చచ్చి పోయిన ఇల్లు

'ఇల్లు’ సీక్వెల్ కవిత-23: గీతాంజలి.;

Update: 2025-04-12 22:54 GMT


ఊరి మధ్యలో
ఉరిపోసుకున్నట్లే ఇల్లు చచ్చిపోయింది!
ఇంటి చివరి ఊపిరి
అమ్మని నాన్నని కలవరించినట్లే ఉంది.
ఆమె సగం పాడిన రాగమేదో
కలతగా ఇల్లంతా కలిదిరిగినట్లే ఉంది.
మనుషులు లేక సుదీర్ఘంగా నిద్రపోయిన ఇల్లు
కలలు కత్తిరించిన రాత్రిలా చీకటై పోయింది !
ప్రేమానురాగాల రక్త మాంసాలతో జీవించిన ఇల్లు
సమాధిలోపలి అస్థిపంజరమైపోయింది !
***
మనుషుల కలలు
చందమామలై వెన్నెల కాసిన ఇల్లు కదా అది?
ఆకలేసిన మనిషి బువ్వ సంచిలో (కడుపు)
అన్నం నింపిన ఇల్లు కదా అది?
తరతరాలకు నిండు గర్భిణై పిల్లల్ని
ప్రసవిస్తూ పోయిన పచ్చి బాలింత కదా ఆ ఇల్లు?
పసిపిల్లల నోళ్లకు
పాలు కుడిచిన నిండు రొమ్ము కదా ఇల్లు?
మనుషుల్ని పెంచి పెంచి
ముసలైపోయింది ఇల్లు!
**
ఇంటితో నిత్యం
పూల పరిమళ భాషలోమాట్లాడిన తోట
మారిన ఋతువుల దెబ్బతో
ఆకులు రాలి చితికి పోయింది.
అమ్మ ప్రాతః కాల సుప్రభాతంతో...
జోల పాటలతో సంగీతమైన ఇల్లు మూగదైపోయింది .
గల గల మంటూ ఇంట్లోకి వచ్చి పోయిన
మనుషుల పాదాల మువ్వలు విడి జారిపోయినట్లే...
ఇల్లు సడి కోల్పోయింది.
ఒకప్పుడు మాట్లాడిన గోడలు..
కాపాడిన గదులు
పిడుగులు పడ్డట్లే కుప్ప కూలిపోయాయి !
నుజ్జు నుజ్జైన వాకిటి అరుగు...
యుగాలుగా రాని పిల్లల కోసం,
నిరీక్షించిన ముడుతలు పడి,
ముడుచుకుపోయిన
అమ్మవ్వల దేహంలా ఉంది.
ఇల్లు తన సమస్త ఆశలతో...
ఎదురు చూపులతో సహా
ఎండిపోయిన ఒంటరి ఎడారి పూవై పోయింది!
***
కొట్టంలో చెద పట్టిన ఎడ్ల బండి,
తుప్పు పట్టిన నాగలి
బీటలు వారిన వంటింటి పొయ్యి ,
దాహంతో ఎండిపోయిన చేద బావి,
ఇంటి గదుల వొళ్ళోకి కుంగిపోయిన డాబా,
మసి బారిన దీపపు గూడు
ఆరిపోయి ముక్కలైన మట్టి దీపాలు...
రహస్యాలేవో దాచుకున్న
కథల పుస్తకాలు లేని సగం విరిగిన అలమర ..
వొరిగి కొస ప్రాణంతో వేలాడే తలుపు
పాటలు,చూపులు,వాలే పిట్టలు
చందమామ లేక ఖాళీ అయిన కిటికీ ...
చిరిగి నలిగిపోయిన తెలుగు బాల శిక్ష పుస్తకం
పంట జమా ఖర్చులు రాసిన నాన్న చిరిగిన డైరీ,
వదిలేసిన అవ్వ తాతల దుమ్మెక్కిన ఫోటో..
ఒంటరైన పెరటి చెట్టు మొదట్లో
ఎండకి మెరిసే పగిలిన అమ్మ గాజులు..
వంటిల్లులో పగిలిన అన్నం కుండతో..
బద్దలైన హృదయంలా ఉంది ఇల్లు!
***
నిండు మనిషిలా నడిచిన ఇల్లు...
నాట్యమాడిన ఇల్లు...
పాటలు పాడిన ఇల్లు...
కళ్ళు,చెవులు, నోరూ చేతులూ కాళ్ళు పోయినట్లే..
విరిగినట్లే ఇల్లు వికలాంగురాలైపోయింది !
ఇల్లు కదలలేని కుంటిదై పోయింది!
ఇల్లు వీల్ చైర్ అయిపోయింది!
**

ఇల్లు పాడలేని పాటైపోయింది

పిలవలేని పిలుపైపోయింది !

ఇంటి మీద ప్రేమ పెంచుకున్న
కోయిలొకటి హతాసురాలై
పాడబోయే రాగాన్ని పెదవంచుకి తోసి
గుడ్ల నీరు కుక్కుకుని ఎగిరిపోయింది!
***
ఇల్లు బెంగపడిపోయింది!
తనని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న మనుషుల్ని
చూడలేక గుడ్డిదైపోయింది!
ఇల్లు చచ్చిపోయింది!
తనకు తాను
అంతః క్రియలు చేసుకున్న ఇల్లు
సమాధి అయిపోయింది!
చచ్చిపోయింది ఇల్లో...
మనుషులో తెలీని ఊరు...
ఊరంతా దిగులు పడిపోయింది!
ఆఖరికి..
ఊరిలో చచ్చిపోయిన ఇల్లు రొక్కమై ...
నగరంలో
పది అంతరాల హృదయం లేని మేడగా మొలిచింది !


Tags:    

Similar News

పూల గొడుగు

ఆటోగ్రాఫ్