కొన్ని వర్షాలు కన్నీళ్లలా ఉంటాయి!

నేటి మేటి కవిత;

Update: 2025-07-17 03:02 GMT

గడ్డ కట్టిన విషాద మేఘం కూడా

దేన్నో వెతుక్కుంటూ

అలా అనాథలా తిరుగుతూ ఉంటుంది.

అందుకే,

కొన్ని వర్షాలు కన్నీళ్లలా ఉంటాయి.
మాయదారి ఋతువు ఆమెని కలవకముందే దూరం చేసేసింది.
అందుకే కొంతమందికి అన్ని కాలాలూ
దుఃఖ ఋతువులవుతాయి.
***
నువ్విక భూమ్మీద ఎక్కడా నిలబడలేవు.
ఆకాశానికీ ఎగరనూలేవు.
ఇటు సముద్రమూ నీది కాదు.
అటు అరణ్యమూ నిన్ను అక్కువ చేర్చుకోదు.
ఎక్కడా దాక్కోలేవు .
ఎక్కడికీ పారిపోలేవు
ఓహ్...దారి లేదు
తావు లేదు.
అదృశ్యమైపోనూ లేవు. ఊపిరాడదు.
నీ లోపల దాచుకున్న రాగాల పెట్టెని తెరుస్తావు కానీ,
ఏ రాగమూ నిన్ను ఓదార్చదు.
ఏ పాటా..నీ నిషిద్ధ ప్రేమ కథని పాడదు.
నీ ప్రేమ ఏడుస్తూ నీలోనే ఇంకిపోతూ ఉంటుంది.
***
నీ హృదయపు తోటలో పూలు పూసిన రహస్య అనురాగాన్ని
ఎవరికీ చెప్పుకోలేవు.
తోటని చేరుకోలేని నిస్సహాయతతో విల విల్లాడి పోతుంటావు.
వెక్కి వెక్కి ఏడవడానికి
ఏ ఒడీ దొరకదు.
అసలైన ఐశ్వర్యాన్ని తలాపునే పెట్టుకుని,
తనివితీరా భోరున ఏడ్చే భుజం కోసం
నలుదిక్కులా వెర్రిగా పరిగెడతావు.
నీ హృదయం నిత్య విలాపంతో వెక్కిళ్లు పెడుతుంటుంది.
**
నీ భూమి ఒక విరిగిన వీణ కాలు
కాస్త మోపు వియోగ రాగం ఎత్తుకుంటుంది.
నీ ఆకాశం దుఃఖ మేఘాలతో బావురుమంటుంది.
ఈ రాత్రి నిర్దాక్షిణ్యంగా
నీ కలల్ని గుంజుకొని,
నిన్ను నిద్రకి వెలివేసింది.
***
ఇప్పుడేం చేస్తావు మరి?
సంజె వాలుతున్న నీ సాయంత్రాన్ని
తొలి ప్రేమ రఫీ పాటలా పలకరిస్తుంది!
కానీ
చూడు కరుణ లేని కాలం
నిన్ను అదాటున వృద్ధాప్యంలోకి నెట్టేస్తుంది.
నిన్ను నిలువెల్లా మంచులా స్పర్శిస్తూ
స్పృహ లోకి తెస్తుంది.
ప్రేమలో మునిగిపోయిన నిన్ను చూసి నవ్వుకుంటుంది, వెక్కిరిస్తుంది.
నువ్వు చిన్నబోతావు.
అద్దంలో నీ వయసైపోతున్న,
అందం వీడని మొఖాన్ని తడుముతూ దిగులైపోతావు.
ఆమెని చూడలేని కళ్లను గట్టిగా మూసుకుంటావు.
**
రోజు రోజుకీ ముందుకురికే కాలం
ఎప్పుడూ లేనంత అందంగా
టకటకా తలుపు తడుతుంది .
నువ్వు తలుపు తీయడానికి
పసివాడిలా నిరాకరిస్తావు.
తీయనని మారాము చేస్తావు.
లోపలి గడియని మరింత బిగిస్తావు.
అకస్మాత్తుగా ఎక్కడినుంచి వచ్చిందో కానీ,
నీ ఒంటరి ఎడారి జీవితాన్ని తడిపిన
ఉన్మత్త మైన మోహ వర్షం,
నిన్ను తలుపు తీయనీయదు!
బీడు భూమి మీద కురిసిన అకాల వర్షంలా,
ఏ తపస్సూ చేయకుండానే వరంలా దొరికిన ప్రేమని
గుప్పిట్లో భద్రంగా
గుండెకి దగ్గరగా పట్టుకుని ఉండిపోతావలా.
బహుశా ఇది
నీ యవ్వనకాలపు పునర్జన్మేమో అని కూడా అనుకుంటావు.
ఎందుకంటే,నువ్వంతగా మత్తెక్కిపోయి ఉంటావు.
అప్పటికే తేనెటీగ కడుపులోని తేనెలా
ప్రేమ నీలో నిండి ఉంటుంది.
**
ఇలా కమ్ముకున్న కొత్త ప్రేమ
నిన్ను కలవర పరుస్తుంది.
భయపెడుతుంది.
అయినా నీ లోపలి పూల వనం
ప్రణయ పుష్పాలను విరబూస్తుంది.
నీ మనోదేహాలకి,
నీ ఊపిరికి కొత్త పరిమళం పరిచయం అవుతుంది.
ఎప్పుడూ లేనిది నీ దేహంలో
యవ్వన పుష్పాలు వికసించడం మొదలవుతుంది.
నీ లోపలికి నువ్వెన్నడూ వినని
ఒక కొత్త పాట వచ్చి సర్దుకుని కూర్చుంటుంది.
నీకు అది తెలుస్తూ ఉంటుంది.
నీ లోపలి దేహం పాడుతూనే ఉంటుంది.
**
ఆఖరికి ఒక రోజు నువ్వు తెగిస్తావు చూడు!
నిన్ను ప్రేమించే మృత్యువుని ఎక్కడికో విసిరేసి,
కాలాన్ని బంధించి,
నిద్రపోనివ్వని రాత్రిని బెదిరించి,
ఆమెని కలవరిస్తూ హాయిగా నిద్రపోతావు.
తెల్లారి నువ్వప్పుడు
యవ్వనుడవై నిద్రలేస్తావు!
బహుశా కాలాన్ని జయిస్తావు.


Tags:    

Similar News

సుమ గీతం

కదిలే దీపం