చిగురించిన అక్షరం, ప్రజ్వరిల్లు భాస్వరం 'విశాలాంధ్ర'!
విశాలాంధ్ర పత్రిక 72 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
"ఓ విశాలాంధ్రమా!
ఆశయాల ఊపిరుల
త్యాగధనుల రూపమా!
శ్రామిక ప్రజాకాంక్షగా
చిగురించిన అక్షరమా!
ఉద్యమాల బాటలో
ప్రజ్వలించు భాస్వరమా!
అజ్ఞానపు శత్రువుపై
సంధించిన అస్త్రమా!
అలుపుసొలుపు లేనేలేని
అవిశ్రాంత ప్రయాణమా!
సకలజనుల భవ్యభవిత
ఆవిష్కృత మహా లక్ష్యమా!"
ఈ మహాలక్ష్యంతో ఏడు దశాబ్దాల క్రితం ఆంధ్ర దేశంలో తొలి తెలుగు దినపత్రిక ఆవిష్కృతం అయింది. అది "విశాలాంధ్ర" దినపత్రిక. ఇది పెట్టుబడులకు పుట్టిన పుత్రికకాదు. ప్రజల పత్రిక. తెలుగుజాతి హితం కోరి ప్రారంభించిన పత్రిక. అన్యాయాలు, అక్రమాలు అణచివేతలు, అజ్ఞానం పై పోరాడే శక్తులకు వెన్ను దన్నైన పత్రిక. సమతా సమాజాన్ని త్రికరణశుద్ధిగా ఆకాంక్షిస్తోంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, అవరోధాలను కూల్చివేసి, ఒకానొక దశలో విచ్ఛిన్నకరశక్తుల భౌతిక దాడులను సైతం వీరోచితంగా తిప్పికొట్టి అప్రతిహతంగా నేటికీ కొనసాగుతున్న ఏకైక దిన పత్రిక విశాలాంధ్ర.
మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్న కాలం. స్వాతంత్య్రానంతరం దేశంలోని అన్ని జాతులూ సమగ్రాభివృద్ధి సాధించాలంటే, దేశ సమగ్రతకు దోహద పడేలా భాషల ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన అవసరం అని కమ్యూనిస్టు పార్టీ భారత ప్రభుత్వానికి సూచించింది. తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఆ పార్టీ ఉద్యమించింది. ఈ సందర్భంగా "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అనే నినాదం మార్మోగింది. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో 1952 జూన్ 22న విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర దినపత్రిక ప్రచురణ ప్రారంభమైంది.
ప్రముఖ సాహితీవేత్త తెలుగు పత్రికలకు నూతన ఒరవడిని ఇచ్చిన తాపీ ధర్మారావు తొలి సంచికను ఆవిష్కరించారు. నాటి సంపాదకీయంలో "విశాలాంధ్ర ఆంధ్రమహాజనులది. అందుచే దాన్ని పోషించేబాధ్యత తెలుగు ప్రజలదే. దీనిని నిర్వహించేందుకు చేయూతనివ్వండి. రూపురేఖలు తీర్చిదిద్ది సర్వాంగసుందరంగా నడిపేందుకు సాయపడండి." అని తెలుగు జాతికి విన్నవించింది. ఈ నాటికీ ఆ దారినే నడుస్తోంది.
1956 డిశెంబరులో విశాలాంధ్ర విజ్ఞాన సమితిని కమ్యూనిస్టు పార్టీ సొసైటీల చట్టం పరిధిలో ఏర్పాటు చేసింది. అప్పటి వరకూ ప్రజాశక్తి ట్రస్టు కింద నడుస్తున్న విశాలాంధ్ర పత్రికను విజ్ఞానసమితికి అప్పగించింది, కమ్యూనిస్టు పార్టీ. వీటన్నింటికంటే ముందు మద్రాసు నుండి సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో విశాలాంధ్ర పక్షపత్రికగా వెలువడేది. అదే కాలంలో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర సైక్లోస్టైల్ పత్రికను ఆంధ్ర ప్రాంతంలో తీసుకొచ్చేది.
"మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంత ప్రాతిపదికపై రాజకీయ, ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలలో వ్యాప్తి చెందించుటకు, ఆంధ్రప్రజ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. రాజకీయ, సాంఘిక సమస్యల అధ్యయనాన్ని ప్రోత్సహించి, విస్తృత పరచి రాజకీయ, సాంఘిక సంస్కరణలను సాధించాలి. కళలు, సాహిత్యం, నాటకాలను ప్రోత్సహించాలి. పై అంశాల సాధనకు పత్రికలను నడపాలి. పుస్తకాలు ప్రచురించాలి. రాజకీయ తరగతులు నిర్వహించాలి. సెమినార్లు, సభలు ఏర్పాటు చేయాలి, తదితర నిర్మాణయుతమైన కార్యక్రమాలను నిర్వహించుట విశాలాంధ్ర విజ్ఞాన సమితి కర్తవ్యాలుగా నిర్ణయించుకొంది."
నాడు భాషాప్రయుక్త రాష్ట్రాల సాధనలో విశేషమైన పాత్ర పోషించిన విశాలాంధ్ర.. స్వతంత్ర భారతదేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సాధనలో తనదైన ముఖ్య భూమికను పోషించింది. మొత్తంగా తెలుగువారి కోసం రూపొందుతున్న రాష్ట్రానికి "ఆంధ్రప్రదేశ్" పేరును సూచించింది విశాలాంధ్ర పత్రిక. కమ్యూనిస్టు యోధుడు, వామపక్ష జర్నలిజానికి పితామహునిగా నేటికీ అందరూ గౌరవించే మద్దుకూరి చంద్రశేఖరరావు (చంద్రం) ప్రధాన బాధ్యులుగా, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, రచయిత కంభంపాటి సత్యనారాయణ (సీనియర్), కాట్రగడ్డ రాజగోపాల్ సంపాదకవర్గంగా పత్రికకు ఒక ప్రామాణికతను సాధించి భవిష్య తరానికి అందజేశారు.
అనంతర కాలంలో కమ్యూనిస్టు నాయకుడు, రచయిత మోటూరి హనుమంతరావు, చరిత్ర, తత్వశాస్త్ర పరిశోధకులు ఏటుకూరి బలరామమూర్తి, ఏ పాటవింటే నేటికీ తెలుగు జాతి మేనుపులకిస్తుందో "చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి కలవోడా" అనే గేయరచయిత, ప్రముఖ కమ్యూనిస్టు నేత వేములపల్లి శ్రీకృష్ణ, "అక్షర శస్త్రధారి"గా తెలుగువారి మన్ననలు అందుకొన్న చక్రవర్తుల రాఘవాచారి, మార్క్సిస్టు అధ్యాపకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, జర్నలిస్టుల సంఘం నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, అభ్యుదయ రచయిత ముత్యాలప్రసాద్ విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. అభ్యుదయ రచయిత, జర్నలిజంలో విశేష అనుభవ సంపన్నులు, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆర్వీ రామారావు సంపాదక సారధ్యంలో నేడు విశాలాంధ్ర దినపత్రిక ప్రయాణం కొనసాగుతోంది.
"శాస్త్రీయ సోషలిజం చూపే వెలుగుబాటలో సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక సమస్యల అధ్యయనం, అన్వయం ద్వారా సమాజంలో అట్టడుగున పడివున్న శ్రామిక, మధ్యతరగతి వర్గాలను చైతన్యపరచి విజ్ఞానవంతులను చేసి సోషలిస్టు సమాజ నిర్మాణానికి సాగిపోవడమే విశాలాంధ్ర ధ్యేయం." అని పాతిక సంవత్సరాల రజతోత్సవాల సంచిక సంపాదకీయంలో స్పష్టంగా వెల్లడించిన తన లక్ష్యాన్నీ అసిధారావ్రతంగా కొనసాగిస్తోంది.
తెలుగునాట లబ్ద ప్రతిష్టులైన ఎందరో నవతరం జర్నలిస్టులకు విశాలాంధ్ర మాతృ సంస్థ. తెలుగు తొలి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడుగా పేరుపొందిన రాంభట్ల కృష్ణమూర్తి, తెలుగువారు గర్వించతగ్గ చిత్రకారుడు, కథకుడు, సినీరంగంలో కళాదర్శకుడుగా లబ్దప్రతిష్టుడు మా. గోఖలే (మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే), మోహన్, తదితర ప్రఖ్యాతులు విశాలాంధ్ర సంస్థలో పనిచేసి వన్నెకెక్కినవారే. పత్రిక కీర్తిని ఇనుమడింపచేసినవారే.
1953లో విశాలాంధ్ర పుస్తక ప్రచురణ విభాగం ప్రారంభమైంది. అదే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. దీని నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తుంది. ప్రసిద్ధ సాహితీ వేత్తలు, రచయితల బృందంతో సంపాదకవర్గం ప్రచురణ పుస్తకాల ఎంపికలో కీలకపాత్రపోషిస్తుంది. జాతీయ స్థాయిలోని ప్రముఖ రచయితలు ప్రేంచంద్, బౌద్ధ సాహిత్యంలో విశేష కృషిచేసిన రాహుల్ సాంకృత్యాయన్, సుప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు శరచ్చంద్రుడు, హిందీ రచయిత కిషన్ చందర్ తదితరుల సాహిత్య అనువాదాలను ప్రచురించి తెలుగువారికి అందించింది.
తెలుగునాట యుగపురుషుడు వీరేశలింగం, మహాకవి గురజాడ, శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి, దాశరథి, సోమసుందర్ తిలక్ - నవలాకారులు, కథకులు కొడవటిగంటి, బుచ్చిబాబు, చాసో, బొల్లిముంత, పెద్దిభొట్ల, నాటకకర్తలు సుంకర, వాసిరెడ్డి తదితరుల రచనలను ప్రచురించింది. ఒకనాటి సామ్యవాద దేశం సోవియట్ యూనియన్ నుండి ప్రగతి, రాదుగ తదితర ప్రచురణసంస్థలు తెలుగులోకి అనువదించిన టాల్ స్టాయ్, గోర్కి, పుష్కిన్, కుప్రిన్, దోస్తావ్ స్కీ తదితర విశ్వవిఖ్యాత రచయితల రచనల్ని, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ అర్థశాస్త్ర రచనల్ని, అత్యద్భుతమైన బాలసాహిత్యాన్ని, మార్క్స్, ఏంగిల్స్, లెనిన్ రచనల్ని తెలుగు సమాజానికి అందజేసి చైతన్యపరుస్తూ ఉద్యమ స్పూర్తిని నింపేందుకు కృషిచేస్తోన్న ఏకైక సంస్థ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ప్రధాన నగరాలు, పట్టణాలలో తన దుకాణాలు తెరిచి, వ్యానుల ద్వార సంచార దుకాణాలు నడుపుతూ, పుస్తక ప్రదర్శనలను నిర్వహిస్తోంది. వందలాదిమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది.
ఇదంతా ప్రజల ఆర్థిక, నైతిక సహాయ సహకారాలవల్లనే సాధ్యం అయింది అంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సహజం. కానీ చరిత్ర, వర్తమానం సాక్షిగా ఇది అక్షరసత్యం. అయితే సామాజిక రాజకీయ మార్పులకు విశాలాంధ్ర విజ్ఞానసమితి సంస్థలు లోనయ్యాయి. వడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. అర్థిక సంక్షోభాలకు గురికాక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా విరోధులేగాక అభిమానులు సైతం అపోహలకు గురై ఆరోపణలూ ఎక్కు పెడుతున్నారు. నిజానికి ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ కర్తవ్య నిర్వాహకులు, మొత్తం ఉద్యోగ సిబ్బంది ఏమాత్రం నైతిక స్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్నీ కోల్పోక త్యాగమయ ఉద్యమ స్ఫూర్తితో విశాలాంధ్ర దిన పత్రిక, ఏడు దశాబ్దాలపైగా విప్లవ వసంతాలను స్మరించుకొంటూ 72వ వార్షికోత్సవాలు జరుపుకొంటోంది.
"విశాలాంధ్ర జననీ!
లోకంకళ్ళు తెరిపించు తల్లీ!
మారక్తంలో రక్తంగా
గుండెల్లో గుండెగా
సమాజానికి శాంతిని
ద్రోహులకు ప్రాయశ్చిత్తాన్నీ
నిర్భీతిగా నిలిచిచెప్పు
నరరూపంలో మెసిలే
నక్కలకూ, తోడేళ్ళకూ
చరిత్ర తీర్పు ప్రకటించమ్మ
నీవే మేము, మేమే నీవు
నిజం, నిర్భయం మనలక్ష్యం
సాగిరావమ్మా
స్వాగతమమ్మా!"
అని అభ్యుదయ రచయిత నార్ల చిరంజీవి కలం నుండి 22 జూన్ 1952 న జాలువారిన కవితాక్షర సత్యం "విశాలాంధ్ర".