హైదరాబాద్ లో గోవుల కోసం అపార్ట్ మెంట్!
మనుషులు నగరాల్లో. పశువులు పొలాల్లో ఉండటం జీవవైవిధ్యం. కానీ నగరీకరణ వల్ల పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.;
ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక్కో అంతస్తులో పశువులు నిలబడడానికి, తిరగడానికి గ్రాసం తినడానికి విశాలంగా ఉండే బాల్కనీ లాంటివి ఏర్పాటు చేశారు.
ఆవుల అపార్ట్ మెంట్
మూసీ నది తీరంలోని ఎకరం పావు విస్తీర్ణంలో నాలుగు అంతస్తులు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 1200 పశువులు జీవిస్తున్నాయి ! వాటికి అవసరమైన గ్రాసాన్ని లారీల్లో ప్రతీ అంతస్తుకు చేర్చడానికి ర్యాంప్ ఏర్పాటు చేశారు. నీటి వసతి, గాలీ,వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణాలు ఉన్నాయి.
ఆ అపార్ట్ మెంట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన ముచ్చట్లు తెలుసుకోవాలంటే, హైదరాబాద్ లోని జియాగూడ దగ్గర శ్రీసమర్ధ కామధేను గోశాల చూడాలి. దీనికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది.
పశువులు లేకపోతే పంటలు లేవు !
‘‘ గోవుల సంరక్షణ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎక్కడ పశువులు పూజింపబడుతాయో ఆ ప్రాంతం పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుంది.
ఒకపుడు పల్లెల్లో ఆవులో, బర్రెలో రైతులకు తోడుగా పొలం పనులకు ఆసరాగా ఉండేవి. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు పశువులకు ఉన్న అనుబంధం తగ్గింది. పశువులు లేకపోతే పంటలే లేవు. ఈ గ్యాప్‌ని తగ్గించడానికి ఈ గోశాల ద్వారా కృషి చేస్తున్నాం. పశువుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో స్ధలం లేక అపార్ట్ మెంట్ నిర్మించాల్సి వచ్చింది. ఆవులు, దూడలు కలిపి సుమారు 4800 వందలు ఉన్నాయి. ఎనిమిది గంటలకోసారి వాటి చోటు మార్చు తుండాలి. పశువైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గోశాలను సమర్ధరామదాస స్వామి స్ధాపించారు.’’ అని వివరించారు సమర్ధరామదాస పరంపర ఆశ్రమ 12 వ పీఠాధికారి ప్రభుదత్త మహరాజ్.
గోశాలను నిర్వహిస్తున్న ప్రభుదత్త మహరాజ్.
ప్రతీ రోజు ఇక్కడ పశుపోషణ, గో ఆధారిత ఉత్పత్తులు, సహజ ఎరువుల పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు ఉచితంగా కాడెద్దులు
పొలం దున్నడానికి యంత్రాలు వాడే స్తోమతు లేని పేద రైతులకు అండగా ఉండాలని ఈ గోశాల నిర్వాహకులు కాడెద్దులను ఉచితంగా ఇస్తున్నారు. భూమిలేని రైతు కూలీలు పొలాలు దున్నుకుంటూ స్వయం ఉపాధి పొందడానికి కూడా ఎద్దులు ఉపయోగపడుతున్నాయి.
ఆపార్ట్ మెంట్ పైకి పశువులు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ర్యాంప్
‘‘ డీజిల్ ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్రాక్టర్లుతో వ్యవసాయం చేసే ఆర్థిక స్తోమతు మాకు లేదు. ఈ గోశాలకు వచ్చి నా పరిస్ధితి చెబితే ఎద్దుల జత ఇచ్చారు. వాటితో పొలం పనులు చేసుకోవడమే కాక ఇతర రైతులకు దుక్కి దున్నితే రోజుకు 1500 వరకు ఆదాయం వస్తుంది.’’ అన్నాడు , అపుడే గోశాలకు వచ్చిన కిష్టాపూర్ రైతు సుదర్శన్.
కిష్టాపూర్ రైతు సుదర్శన్‌కు కాడెద్దులను ఉచితంగా
ఇస్తున్న ప్రభుదత్త మహరాజ్
కాడెద్దులు అవసరం ఉన్న పేద రైతులను గుర్తించి, వారికి గోశాలలో ఒక రోజు పశుపోషణ పట్ల అవగాహన కలిగించిన తరువాత ప్రముఖుల సమక్షంలో వారికి ఎద్దులను అందచేస్తున్నారు. గత 3 దశాబ్దాలుగా ఏడాదికి దాదాపు 400 మంది రైతులకు ఎద్దులను, ప్రకృతి ఎరువులను అందచేసి ప్రకృతి సాగుకు తోడ్పడుతున్నారు గోశాల నిర్వాహకులు.
పేడతో గొబ్బెమ్మలు , ప్రమిదలు
పశువుల పేడతో ప్రమిదలు, గొబ్బెమ్మలు, ఇతర ఉత్పత్తులు తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కలప వాడకం తగ్గించడానికి పేడతో కట్టెలు తయారీ యూనిట్ నిర్వహిస్తూ స్ధానిక యువతీ యువకులకు శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
గో ఉత్పత్తుల తయారీ కేంద్రం
నేల సారం పెంచే ఎరువులు
రసాయన ఎరువులు వాడి అప్పుల పాలవ్వడమే కాక భూసారాన్ని కోల్పోతున్న రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి పశువుల వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసే యూనిట్లు నిర్వహిస్తున్నారు. అవసరం ఉన్న రైతులు ఇక్కడ కొచ్చి తీసుకెళ్తున్నారు.
రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు
ఈ గోశాల నిర్వహణకు కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నారు.
ఆవుల ఆపార్ట్‌మెంట్ లోపలి దృశ్యాలు
‘‘ ఇక్కడ ఆరు వేల పశువులున్నాయి. వాటి గ్రాసానికి నెలకు 50టన్నుల గ్రాసం అవసరం. రోజుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. సమీప గ్రామాల నుండి గడ్డి రవాణాకు ఒక లారీని పశువులకు గ్రాసాన్ని వేయడానికి జెసిబిని ‘అరబిందోఫార్మా ఫౌండేషన్’ అందచేశారు. కరోనా లాక్ డౌన్ లో కూడా ఈ మూగజీవులకు ఆహార కొరత లేకుండా ఈ వాహనాలు ఎంతో ఉపయోగ పడ్డాయి.’’ అన్నారు ప్రభుదత్త మహరాజ్.
ప్రతీరోజు పెద్ద లారీల్లో పశువులకు గ్రాసం
పాలిచ్చే ఆవులు, నెలలు నిండిన చూడి ఆవులు, 9 నెలల లోపు దూడలు, మూడేళ్ల లోపు దూడలు, ఆంబోతులు.. ఇలా విభజించి ఆపార్ట్‌మెంట్‌లో వేర్వేరు విభాగాల్లో ఉంచి పోషిస్తున్నారు.
ఇదే ప్రాంగణంలో పురాతన గో ఆలయం కూడా ఉంది.
మా ముందే ప్రభుదత్త మహరాజ్ కొన్ని ఆవుల పేరుతో పిలవగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వచ్చాయి.
‘ ఈ గోశాలలో ఆవుల మధ్య గంట సేపు గడిపితే అంతులేని మానసిక ఉల్లాసం కలుగుతుంది. వారానికి ఒక సారైనా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి కొంత గ్రాసం పశువులకు తినిపిస్తూ గడుపుతాం . మనసంతా అంతులేని తృప్తితో నిండిపోతుంది.’ అన్నారు ఇక్కడ కొచ్చిన ఓ కుటుంబం.