దగ్గిరకి వచ్చిన చావు వెనుదిరిగి పోతే... సాల్మన్ రష్దీ ’నైఫ్’ జ్ఞాపకాలు
రష్దీపైన దాడి చేసింది న్యూజెర్సీలోని తన తల్లి ఇంట్లో ఉంటున్న 24 ఏళ్ళ వ్యక్తి ‘ద సెటానిక్ వర్సెస్’లో 2 పేజీలు మించి చదివలేదు. రష్దీ మీద కోపం పెంచుకున్నాడు.
By : రాఘవ
Update: 2024-05-02 05:59 GMT
-రాఘవ శర్మ
‘ద సెటానిక్ వర్సెస్’ రచయిత సల్మాన్ రష్ది తాజా పుస్తకం ‘నైఫ్’ గత మంగళవారం అమెరికాలో విడుదలైంది. రష్దీ పై 2022 ఆగస్టులో జరిగిన హత్యాయత్నంలో ఆ రచయిత చచ్చి బతికినా, కుడి కన్ను పోగొట్టుకున్నాడు. ఈ సంఘటనను ఆధారం చేసుకునే తాజాగా ‘నైఫ్’ అన్న పుస్తకం రాశాడు.
బ్రిటన్ లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్ది 1988లో ‘ద సెటానిక్ వర్సెస్’ అన్న నవల రాశాడు. అదతని నాలుగవ నవల. ఈ నవలలో రష్దీ చేసిన వ్యాఖ్యానాలు చాలా మంది ఇస్లామిక్ వాదుల కు ఆగ్రహా న్ని తెప్పిం చాయి. ఇరాన్ మత నాయకుడు అయతుల్లాహ్ రొహల్లాహ్ ఖొమైనీ ఈ నవలపైన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
ఇరాన్ లో 1979లో జరిగిన తిరుగుబాటు ద్వారా ఇస్లామిక్ మత నాయకుడు అయతుల్లాహ్ రొహల్లాహ్ ఖొమైనీ అధికారంలోకి వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ను ఏర్పాటు చేశాడు. అప్పటికే ఇస్లామ్ మీద ఈగ వాలినా కత్తులు, తుపాకులు పుచ్చుకుని తిరిగే వారు ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యారు. అయతుల్లాహ్ రొహల్లాహ్ ఖొమైనీ ఇచ్చిన పిలుపుతో అది మరింత ఎక్కువైంది.
సల్మాన్ రష్ది ని చంపిన వారికి పదిలక్షల డాలర్లు ఇస్తానని అయతుల్లాహ్ రొహల్లాహ్ ఖొమైనీ 1989లో ప్రకటించాడు. అయతుల్లాహ్ రొహల్లాహ్ ఖొమైనీ ని ఆధునిక మానవుడిగా మలిచిన వారికి అంతకు రెట్టింపు బహుమతి ఇస్తానని బ్రిటన్ లో ఒక పత్రికాధినేత ప్రకటించాడు.
ఖొమైనీ పిలుపుననుసరించి సల్మాన్ రష్దీ పైన దాదాపు అరడజను సార్లు హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నాలన్నీ ప్రభుత్వాధినేతలు పురికొల్పినవే. లండన్ నుంచి లాహోర్ వరకు డజను సార్లు ‘ద సెటానిక్ వర్సెస్’ పుస్తకాన్ని తగులబెట్టారు. దాన్ని జపాన్ భాషలోకి అనువదించిన వ్యక్తిని చంపేశారు. అతనితో సంబంధం ఉన్న వారిని గాయపరిచారు.
దీంతో రష్దీ అమెరికా వెళ్ళిపోయి, అక్కడ అజ్ఞాతంలో దాదాపు రెండు దశాబ్దాలు ఉండిపోయాడు. రాత్రిం బవళ్ళు అతను భ్రదతా బలగాల రక్షణలోనే గడిపాడు. ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం రష్దీపైన జారీ చేసిన ఫత్వాను ఉపసంహరించుకుంది. దాంతో అతను అజ్ఞాతం నుంచి బైటొకొచ్చేశాడు.
నూయార్క్ సమీపంలోని షుతాఖువాలో 2022 ఆగష్టులో సాహిత్య సమ్మేళనంలో రష్దీ మాట్లాడవలసి ఉంది. అప్పటికీ రష్దీ వయసు 75 సంవత్సరాలు. దానికి ముందు రోజు రష్దీకి ఒక కల వచ్చింది. పెద్ద భవనంలో ఒక వ్యక్తి తనను కిందపడేసి పెద్ద బల్లెంతో పొడుస్తున్నాడు. రష్దీ దొర్లుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కల రోమన్ చక్రవర్తికి వచ్చినటువంటి కలలాంటిది.
ఆపీడ కల నుంచి రష్దీ ఖంగారుపడి లేచేశాడు. ‘‘షుతాఖువాకు వెళ్ళాలన్న విషయం మీకు గుర్తుందా?’’ అని భార్య ఎలిజా అడిగింది. ‘‘నాకు వెళ్ళాలని లేదు’’ అన్నాడు రష్దీ. మళ్ళీ కల ప్రభావం నుంచి కోలుకుని ‘ఇది కలేగా’ అనుకున్నాడు. షుతాఖువాలో రష్దీ మాట్లాడాలనుకున్నది ప్రమాదంలో పడిన రచయితల భద్రత గురించి.
రచయితలకు భద్రమైన ప్రాంతం అమెరికా. అందుకే రష్దీకి భద్రత ఏర్పాటు చేయలేదు. అతను బహిరంగంగానే తిరుగుతున్నాడు. షుతాఖువా లో జరిగే సాహిత్య సమ్మేళనం వేదికకు కుడివైపున కూర్చున్నాడు. అప్పుడే అతను కుడికంటితో చివరి సారిగా చూశాడు.
ఓ వ్యక్తి రష్దీ కూర్చున్న సీటు కేసి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను నల్లగా ఉన్నాడు. నల్లని దుస్తులు, నల్లని మాస్క్ ధరించి ఉన్నాడు. రష్దీకి మృత్యువు సమీపిస్తున్నట్టనిపించింది. అతనికి చిక్కగానే వెంటనే గట్టిగా ఒక ముష్టిఘాతం పడినట్టనిపించింది. అతని చేతిలో కత్తి ఉన్నట్టు రష్దీ గమనించలేదు.
రష్దీ మెడపైన కత్తితో చాలా సార్లు పొడిచాడు. కత్తితో పొడవడంతో మెడపైన ఒక ఘాతం పడింది. కంటిపైన కత్తితో పొడిచాడు. కత్తితో పొడిచేస్తున్నాడు, నరికేస్తున్నాడు. అరనిముషానికి కాస్త తక్కువగా అలా 27 సెకండ్ల పాటు జరిగిపోయింది. ఆ విషయం గమనించేలోపే స్పృహతప్పి కిందపడిపోతున్నాడు.
రష్దీ మృత్యువుకు సమీపిస్తాడనుకునే లోపే ప్రేక్షకులు ఆ అగంతకుడిని వెనక్కి లాగేశారు. వారిలో కొందరు రష్దీకి కారుతున్న రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. చుట్టూ ఉన్న రక్తపుమడుగును చూస్తూనే స్పృహ కోల్పోయాడు.
ఇంతలో అంబులెన్స్ వచ్చింది. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్సిల్వేనియా సమీపంలోని ఎరిలోన ఆస్పత్రికి తరలించారు. ఒకపక్క రష్దీ మృత్యువుతో పోరాడుతుంటే, మరొక పక్క అతని ప్రాణాన్ని కాపాడడానికి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో ఎనిమిది గంటలపాటు పోరాడారు.
రష్దీని బైటికి తీసుకొచ్చే సమయానికి అతని భార్య ఎలిజా గ్రిఫిత్ కంగారు పడి పోతో భర్త కోసం బైట ఎదురు చూస్తోంది. ఆమె కవయిత్రి, నవలా రచయిత్రి. రష్దీ రంగు మారింది. శరీరం చల్లబడింది. సగం మరణించినట్టే ఉన్నాడు. భార్య ఎలిజా గ్రిఫిత్ కోసమే వెంటిలేటర్ పై ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
కాలిని కాస్త కూడా కదిలించలేకపోతున్నాడు. ఆస్పత్రి సిబ్బంది అతని కాలి వేలిని పట్టుకుని వేగంగా ఊపుతున్నారు. ‘‘సల్మాన్, నేను ఎలిజాను. నా మాట వినిపిస్తోందా? నువ్వెక్కడున్నావో తెలుసా?’’ అని అతని కాలిని గట్టిగా కదుపుతూ అడుగుతోంది. స్పందన లేదు.
సల్మాన్ రష్దీ ఆస్పత్రిలో 18 రోజులున్నాక, మరో మూడు వారాలు పునరావాసంలో ఉన్నాక ఇంటికి పంపించేశారు. రష్దీ కుడికన్ను పూర్తిగా పోయింది. కన్నుపైన పడిన ఘాతం మెదడునేమైనా దెబ్బతీసిందా అని డాక్టర్లు చాలా మల్లగుల్లాలు పడ్డారు. ఒకే కంటితో ప్రపంచాన్ని చూడడానికి అలవాటు పడ్డాడు. చదవడం మొదలు పెట్టాడు.
రష్దీ ప్రాణాలను కాపాడిన ఒక సర్జన్ ఇలా అన్నాడు ‘‘రష్దీ ఒక రకంగా నీవు అదృష్ట వంతుడివి. మరొక రకంగా దురదృష్ట వంతుడివి’’ . ‘‘అదృష్ట వంతుడినని ఎలా చెపుతారు?’’ అని రష్దీ ప్రశ్నించాడు. ‘‘నీపైన దాడి చేసిన వ్యక్తికి కత్తితో మనిషిని ఎలా చంపాలో తెలియదు’’ అన్నాడు సర్జన్.
అదృష్టం దురదృష్టంపైన నమ్మకం లేని రష్దీ తన పుస్తకం ‘నైఫ్’లో ఆ హత్యాయత్నం నుంచి బైటపడడం అదృష్టం అని రాశాడు. రష్దీపైన దాడి చేసింది న్యూజెర్సీలోని తన తల్లి ఇంట్లో ఉంటున్న 24 ఏళ్ళవ్యక్తి. హత్యాయత్నం చేశానన్న అపరాధ భావన అతనిలో ఏ కోశానా లేదు. ‘ద సెటానిక్ వర్సెస్’లో అతను రెండు పేజీలు మాత్రమే చదివాడు. రష్దీకి సంబంధించినవి యూట్యూబ్ లో చూశాడంతే. రష్దీ ఇస్లాంపైన చేసిన వ్యాఖ్యలతో అతనంటే విపరీతమైన కోపం పెంచుకున్నాడు.
‘ద సెటానిక్ వర్సెస్’ రాశాకనే సల్మాన్ రష్దీ అంటే లోకానికి బాగా తెలిసింది. తాజాగా రష్దీ రాసిన 22వ పుస్తకం ‘నైఫ్’. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ఈపుస్తకంలో ఎక్కడా రాయలేదు. ఈ కథ ఇలా మలుపు తిరుగుతుందనుకోలేదు కూడా. తన పై దాడి చేసి, మృత్యువు అంచుల వరకు తీసుకెళ్ళిన ఆ అగంతకుడిపై తాను కూడా కత్తితో దాడిచేయాలని కలలోకూడా అనుకోలేదు.
రష్దీ తన భాష కత్తి అనుకోవడం లేదు. ప్రపంచాన్ని తెరుచుకోవడం కోసం రష్దీ కి ఉన్నది ఒకే ఒక్క రహదారి. అతనికి వేరే ఆయుధాలు లేవు. అతని ఆయుధం కలం ఒక్కటే.