ఏడాదంతా ఆదాయం ఇచ్చే జీవవైవిధ్య సేద్యం !

మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వంటి సమస్త జీవరాశిని కాపాడుకోవడమే జీవవైవిధ్యం;

Update: 2025-05-26 06:53 GMT
పాడేరు లో జీవవైవిధ్య సాగు

అక్కడే ఫారం పాండ్‌, దాని చుట్టూ మునగ,బొప్పాయి,జామ చెట్లు.

నన్ను చూడమంటూ పాండ్‌లో చేపలు మునకలు వేస్తుంటాయి.

కాస్త దూరంలో ఆకుపచ్చని పందిరికి వేలాడుతున్న కాకర,బీర, చిక్కుడు.

ఇంకో పక్క నేల విడిచి తాళ్లకు పాకుతున్న టమాటా మొక్కలు.

మరోవైపు కొండగాలికి ఊగుతున్న జొన్న, సజ్జ పైరు.

దూరంగా చిక్కగా పెరుగుతున్న పశు గ్రాసం, దానిని కోసి గేదెలకు వేస్తున్న రైతులు.

అటు పక్కనే నాటు కోళ్ల కోసం చిన్న గూడు.

ఇదంతా కేవలం అర ఎకరా లేదా ఎకరంలో జరుగుతున్న కొత్త వ్యవసాయ విధానం.

అదే జీవవైవిధ్య వ్యవసాయం. ఏడాదంతా భూమిని కప్పి ఉంచే పంటలతో ఆరోగ్యవంతమైన ఆహారం సృష్టిస్తూ సుస్ధిర ఆదాయం పొందుతున్న కొందరు రైతులను తెలంగాణ,ఆంధ్రాలో మేం కలిసినప్పుడు చిన్న కమతాల్లో కూడా అధిరిపోమే ఆదాయం ఎలా సృష్టించ వచ్చునో మాకు వివరించారు.

జీవవైవిధ్యం ( Biodiversity ) అంటే? 

‘ ఈ భూమిపై ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది.

మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వంటి సమస్త జీవరాశిని కాపాడుకోవడమే జీవవైవిధ్యం.

అది తగ్గితే, పర్యావరణ, ఆహార భద్రత సమస్యలు వస్తాయి. ఎకోసిస్టమ్‌ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే మేము తూరుపు కనుమల్లో నాలుగు గ్రామాల్లో వ్యవసాయం ద్వారా జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలో రైతులకు చెప్పి అనుసరించేలా చేస్తున్నాం.’ అన్నారు పాడేరులో గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న రవి. ఆయన గత దశాబ్దకాలంగా వివిధ ఎన్జీఓలతో కలిసి పనిచేశారు. ఇపుడు అమృతా వెల్ఫేర్‌ సొసైటీలో కోఆర్టినేటర్‌గా ఉన్నారు. వీరి కృషి వల్ల పాడేరు కొండల్లో పలుపంటలతో రైతులు జీవ వైవిధ్యాన్ని కాపాడే సేద్యం చేయడమే కాక సొంత దేశీ విత్తనాలను కాపాడుతున్నారు.

అమృతా స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి రవి

అదాయం గ్యారంటీ , అప్పులు లేవు 

‘ కొండవాలులో నాకున్న ఎకరంలో ఇరవైరకాల బహుళ పంటలు సాగు చేస్తున్నాం.

ఒకే రకమైన పంట కాకుండా, వేర్వేరు రకాలు వేసి జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాం, రాగులు, జొన్నలతో పాటు అరటి,కాయగూరలు, స్వీట్‌ పొటాటో, అలిసెలు(నూనెజాతి పంట) , పసుపు పండిస్తున్నాం, పావు ఎకరంలో ఔషధ మొక్కలు వేశాను.

దిగుబడులను ప్రతీ వారం సంతకు తీసుకెళ్లి అమ్ముతాం.2 నుండి 3వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధానం పాటించక ముందు తగిన దిగుబడులులేక అప్పులు చేయాల్సి వచ్చేది.’ అన్నాడు పాడేరులోని సంగోడి రైతు కల్యాణం.

అల్లంతో పాటు వివిధ రకాల పంటలు వేసిన పాడేరు రైతమ్మ,

కాఫీతోటల్లో అంతరపంటలు 

‘ఒకపుడు మా ప్రాంతంలో సిల్వర్‌ ఓక్‌ చెట్ల నీడలో కాఫీ మొక్కలు మాత్రమే పెంచేవాళ్లం కొన్ని చోట్ల మిరియాలు పండేవి. కాఫీ పంట తరువాత నేల ఖాళీ అయిపోతుంది. అలా కాకుండా ఇపుడు పసుపు,అరటి, నిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌ ని అంతరపంటగా వేశాం.దీనివల్ల కాఫీకి అదనంగా ఏడాదంతా ఎంతో కొంత ఆదాయం పొందుతున్నాం.’ అన్నారు అరకు సమీపంలోని డుంబ్రిగుడ, పాడేరుకు చెందిన రైతులు.

కాఫీతోటల్లో అంతర పంటల కోసం పండ్లమొక్కలు నాటుతున్న పాడేరు రైతు

అరకు లో కాఫీ పంటను అధికంగా పండిస్తారు. కానీ ఒకే పంట మీద ఆధార పడటం వల్ల ఆదాయం తగ్గిపోతుంది. వ్యవసాయ నిపుణుల సలహాలతో వాసన్‌ సంస్ధ ఇక్క డ అంతర పంటల విధానం పై రైతులకు శిక్షణ ఇచ్చి సాగుచేయిస్తున్నారు.

అరకు లో ఎకో ఫార్మ్‌పాండ్‌,

వరిలో వైవిధ్య పంటలు 

హైబ్రిడ్‌ వరి రకాల వల్ల ఎక్కువ రసాయనాలు వాడాల్సి వస్తుంది. దీనివల్ల నేలకాలుష్యం పెరగడమే కాక సాగునీటి వినియోగం అధికం అయి భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.

దీనికి భిన్నంగా తక్కువనీటితో సాగు అయ్యే బ్లాక్‌ రైస్‌, రెడ్‌ రైస్‌ పండిస్తున్నాడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి.

దేశీ వరి రకాలు సాగుచేస్తున్న సిద్ధిపేట జిల్లారైతు తిరుపతి

‘ తొలిసారిగా మన పూర్వీకులు పండిరచిన ప్రాచీన వరివంగడాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, గౌతమ బుద్ధ రైస్‌, బ్లాక్‌ రైస్‌ విత్తనాలు సేకరించి పండిస్తున్నాం.

ఈ ధాన్యం నల్లని పొట్టుతో లోపలి గింజ సన్నగా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల రక్తహీనత, అల్జీమర్స్‌,మధుమేహాం వంటి వ్యాధులను నియంత్రిస్తుంది అని ఆహార నిపుణుల ద్వారా తెలుసుకొని మాకున్న రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నాం, ఎపుడూ ఒకే రకం వరి కంటే ఇలాంటి అదుదైన రకాలు పండిరచడం వల్ల జీవవైవిధ్యం మెరుగవుతుంది.నేలలో సారం పెరుగుతుంది.అంతేకాదు, దేశీ విత్తనాలను

భద్రపరిచి, స్థానిక రైతులందరికీ పంచుతున్నాం.’ అన్నారు తిరుపతి.

ఎకో ఫార్మ్‌పాండ్‌ ( eco farm pond ) 

చెరువు చుట్టూ వివిధ రకాల కాయగూరలు, పండ్ల మొక్కలు నాటి , చెరువులో చేపలను పెంచుతూ పంటలతో పాటు అదనపు ఆదాయం పెంచడానికి ఎకో ఫార్మ్‌పాండ్‌ విధానాన్ని మాకు కొందరు రైతులు అరకు, పెద్దపల్లిలో చూపించారు.

అల్లంతో పాటు వివిధ రకాల పంటలు వేసిన పాడేరు రైతమ్మ,

‘మాకున్న ఎకరంలో వాలును బట్టి నీటికుంటను నిర్మించుకున్నాం. వాననీరంతా అక్కడ చేరి సాగుకు ఉపయోగ పడుతుంది. దాని చుట్టూ వివిధ రకాల పండ్లమొక్కలు , మునగ, బెండ వంటి కాయగూరలు వేశాం. చేపలను కూడా పెంచుతున్నాం.

కన్నాల గ్రామంలో చేపల పెంపకంతో ఆదాయం పొందుతున్న రైతులు

పక్కనే పందిర్ల పై తీగజాతి కాయగూరలు, ఒక గేదెను, పదినాటు కోళ్లను కూడా పెంచుతున్నాం. వాటి వ్యర్దాలు ఎరువుగా ఉపయోగ పడుతుంది. ఈ విధానంలో సాగు చేయడం వల్ల పంటలు,పాలు, చేపల మీద ఏడాదంతా ఆదాయం ఉంటుంది. ఇంటికి పోషకాహారం అందుతోంది’ అన్నాడు పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం, కన్నాల గ్రామానికి చెందిన రైతు సదానందం. వీరు చేస్తున్నది ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ సిస్టం.

పెద్దపల్లి లో సమీకృత వ్యవసాయ విధానంలో పూల సాగులో రైతులు

పాత పద్దతుల్లో పంటలు పండిస్తూ సరైన దిగుబడి లేక నష్టపోతున్న రైతులను లాభసాటి వ్యవసాయం వైపు మళ్లించే కొత్త విధానమే సమీకృత వ్యవసాయ పద్ధతి .

ఒక ఎకరంలో సాధారణ పంటలతో పాటు పశువులు, కోళ్లు , చేపలు, ఉద్యానవన సాగు ద్వారా రైతులకు ఆదాయం పెంచి, పర్యావరణ హితం అయిన సేద్యమే సమీకృత వ్యవసాయం. షార్ప్‌ స్వచ్ఛంద సంస్ధ, నాబార్డ్‌ సహకారంతో పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి ,కమాన్‌పూర్‌,అంతర్గాల మండలాల్లోని కన్నాల, రాణాపూర్‌, జిడి నగర్‌,పేరపల్లి, అంతర్గాల, బ్రాహ్మణపల్లి, బ్రాహ్మణపల్లి తండా ల్లో ఐఎఫ్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ని గత రెండేళ్లుగా అమలు చేసి జీవవైవిధ్యాన్ని కాపాడటమేకాక రైతుల ఆదాయం మెరుగు పరిచింది.

టమాటా సాగులో కన్నాల రైతు కుటుంబం.

పర్యావరణ హిత సుస్ధిర వ్యవసాయం దిశగా 

వాతావరణమార్పులను తట్టుకునే సాగుపద్దతులు, అగ్రోఫారెస్ట్రీ, సమీకృత వ్యవసాయవిధానాల పై రైతులకు అవగాహన కలిగించడానికి వివిధ స్వచ్ఛంద సంస్దలు దశాబ్దకాలంగా మారుమూల గ్రామాలో చేస్తున్న కృషికి ఇపుడిపుడే ఫలితాలు వస్తున్నాయి.

ఆరోగ్మవంతమైన పంటల కోసం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం తగ్గిస్తున్నారు. దాని వల్ల మట్టి సూక్ష్మజీవులు నశించకుండా ఉన్నాయి.

పొలాల చుట్టూ చెట్లు, ఔషధ మొక్కలు పెంచడం ద్వారా పక్షులను కాపాడుతున్నారు

చెక్‌డ్యామ్‌లు, కుంటలు, వాలులో కందకాలు నిర్మించి, నీటి వనరులను రక్షిస్తూ, దిగుబడిని పెంచుతూ , వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపక్ష్యాదులను కాపాడడం ద్వారా వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.

రొటేషన్‌ క్రాప్‌ విధానం (పంటల మార్పిడి) పాటించి, మట్టిలోని పోషకాలను అభివృద్ధి చేస్తూ సేద్యాన్ని జీవవైవిధ్యానికి అనుకూలంగా మార్చుతున్న ఈ రైతులు దేశానికే ఆదర్శం కాదా?

Tags:    

Similar News