"శవాలను ప్రవేశ పెట్టు"

నేటి మేటి కవిత: గీతాంజలి;

Update: 2025-05-26 20:11 GMT
source: Connie Cagampang Heller instragram

అవును! శవాలే కావాలిప్పుడు!

యుద్ధాల్లో..బాంబులు .. మిస్సైళ్ళు

ఏకే -47 లు రసాయనాయుధాలు 

వైరస్ లు కాదు...లైంగిక హత్యాచారాలు కాదు..

శవాలనే మాట్లాడనీయాలి!

అందునా దాచిపెట్టబడిన శవాలే నిజాలు చెబుతాయి!

అవి పిల్లలవైనా...పెద్దలవైనా

ఆదివాసీలవైనా...ముస్లింలవైనా... స్త్రీల వైనా ...

ఎవరివైనా సరే!

మనుషులు కాదు!

మనుషుల్ని ఎవరు నమ్మరు ఇప్పుడు?

నువ్వు అవమానించి చంపిన బిడ్డల శవాలకైనా

చివరిస్నానం చేయించి ఇంత పాల బువ్వైనా పెట్టుకోనీ ఆ తల్లులను!

అమ్మల హక్కురా అది!

అందుకే..

శవాలే కావాలిప్పుడు!

శవాలను ప్రవేశపెట్టు!

***

నిజం సూర్యుడు!

అబద్ధం అంధకారం!

గాజా నుంచి బస్తర్ దాకా

నువ్వు భూమి కోసమే కదా మనుషుల్ని చంపుతున్నది?

వాడు పరాయి దేశ ప్రజల్ని చంపుతున్నాడు!

నీతో నీ దేశ ప్రజలనే చంపిస్తున్నాడు!

***

ఇప్పుడిక దేహాలను నిర్జీవం చేసావు కదా

అంత భయం ఎందుకు చెప్పు?

వాళ్ళ శవాలు గగనమెత్తు స్థూపాలుగా మారి

చరిత్రనీ ప్రపంచాన్నీ అబ్బురపరుస్తాయనా?

దేనికోయి భయం?

నువ్వు చేసింది ధర్మ యుద్ధమే అయితే

శవాలను ప్రవేశపెట్టు!

***

నిర్జీవం చేసే ముందరు

యోధులు చేసిన యుద్ధ విన్యాసం 

పాడిన యుద్ద గానం

వాళ్ళ స్వచ్ఛమైన దేశభక్తి నీ వెన్నుని వణికించింది కదా!

పిరికి వాడివి!

యోధుల శవాల ముందు

నువ్వు ఓడి చేసిన మృత్యు నృత్యం ఉంది చూడూ

నీ కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించి ఉంటుంది.

నీకు యుద్ధ తిలకం దిద్ది

పంపినందుకు సిగ్గుపడి ఉంటుంది.

హత్యలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన నిన్ను చూసి

నీ పిల్లలు భయంతో వణికి ఉంటారు

మా నాన్న మంచోడని వాళ్ళైనా ఎలా చెబుతారు చెప్పు? 

అందుకే శవాలను ప్రవేశపెట్టు!

*****

అవును కదా..

నువ్వు మాయం చేసిన శవాలే మాట్లాడతాయిప్పుడు!

నువ్వు దాచిన దాపుల్లోంచి తమకు తామే నడిచి వస్తాయి!

తమ జాడ చెబుతాయి!

తమ ఊరూ వాడా చేరుకుని అమ్మల ఒడిలో వాలి సేద తీరతాయి!

అంతేనా..

"అన్నా మీ  హక్కుల కోసం..

వాళ్ళ కంచంలో అన్నం ముద్దవడం కోసం కూడా

మేము తుపాకీ పట్టామని" నీ చెవిలో ప్రేమగా గుస గుస లాడతాయి!

*****

ఇంకా నీకు తెలీక పోవచ్చు కానీ..

అమరుల శవాలకు కూడా... దేశ భక్తి ఎక్కువే!

దానికే కదా నువ్వు భయపడేది?

నువ్వు మాయం చేసిన శవాలను పోస్ట్ మార్టం చేస్తే కనపడేది 

నువ్వు పెట్టిన చిత్ర హింసల గుర్తులే కాదు

ఆ అమరుల గుండెల్లో వాళ్ళు రక్షించిన

ఈ దేశపు అడవులు,గుట్టలు,భూములతో పాటు..

బోలెడంత దేశభక్తితో పారే రక్తం!

అందుకే..శవాలను ప్రవేశపెట్టు!

చూస్తూండు..మనుషులు కాదు శవాలే నిజాలు మాట్లాడతాయి!

శవాల ఆగమనం కోసం ఎదురు చూడు!

ముందు నువ్వు ఆ శవాలను ప్రవేశపెట్టు!


Tags:    

Similar News