ్ళ టెంపుల్. చాలా పెద్దగానే ఉంది. పురాతన విష్ణువు శయన ఆకారంలో ఉన్నాడు. పూజారిని ఎన్ని పిల్లర్స్ (స్తంభాలు) ఉన్నాయని అడిగినా చెప్పలేకపోయాడు. ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడిగినా ఖచ్చితంగా చెప్పలేదు. అందరూ ఏడు గుడులున్నాయని, సముద్ర తుఫానులకు సముద్రంలో కలిసిపోయాయి అని చెప్పారు, వెయ్యి స్తంభాల గుడి లాగా ఎన్ని స్తంభాలు ఉన్నాయి అని తమిళం లో అడిగినా కూడా. ప్రతి గుడిలో ఆ వివరాలు ఉండాలి. గుడి చుట్టూ తిరిగి పిల్లర్లు డిజైన్లు పరిశీలిస్తుంటే ఓ మహిళ ముగ్గు వేస్తున్న తీరు బలే నచ్చింది. ఒకేసారి రెండు గీతాలు భలే స్పష్టంగా గీస్తుంది. రెండు నిమిషాల్లో ముగ్గు గీయటం పూర్తయింది భలే వేస్తున్నారంటే ఆమె నవ్వింది. ఆ నవ్వు కూడా ఆమె ముగ్గులాగా చాలా అందంగా ఉంది. పొద్దుకూకుతున్నందువల్ల లైట్ హౌస్ చూడకుండానే చిన్న అసంతృప్తితో బస్సు ఎక్కి తామ్రం, అక్కడినుండి చెన్నై చివార్లలోని మల్లికార్జున్ రావు గారి ఇంటికి వచ్చాం.
మహాబలంపురం మొత్తాన్ని(UNESCO వరల్డ్ హెరిటేజ్) యునెస్కో ప్రపంచం వారసత్వ సంపదగా ప్రకటించింది. ఎవరైనా మామల్లపురం ను నిదానంగా చూడాలనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పడుతుదని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి.
మూడో నాలుగో తరగతలు చదువుతున్నప్పుడు మా నాన్న యాత్ర బస్సులో, మహాబలిపురం, కంచి, చెన్నై మొదలైనవి చూపించారు. కాని, మహాబలిపురం దారిలో చెట్లకు వేలాడుతున్న పనసకాయలు, కంచిలో బంగారు బల్లిని అందకపోతే ఎత్తుకొని తాకించిన గుర్తు, మద్రాస్ లోని మ్యూజియంలో కొన్ని కొన్ని మాత్రమే గుర్తున్నాయి. (అప్పుడు దీన్ని చచ్చిన కాలేజిఅని, 'జూ' ను బ్రతికిన కాలేజీ అని చెప్పారు) ఈ మ్యూజియంలో పెద్ద పెద్ద అస్తిపంజరాలు(పెద్ద పెద్ద చేప ముళ్ళు బాగా గుర్తున్నవి) లీలగా గుర్తున్నవి. ఈ మ్యూజియం చూద్దామని అందరినీఊరించా. పాపo అందరు నా కోసం మరుసటి రోజు ఆగారు. కానీ, ఆ రోజు శుక్రవారం మ్యూజియంకు సెలవట.పిచ్! ఏం చేస్తాను. కోరిక తీరకుండానే రైలు ఎక్కేసాం.