ఇద్దరు బందీలు!

నేటి మేటి కవిత;

Update: 2025-07-27 00:30 GMT

ఆమె

పొయ్యి ముందు పొగ చూరిపోయింది.
వంటింటి గోడల మూలల్లో
వొదిగి పోయిన ఆమె చుట్టూ
ప్యూపా ఘనీభవించిపోయింది.
కాంతి లేదు.
అంతా చీకటే!
ఆమె లోపలే బందీ అయి పోయింది.
**
ఇటు అతను కూడా
లివింగ్ రూంలో
పేపర్ చదువుతూ
సాలె గూడులో చిక్కుకు పోయాడు.
కానీ అతనదే వెలుగనుకున్నాడు .
సోఫాని సింహాసనం అనుకున్నాడు.
దాన్నిక వదల్లేదు.
*
ఆమె చీకటిని గుర్తు పట్టింది!
యుగాలుగా ఆమె ప్యూపా
బద్ద లయ్యేంతగా పెనుగులాడింది.

వంటింటి కిటికీ కుండీలో అతను పెట్టిన

క్రోటన్ మొక్క కమిలిపోయింది.

ఒకనాడు
ఒంటరి దుఃఖాన్ని తుడుచుకుని,
చీకటి రంగుని వదుల్చుకుని
రంగుల రెక్కలతో
ప్యూపా గోడలని బద్దలు చేసుకుని
తన తోటని
వెతుక్కుంటూ ఎగిరిపోయింది.
*
అతను చీకటిని గుర్తు పట్టలేదు.
ఎందుకంటే
అతనే సూర్యుణ్ణి ఆర్పేసే వాడు కాబట్టి
ఆమె తనకి దూరంగా
వెళ్ళిపోయిన సంగతి కూడా
చూడలేని అంధు డైపోయాడు.
అక్కడే సాలె గూళ్ళో
బందీ అయిపోయాడు.


Tags:    

Similar News

నువ్వే!

కష్ట కాలం