నెహ్రూ జూపార్కుకు 61 ఏళ్లు, దేశంలో టాప్ 3 జూపార్కుగా హైదరాబాద్
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఏర్పాటై నేటికి 61 సంవత్సరాలైంది.దేశంలోని జూపార్కుల్లోనే మన జూపార్కు టాప్ 3 అత్యుత్తమ జూపార్కుగా నిలిచింది.
By : Saleem Shaik
Update: 2024-10-07 04:04 GMT
పచ్చని ఎతైన చెట్లు...రంగురంగుల పక్షుల కిలకిల రావాలు...ఎతైన మీరాలం ట్యాంక్ బండ్...గలగల పారుతున్న మీరాలం చెరువు నీళ్లు...వీటి మధ్య 380 ఎకరాల విస్తీర్ణంలో నెహ్రూ జూలాజికల్ పార్కు వెలసింది. గతంలో పబ్లిక్ గార్డెన్స్ లో జూపార్కు 1959వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ జూపార్కును 1963 అక్టోబరు 6వతేదీన మీరాలం ట్యాంకు చెంతకు మార్చారు. జూపార్కులోకి అడుగు పెడుతుండగానే ప్రకృతి పరవశించేలా పచ్చని చెట్ల మధ్య ఉన్న వివిధ రకాల జంతువులను చూస్తే సందర్శకులు మైమరచి పోతుంటారు.61 ఏళ్లుగా తెలంగాణలో వన్యప్రాణుల ప్రేమికులను ఈ జూపార్కు విశేషంగా ఆకట్టుకుంటోంది.
వన్యప్రాణులపై సందర్శకులకు అవగాహన
వన్యప్రాణుల సంక్షేమం, సంరక్షణ లక్ష్యంగా నెహ్రూ జూ పార్కును అటవీశాఖ ఏర్పాటు చేసింది.ఈ జూ సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తోంది. దక్కన్ పీఠభూమిలో అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. వన్యప్రాణులను సంరక్షించడంతోపాటు సందర్శకులకు మర్చిపోలేని మధుర అనుభూతులను ఈ జూపార్కు పంచుతోంది. పర్యావరణానికి మేలు చేకూర్చే వన్యప్రాణుల వల్ల కలిగే ప్రయోజనాలను భావి తరానికి జూపార్కు అధికారులు వివరించి చెబుతున్నారు. వన్యప్రాణులను రక్షించడంతో వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
టాప్ త్రీలో నిలవడం గర్వంగా ఉంది : డాక్టర్ సునీల్ ఎస్.హిరేమత్
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలోని మొదటి మూడు జూలలో ఒకటి అని సెంట్రల్ జూ అథారిటీ ప్రకటించడం చాలా గర్వంగా ఉందని నెహ్రూ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ అండ్ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్.హిరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.జూపార్కులో 1227 పక్షులు, 664 వన్యప్రాణులు, పాములు కలిపి మొత్తం 192 జాతులకు చెందిన 2,240 జంతువులు జూపార్కులో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
జూ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జంతుప్రదర్శనశాలలు, ఉద్యానవనాల కోసం అటవీశాఖ మంత్రి ఛైర్మన్ గా తెలంగాణ జూపార్క్స్ అథారిటీని రాష్ట్రఅటవీశాఖ ఏర్పాటు చేసింది. సెంట్రల్ జూ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను త్వరితగతిన ఉపయోగించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.ఆధునిక సాంకేతికతతో జూపార్కులో ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్, మొబైల్ యాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి సేవలలను అప్‌గ్రేడ్ చేసింది.
జూపార్కుకు విరాళాల వెల్లువ
నెహ్రూ జంతుప్రదర్శనశాల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ముందుకు వచ్చి విరాళాలు అందజేసింది.20వేల లీటర్ల ఆర్వో ప్లాంట్ యూనిట్ నిర్మాణానికి బొల్లారంలోని గ్లాండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ మేనేజింగ్ ట్రస్టీ కెప్టెన్ రఘురామన్ రూ.25 లక్షల చెక్కును క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్‌కు అందించారు.గత సంవత్సరం గ్లాండ్ ఫార్మా జూకి రోడ్డు రైలును విరాళంగా ఇచ్చింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్, నార్డ్ అంగోలియా సంస్థలు కూడా విరాళాలు అందించాయి.
జంతువుల దత్తత
జంతువులను దత్తత తీసుకోవడం సరదాగా ఉంటుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఎంత పెద్దది లేదా చిన్నది అనే తేడా లేకుండా ఏదైనా జంతువును దత్తత తీసుకోవచ్చు. దత్తత కార్యక్రమం ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలు, కుటుంబాలు, సమూహాలు పాల్గొంటున్నాయి. జంతువులను సంరక్షించుకోవడానికి, అంతరించిపోతున్న జాతుల రక్షణకు డబ్బు వినియోగపడుతుంది.జూపార్కులోని జంతువులను దత్తత తీసుకునేందుకు పలువురు వన్యప్రాణుల ప్రేమికులు వస్తున్నారు. 2020-21లో 157 మంది ముందుకు వచ్చి పలు జంతువులను దత్తత తీసుకొని వాటికి అయ్యే ఖర్చును విరాళంగా అందజేశారు. 2021- 22లో 132 మంది వివిధ జంతువులను దత్తత తీసుకున్నారు.
పెరుగుతున్న సందర్శకులు
జూపార్కుకు వచ్చే సందర్శకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జూపార్కును సందర్శించి వన్యప్రాణుల గురించి తెలుసుకుంటున్నారు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా జూ సందర్శనకు ముందుకు వస్తున్నారు. 2021-22లో 14 లక్షలమంది జూపార్కును సందర్శించారు. 2022-23లో సందర్శకుల సంఖ్య 26 లక్షలమందికి పెరిగింది. జూపార్కులో వివిధ రకాల వన్యప్రాణులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో వీటిని చూసేందుకు వన్యప్రాణుల ప్రేమికులు తరలివస్తున్నారు.
పిల్లలకు జన్మనిచ్చిన జంతువులు
నెహ్రూ జంతుప్రదర్శన శాలలో పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయి. 2021 -22వ సంవత్సరంలో వివిధ రకాల వన్యప్రాణులు 317 పిల్లలకు జన్మనిచ్చాయి.ఆఫ్రికన్ సింహం ఓ పిల్లకు జన్మనిచ్చింది. వైల్డ్ డాగ్ మూడు పిల్లల్ని పెట్టింది. జింకలు, మొసళ్లు, తాబేళ్లు ఇలా ఎన్నెన్నో జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయి. 2022-23లో పలు జంతువులు 36 పిల్లలకు జన్మనిచ్చాయి. మంగళూరు జూపార్కు నుంచి ఆసియన్ వైల్డ్ డాగ్స్, నాగర్ కర్నూల్ నుంచి జంగిల్ క్యాట్ లను జూపార్కుకు రప్పించారు.
ఎన్నెన్నో మైలురాళ్లు...
- ఆసియాటిక్ లయన్స్, రాయల్ బెంగాల్ టైగర్స్, వైట్ టైగర్స్, వన్ కొమ్ము ఖడ్గమృగం మొదలైన అంతరించిపోతున్న జంతు జాతుల పెంపకంలో నెహ్రూ జూపార్కు పలు మైలు రాళ్లను నమోదు చేసింది.
- మొసళ్ల పెంపకం కేంద్రం: మొసళ్ల సంఖ్య పెంచడంతో పాటు వాటిని అడవిలోకి విడుదల చేయడానికి 1980వ సంవత్సరంలో ఈ జూలో మొసళ్ల పెంపకం కేంద్రాన్ని స్థాపించారు. ఈ జూపార్కు మౌస్ డీర్,రాబందుల పెంపకం బాధ్యతను కూడా చేపట్టింది.ఈ ప్రాజెక్ట్‌లను ఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ స్పాన్సర్ చేసింది.
- ఈ జూ ఆసియా సింహం, రాయల్ బెంగాల్ టైగర్ పెంపకంలో పేరొందింది.వన్యప్రాణులే కాకుండా శాకాహార జాతుల జంతువులను పెంపకంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ జన్మించిన మచ్చల జింకలు, కృష్ణ జింకలు, నీల్గై,సాంబార్ జింకలను తెలంగాణలోని అభయారణ్యాలలో విడుదల చేశారు.
- ఖడ్గమృగం, ఏనుగు, నీలగిరి లంగూర్, లయన్ టెయిల్డ్ మకాక్, సారస్ క్రేన్, గ్రే పెలికాన్,పెయింటెడ్ కొంగ వంటి అనేక అరుదైన,అంతరించిపోతున్న జాతులను పరిరక్షించేందుకు వాటిని జూపార్కులో పెంచుతున్నారు.
- బ్లాక్ హెడ్డ్ ఐబిస్, యురేషియన్ స్పూన్‌బిల్, ఇండియన్ పైథాన్, ఇండియన్ స్టార్ టార్టాయిస్, ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టిల్, ఇండియన్ ఊసరవెల్లి కూడా ఇక్కడ పెంచుతున్నారు.
- విదేశాలకు చెందిన జంతువులైన ఒరంగుటాన్, హిప్పోపొటామస్, ఆఫ్రికన్ సింహం, జాగ్వార్, ఉష్ట్రపక్షి, మకావ్స్, గ్రీన్ ఇగ్వానా ఈ జంతుప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ.
- ఈ జూలో బ్రీడింగ్ ఎక్సర్‌సైజ్ ద్వారా పుట్టిన జంతువులను యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల క్రింద విదేశాల్లోని జంతుప్రదర్శనశాలలకు అందజేశారు.
హైదరాబాద్ జూ ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 61వ హైదరాబాద్ జూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని జూ పార్క్స్ & క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్ ఐఎఫ్‌ఎస్ హాజరై చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన జూ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, మొమెంటోలను అందజేశారు.ఈ సందర్భంగా అనేక క్రీడలు నిర్వహించారు.