'గాజా నుంచి గచ్చిబౌలి దాకా వాడికి నీ భూమి కావాలి...'
గీతాంజలి హెచ్ సీయు ’భూమి కవిత’;
నెమలీ జింకా ఆదివాసీ ఈ అడవి మీ ఇల్లు కాదా?
మీ హక్కు కాదా !
మీ పూర్వీకుల జన్మస్థలం కాదా?
మీ పురాఃజ్ఞాపకం కాదా...
అడవి మీ షాన్ కాదా? కానీ వాడు కాదంటున్నాడు!
గాజా నుంచి గచ్చిబౌలి దాకా వాడికి మీ భూమి కావాలి !
జగాన ఉన్న భూమంతా వాడిదే అంటున్నాడు!
జల్ జంగల్ - జమీన్ అన్నీ నావే అనే బూబకాసురుడు వాడు!
వాడు ఏకంగా ఒక మహా క్రూర జేసీబీ!
పిల్లల్ని... మూగ జీవాల్ని చంపుకుంటూ
భూమిని తొలుచుకుంటూ పోతున్నాడు.
మందుల కంపెనీల కోసం అన్నంపెట్టే రైతుల భూములకు...
పశురాలతో సహా నిప్పెట్టినవాడు !
దయలేకుండా చచ్చిపోయి
భూమిని తనకిమ్మని
ఉరితాళ్లని పూల హారాల్లాగా
రైతుల మెడలో వేసినవాడు!
రైతుల మలి పంటకోసం దాచుకున్న
ఆఖరి వడ్ల గింజల్ని కూడా గుంజుకున్నవాడు.
గాజా నుండి పోలేపల్లి భూముల దాకా
మనుషుల నెమళ్ల,జింకల,పసిపిల్లల మీదుగా
తానే బుల్డోజర్లై చిదిమేస్తున్నవాడు !
పసిపిల్లలూ .,జింకలూ..ఆదివాసీలు ఒకటే వాడికి!
వాడొక అంతర్జాతీయ రియల్టర్...
వాడొక అంతర్జాతీయ అధర్మ యుద్ధ క్రిమినల్!
**
వాడికి అడవి నొప్పి తెలీదు !
చెట్లను హత్యలు చేసే హంతకుడు వాడు!
అడవిలోని నదుల మీద వ్యాపార నావలు నడిపేవాడు.
అడవిలోని అన్ని మూలల్లో
సిమెంటు కంకర నింపేస్తున్నవాడు!
అడవినుంచి రోడ్లను...కాంక్రీటు నగరాల్ని
ఐ టీ హబ్ లను ఫార్మా కంపెనీలను..
కార్ఖానాలను విస్తరిస్తున్నవాడు!
చెట్లకి నిప్పెట్టి అడవిని బొగ్గుమయం చేస్తున్నవాడు!
నెమళ్లకి లేళ్ళకి ఇళ్లే లేని అనాథల్ని చేస్తున్నవాడు!
అడవిలోపలి చెరువుల్ని ఎండ గొట్టి చేపల్ని
దాహంతో చంపేస్తున్నవాడు!
అడవిలోని పోడు భూ ములను బంజర్లు చేసి...
రైతుల్ని వలసబాట పట్టించినవాడు.
అడవి..అడవంతా నగరమై వలస పోతుంటే...
గజానికి రూపాయల ధర కట్టి భూవిపణిలో
విలాస నృత్యం చేస్తున్న వికృత నాట్యగాడు !
***
అడవి నొప్పితో ఏడవడాన్ని వినలేని చెవిటి వాడు.
జింకలు,నెమళ్ళు
పులులు నక్కలు
తోడేళ్ళు ఎలుగుబంట్లు
కుందేళ్ళు సీతాకోక చిలుకలు
ఇళ్ళు కోల్పోయి దారి తెన్నూ లేక
సామూహిక దుఃఖంతో డాంబరు రోడ్ల మీద
మనుషుల్ని రక్షించమని అల్లాడడాన్ని
చూడ నిరాకరించే అంధుడు!
ఆకలికి లేత చిగుళ్లు..పండ్లు కాకుండా రోడ్ల మీద
ఈ దేశ పవిత్రమైన గోవులతో కలిసి
చెత్తకుండీ కుళ్ళుని తినేలా
తరిమిన కారుణ్యం లేనివాడు.
***
భూవ్యాపారీ...
నువ్వు లాక్కుంటున్న కాళ్ళ కింది భూమి కోసం
అడవి దేహమంతా గాయం గాయం అవటం
తెలీటం లేదా నీకు?
నీకు శ్వాస నిచ్చే
ఆకుపచ్చని మోహక రూపం కదా అడవిది?
అడవిదెంత సౌందర్యమో చూడొకసారి!
అడవంటే..శాంతి,మౌనమే కాదు అల్లకల్లోలం కూడా!
అడవంటే
అంధకారం, కాంతీ రెండూ కలిసిన యుగళ చిత్రం కాదా?
అడవంటే గానం.,దుఃఖం
రెండూ పెనవేసుకున్న యుగళ గీతం కాదా?
అడవంటే ఆకుపచ్చని మహత్తరమైన అందం...
చిక్కనైన చీకటి నిండిన బీభత్సం కాదా..
అందుకే అడవిని అవమానించకు..అడవి జోలికి వెళ్ళకు!
**
ఒరేయ్ మనిషీ ..చెట్లను,పశురాలను చంపి
అడవిని శ్మశానం చేస్తావెందుకు?
తావులేక అల్లాడిపోయే జంతువులకి
కాలుతున్న చెట్ల చితులు పేరుస్తావెందుకు?
కొత్త కళ్లేసుకుని
చూడు...తల్లి పక్షులు కొమ్మల మీద నుంచి
రాలి పడుతున్న గూళ్లల్లో బిడ్డల్ని
కన్నీళ్ళతో ఎలా వెతుక్కుంటున్నాయో?
సూర్య చంద్రులు.. మబ్బులూ
అడవిని కాపాడుకోలేక దుఃఖంతో
ఎలా నేల వైపుకి నక్షత్రాల కళ్లేసుకుని
చూస్తున్నాయో చూడోసారి!
***
అడవిని తక్కువ అంచనా వేయకు !
అడవేం మూగది కాదు.
అడవేమైనా నిద్రలో ఉంద నుకున్నావా?
నరకబడుతున్న చెట్ల చేసే ఆర్తనాదాల్ని.,
భయంతో ఎగిరిపోతున్న
నెమళ్ళ రెక్కల చప్పుడుని..పసిపిల్లల్లా ఏడుస్తున్న
పక్షుల రోదననీ వింటోంది అడవి.
అరేయ్..పిల్లలుభూమిని, చెట్లు అడవిని...
ఇద్దరూ కలిసి లోకాన్ని పచ్చగా ఉంచుతారని తెలియని వాడా..
మూగ జీవాలను
కాసింత భూమిని దక్కించుకోనీ..అడవిని పెంచుకోనీ.
***
పిల్లల మీదికి గ్రైనే డ్లని...
చెట్ల మీదకి బుల్డోజర్లని విసిరేవాడా...
అడవిని అమాంతం మింగే భూకబ్జాదారా ...
ఖబడ్దార్! అడవి నీ జులుం సహిస్తుందనుకోకు.
అడవిని ఒట్టి అడవనే అనుకోకు !
అడవంటే ఏమనుకున్నావురా?
అడవంటే మనిషి,పశురాల శ్వాస రా!
అడవంటే నీళ్ళు..
అడవంటే సమస్త భూగోళం!
అడవంటే అమ్మ!
అడవంటే ఇల్లు!
వొట్టి అడవనే అనుకునేవు.
అడవి లోపల చిరుతపులి ఉంది !
అది అడవిని మనిషి నుంచి కాపాడుకుంటుంది.
కావాలంటే కాలి నడకన పోయి చూడోసారి!
అంతేనా..అంతేనా..మూర్ఖుడా...
అడవి లోపల మిణుగురులున్నాయిరా !
మిణుగురులు దారి చూపడమే కాదు
జ్వాలై దహించి వేస్తాయి కూడా!
చూడు! నీకు తెలియని విషయం ఒకటుంది.
అడవి చాలాసార్లు అమ్మగానో...
అక్కగానో మారి మిణుగురుల్ని ప్రసవిస్తుందని!
ఆ వెలుగులోనే అడవి నిశబ్దంగా నువ్వు నరుకుతున్నచెట్ల నుంచే ఆయుధాలు తయారు చేసుకుంటున్నదని !
అందుకే.. ఖబడ్దార్! అడవి జోలికి రాకు!