ఎక్ ప్యార్ క నగ్మా హై... పద్మభూషణ్ ప్యారేలాల్ కు చిరు నివాళి

లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ లోని ప్యారేలాల్ కు పద్మ భూషణ్ గౌరవం దక్కింది. బాలివుడ్ లో పిల్ల తెమ్మెరలా చొరబడి సునామీ సృష్టించిన ఈ వయోలిన్ విద్వాంసుడికి నివాళి

Update: 2024-02-04 07:14 GMT
ప్యారేలాల్ శర్మ

-అహ్మద్ షరీఫ్*


ప్రతి సినిమా ప్రత్యేకత వెనక ఒక అసక్తికరమైన పైకి కనిపించని ‘ప్రత్యేకత’ కథ వుంటుంది.

ఇద్దరు స్నేహితులు బాలీవుడ్ సంగీత ప్రపంచం లో మెల్లగా వీచే చల్ల గాలిలా ప్రవేశించి సునామీని సృష్టించారు. అందులో ఒక అతని పేరు లక్ష్మికాంత్ శాంతారాం కుదాల్కర్ (1937 - 1998), రెండో అతడి పేరు ప్యారేలాల్ రాం ప్రసాద్ శర్మ (1964). ఈ ఇద్దరు జోడీ కట్టి “లక్ష్మి కాంత్ –ప్యారేలాల్”, లేదా “లక్ష్మి- ప్యారే” లేదా ఎల్.పి (LP) సంగీత దర్శక ద్వయం గా చరిత్ర సృష్టించారు.

తమ వెనుక ఎలాంటి బలమూ లేకుండా కష్టపడి సంగీత దర్శకులు కావాలనుకున్న వారు ప్రయాణించాల్సిన దూరమూ, ఎక్కవల్సిన మెట్లు ఎక్కువగానే వుంటాయి.

ఏదో ఒక సంగీత వాయిద్యం వాయించడం లో ప్రావీణ్యం వుంటే సంగీత దర్శకుల వద్ద ఆర్కెస్ట్రాలలో వాద్యకారులు గా చేరతారు. అక్కడ ప్రావీణ్యం చూపగలిగితే, మ్యూజిక్ అరేంజర్లు అవుతారు. అంటే పాట మొదలెలా వుండాలి, దానికి ముందు ఎలాంటి సంగీతపు బిట్ వుండాలి, ఎక్కడెక్కడ ఏ వాయిద్యాలు ఎలా వాడాలి వాటి బిట్లు ఎలా వుండాలి? అని చూసుకునే వారు.

నిజానికి పాట లోని మాధుర్యం లో సింహ భాగం మ్యూజిక్ అరేంజర్లదే. ఒక రకంగా పాటను అలంకరించి తీర్చి దిద్దేది అరేంజర్లే. ప్రతిభ కలిగి వుంటే ఆ తరువాత సహాయ సంగీత దర్శకులు అవుతారు. ఆ తరువాత అవకాశం వస్తే సంగీత దర్శకులుగా మారవచ్చు. లక్ష్మి కాంత్ ప్యారే లాల్ సంగీత ప్రపంచం లో ప్రభంజనం సృష్టించడానికి ముందు ఈ మెట్లన్నీ ఎక్కారు.

లక్ష్మి కాంత్ మాండొలిన్ వాయించేవాడు. ప్యారేలాల్ వయోలిన్ వాయించేవాడు. ఇద్దరూ అప్పట్లో దాదాపు సంగీత దర్శకుల వద్ద మ్యూజిక్ ప్లేయర్లు గానూ, అరేంజర్లు గానూ పనిచేశారు. ఆ తరువాత ఇద్దరూ 1953 నుండి 1963 వరకూ కల్యాణ్ జీ-ఆనంద్ జీ సంగీత దర్శక ద్వయం వద్ద అసిస్టెంట్లు గా పనిచేశారు.

గజల్ ట్యూన్ల చక్రవర్తి గా పేరు గాంచిన సంగీత దర్శకుడు మదన్ మోహన్ 1957 లో “దేఖ్ కబీరా రోయా” సినిమా కు సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు ప్యారేలాల్ అతడి ఆర్కెస్ట్రాలొ వయోలిన్ వాయించేవాడు. ఒక కథనం ప్రకారం ఒకరోజు పాటల రిహార్సల్ జరుగుతున్నప్పుడు 3.00 గంటలకు రావల్సిన ప్యారేలాల్ స్టూడియో కి 4.30 కి వచ్చాట్ట. మదన్ మోహన్ కి మిలిటరీ బాక్ గ్రౌండు వల్ల చాలా స్ట్రిక్టు డిసిప్లీన్ వుండేది. ప్యారేలాల్ ను చూసి మదన్ మోహన్, “రిహార్సల్ సమయం మూడింటికి” అన్నాడట. ప్యారేలాల్ మారు మాట్లడకుండా తన వయోలిన్ తిరిగి పెట్టెలో పెట్టుకుని ఇంటికి వెళ్లి పోయాడట.

కొద్ది రోజుల తరువాత మదన్ మోహన్ అసిస్టెంట్ సూరి ప్యారేలాల్ కి ఫోను చేసి రిహార్సిల్ కి రమ్మని పిలిచాడట. ఇంకా కోపం తగ్గని ప్యారే లాల్ "నేను బిజీ గా వున్నాను రిహార్సిల్ కి రాలేను” అన్నాడట. అప్పుడు మదన్ మోహనే ఫొను తీసుకుని " నువ్వు పెద్ద వాడివై పోయావని తెలుసు, బాగా సంపాదిస్తున్నావు. గతాన్ని మరిచిపో. సాయంత్రం రిహార్సిల్ వుంది. నువ్వు నాకు కావాలి" అన్నాడట. ప్యారేలాల్ మనసులోని కోపాన్ని వదిలేసి రిహర్సల్ కు వెళ్లాడు. అతను అలా వెళ్లక పోయివుంటే ఆయన ప్రత్యేకత గురించిన కథ వుండేది కాదు.

స్వతహాగా కళాకారుల్లో కొంత అహంభావం ఎక్కువే వుంటుంది. అయితే అది పర్సనల్. కళ మాట వచ్చేటప్పటికి అహం వెనక సీటులోకి చేరుతుంది. కళానైపుణ్యం ముందు సీట్లోకి వస్తుంది. అంటే కళాకారుడి కంటే కళకే ఎక్కువ విలువ వుంటుంది. అక్కడ ఎటువంటి భేషజాలూ ఉండవు. ఇక్కడ మదన్ మోహన్, ప్యారేలాల్ వయోలిన్ నైపుణ్యాన్ని గౌరవిస్తే, ప్యారేలాల్, మదన్ మోహన్ సంగీత దర్శకత్వానికి విలువ నిచ్చేవాడు.

ప్యారేలాల్ వయోలిన్ నైపుణ్యపు పరాకాష్టను ఆవిష్కరించింది సంగీత దర్శకుడు మదన్ మోహన్. మదన్ మోహన్ కి అత్యంత ప్రశస్తి తెచ్చిన సినిమా 1964 లో వచ్చిన “హకీకత్” సినిమా.

అప్పటికి ప్యారేలాల్ తన మిత్రుడు లక్ష్మి కాంత్ తో కలిసి "పారస్ మణి (1963) చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసి వున్నాడు. ఆ చిత్రం వల్ల వారికి మంచి పేరొచ్చింది కానీ అవకాశాలు ఇంకా రాలేదు.

హకీకత్ ((1964) సినిమా లో పాటలు, సంగీతమూ మదన్ మోహన్ జీవితం లో మరిచి పోలేని మైలు రాయి. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటను రూపొందిస్తూ మదన్ మోహన్ తన అసిస్టెంట్ సోనిక్ ను వయోలిన్ మీద ఒక సోలో పీస్ ను రూపొందించమని అడిగాడట.

అక్కడ ఎనిమిది వయోలిన్లు, ఒక పియానో ఒక ఫ్లూటు వున్నాయిట. అప్పుడక్కడ జెర్రీ, ఆస్కార్, ఆంథోనీ, డురాడో, నర్వేకర్ లాంటి దిగ్గజ వయోలినిస్టులున్నా, మదన్ మోహన్ ఆ సోలో బిట్ ను ప్యారేలాల్ కి ఇచ్చాడట. ఆయన పట్టుబట్టి ఒక వయోలిన్, ప్యారేలాల్ వయోలిన్ వాడారు. కొద్ది పాటి మార్పుల తరువాత పాట రికార్డయింది. ఈ పాటలో ఒక పియానొ (రాబర్ట్), ఒక ఫ్లూటు (సుమంత్ రాజ్) మాత్రమే వాడారు. రఫీ పాడిన “ మైయే సోచ్ కర్ ఉస్కే డర్ సే ఉఠా థా” పాట ఆ చిత్రానికే వన్నె తెచ్చింది. ఈ పాట వెనక మరొక విశేషముంది. ఈ పాట రాసింది కఫీ ఆజ్మీ. నిజానికి ఈ పాటని  పంచాయత్ (1958) కోసం రాశారు. అపుడు ఇక్బాల్ ఖురేసీ కంపోజ్ చేశారు. అయితే, ఆ చిత్రంలో ఈ పాటని వాడుకోలేదు. ఈ పాట రెండు సార్లు రెండు చిత్రాలకోసం కంపోజ్ అయింది. చివరకు హకీకత్ లో అజరామరం అయింది.


‘నేను వాయించిన ఈ చిన్న వయోలిన్ బిట్టు ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను అనుకో లేదు. ఈ గొప్పతనమంతా మదన్ మోహన్ కే చెందుతుంది,’ అని ప్యారేలాల్ స్వయంగా రాసుకున్నాడు.

.పై మెట్టు మీద ఒక సంగీత దర్శకుడి హోదా పొందిన తరువాత కూడా ప్యారేలాల్ మళ్లీ ఈ ప్రయాణం లోని మొదటి మెట్టు మీది మ్యుజిషియన్ గా ఒక సంగీత దర్శకుడి వద్ద పనిచేయడమే అతనికి ఈ ప్రత్యేకతను సంతరించింది.

భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ తో సత్కరించడం పాటను ఆకాశానికి ఎగరేయడమే...


(*అహ్మద్ షరీఫ్, ప్రాజక్టు మేనేజ్ మెంట్-క్వాలిటీ కోచ్, సినిమా క్రిటిక్)

Tags:    

Similar News