Elephant Apple | వెలక్కాయలండీ, పచ్చడి చేసి తిందాం రండి!
ఏడాదిలో ఒక్కసారైన వెలగపండును ఎందుకు తినమంటారంటే.. ఇందులో ఔషధగుణాలు చాలా ఎక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు.;
కొత్త సంవత్సరం.. జనవరి మొదటి వారం.. ఓ చల్లటి సాయంవేళ హైదరాబాద్ ఫేమస్ టీ తాగుదామని నేను, మా సీనియర్ జింకా నాగరాజు ఎర్రగడ్డ రైతు బజారు వైపు బయలుదేరాం. మెంటల్ హాస్పటల్ దాటి కొంచెం ముందుకు వస్తే నడవడానికి కూడా వీలుల్లేనంతగా రోడ్డుపై పండ్ల బళ్లు కనబడుతుంటాయి. వాటిని చూసుకుంటూ మేము ముందుకు సాగుతుంటే ఓ బండిపై మమ్మల్ని ఆకట్టుకున్న ఓ కాయ కనబడింది. మా ముఖాలు వెలిగిపోయాయి. ఒక్కసారిగా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఆ కాయ కోసం మేమేమి చేశామో, రాళ్లతో ఆ కాయను కొట్టి తినడానికి ఎన్ని తంటాలు పడ్డామో చెప్పుకుంటూ ..ఆ బండి యజమాని దగ్గరకు వెళ్లి... ఈ కాయల్ని ఇక్కడ ఏమంటారన్నాం. మేమేదో వెటకారంగా అడిగామనుకున్నాడో ఏమో ... మా వైపు ఎగాదిగా చూసి .. వెలక్కాయంటారని (Elephant Apple) ముఖం తిప్పేసుకున్నారు. సర్లే అనుకుంటూ.. కాయలెక్కనా, కిలోల లెక్కనా, ఎలా అమ్ముతున్నారని అడిగాం. కాయల్లెక్కే అంటూ.. ఇదిగో ఈ కాయ అయితే ఒక్కొక్కటి రూ.80, ఆ పెద్ద కాయలైతే ఒక్కొక్కటి వందా అన్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే..
ఆ సామెత గుర్తుందిగా...
గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అనే సామెత గుర్తుందిగా. మాకదే గుర్తుకువచ్చింది. చిన్నప్పుడు బస్సుల కోసం బీళ్లకి అడ్డంపడి పోతుంటే దారిలో అక్కడక్కడ ఈ చెట్లు కనిపించేవి. 20, 30 అడుగుల ఎత్తున ఉండేవి. చెట్టు ఎక్కాలంటే మొదలుకి (కాండం) ముళ్లుండేవి. బూడిద రంగు బెరడు ఉంటుంది. లేత ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పూలుండేవి. . కాయలెక్కడో ఉండేవి. వాటిని రాళ్లతో కొట్టాలి. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఎలా కొట్టాడో గాని మోర పైకెత్తి చేతులు నొప్పులు పుట్టేంత వరకు కొట్టినా ఒక్కటీ రాలేదు కాదు. ఏదైనా ఒకటి గురితగిలి కింద పడిందనుకోండి. ఇక చూస్కో..
మనం కొట్టిన కాయ చెట్టు మీద నుంచి కింద పడితే ఇక పండగే. దాన్ని అపురూపంగా తీసుకుని.. మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ల వైపు ఒకింత విజయగర్వంతో చూసి.. దాన్ని రెండు వక్కలుగా పగలగొట్టి తింటుంటే ఉండే మజాయే వేరు. కాస్తంత వగరుగా, తియ్యగా, పుల్లగా భలేగా ఉంటుంది. దాన్లోని గుజ్జును బోటన వేలి గోటితో గోకి తింటుంటే.. నా సామి రంగ దాని రుచే వేరు. జిగురుజిగురుగా ఉండే గుజ్జును నాలుక మీదుంచుకుని చప్పరించి చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించనలవి కాదు. అందులో అక్కడక్కడ తెల్లటి చిన్న విత్తనాలు కూడా ఉంటాయి.
వినాయక చవితికి పిందెలు పిందెలుగా ఉండి టెంకె ముదరకుండా ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నాటికి కాయ పక్వానికి వచ్చి మార్కెట్ కి వస్తుంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక పుల్లపుల్లగా ఉంటుంది. చెట్టు ఏపుగా పెరుగుతుండేవి గతంలో. ఇప్పుడు అన్ని పంటల మాదిరే వెలగ పంటనూ సాగు చేస్తున్నారు. ఈ ‘వెలగ చెట్టు’ను ఉడ్ యాపిల్ ట్రీ, మంకీ యాపిల్ ట్రీ, ఎలిఫెంట్ యాపిల్ ట్రీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పండంటే ఏనుగులకు చాలా ఇష్టం. అందుకే ఎలిఫెంట్ యాపిల్ ట్రీ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. దీని శాస్త్రీయ నామం లిమోనియో ఎసిడిసిమా. రూటేసి కుటుంబం.
4వేల ఏళ్ల చరిత్ర ఉందట...
భారతదేశంలో దాదాపు 4వేల సంవత్సరాల కిందటే ఈ చెట్టు ఉన్నట్టు కనుగొన్నారు. గణపయ్యకు నా పండంటే చాలా ఇష్టమట. వినాయక చవితి పూజలో అది కచ్చితంగా ఉండాల్సిందే. అప్పటి నుంచి వేసవి వరకు ఎక్కువగా కాస్తుంటుంది. భారత్, థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్, శ్రీలంక ఇంకా దక్షిణ ఆసియా దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. నన్ను ఎప్పుడైనా చూశారా? రహదారుల పక్కన అక్కడక్కడ కనిపిస్తుంటా. 30 అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తా. నా వృక్షం చిన్న చిన్న ముళ్లతో బూడిద రంగు బెరడుతో ఉంటుంది. ఈమధ్య మీరెప్పుడైనా రైతు బజారుకు పోయారా? పోయింటే ఈ వెలక్కాయ కచ్చితంగా కనబడి ఉండాలి. ఈ కాయతో చాలా ఇళ్లల్లో పచ్చడి చేస్తుంటారు.
పచ్చడి ఎలా తయారు చేస్తారంటే..
ముందుగా ... పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, దనియాలు, మెంతులు, జీలకర్రను నూనెలో వేపి రోళ్లు లేవు గనుక మిక్సిలో వేసి పూర్తిగా మెత్తగా కాకుండా బరకబరకగా పట్టి ఓపక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓ కాయను పగలగొట్టి అందులోని గుజ్జును ఓ గిన్నెలోకి తీసుకుని మిక్సి పట్టండి. ఇది కూడా కాస్తంత బరకబరకగానే ఉండేట్లు చూడండి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి తిరగమోత వేయండి. తిరగమోత గింజలు వేసేటప్పుడే తగిన ఉప్పు కూడా వేయండి. దోరగా వేగిన తర్వాత తడి లేని గిన్నెలోకి తీసుకుని వేడి వేడి అన్నంతో తిని చూడండి. మీకే తెలుస్తుంది మజా. ఈ పచ్చడి ఓ వారం రోజుల వరకు ఉంటుంది.
ఇంకో పద్ధతిలో కూడా పచ్చడి చేస్తుంటారని మా సహచరుడు సుబ్బూ వాళ్లమ్మ చెప్పారు. అదో శాస్త్రీయ పద్దతి. ముందుగా వెలగపండుని సన్న మంట మీద కాల్చాలి. అందులోని గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో బెల్లం, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. బాండీలో (కడాయి) నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మిక్సీ వేసుకున్న పచ్చడిలో ఈ పోపు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. వేడివేడి నెయ్యితో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. నోటికి రుచి తెలియకుండా ఉన్నప్పుడు ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది.
వెలగపండులో ఉండే క్యాలరీలు ఎన్నీ..
వంద గ్రాముల వెలగపండు గుజ్జు నుంచి 518 క్యాలరీల శక్తి వస్తుంది. ఇందులో 31 గ్రాముల పిండి పదార్థాలూ ఉంటాయి. దీంతోపాటు ప్రొటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ అమ్లాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్యులు దీన్ని ఔషధాలలోనూ వాడుతుంటారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట. కడుపులో నులిపురుగులు, క్రిములని వెలగపండు గుజ్జు తొలగిస్తుంది. రక్తహీనతను తొలగిస్తుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది. దీనిలోని జిగురు పేగులకు మంచిది. పేగుల్లో వాపుని, నోటిపూతను తగ్గిస్తుంది. ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి.
అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. అయితే షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఈ పండును డాక్టర్ల సలహా మేరకే తినాలి.