నామవాచకంగా!!

సడ్లపల్లి చిదంబర రెడ్డి ‘సండే ’ కవిత;

Update: 2025-07-13 01:30 GMT

పచ్చని పంట పొలాల్లో

అమాయక ప్రాణులు ఆబగా చొరబడకుండా

ఏవొ భయాలు చెప్పడానికి

ఎండు కర్రకు నిటారుగా బొర్లించిన

ఖాళీ కుండ వంటి తలకాయకు

ముందు భాగంలో

చూపుల స్పృహ లేని

కనుగుడ్లతో మిటకరిస్తూ...

ముక్కుకు దారమూ

మెడకు పలుపు తాడూ లేక

బికారిగా సాగే ఆకలి పసరానికి

అయాచితంగా..అరచేతి వెడల్పాటి

పచ్చిక బయలు తారస పడినట్లు

నాకూ దొరికిందొక జీవితం!!

భూమితల్లి మొలక లై పంచే

ప్రేమల పల్లవాలను

కొరుక్కొని తినడమే కానీ

జవాబుదారీ తనం లేని

నాలుగు కాళ్ల జంతువులాగా

నా జీవితాన్ని నే నే

నిమిషాలూ గంటలు దినాలు

వారాలూ నెలలూ సంవత్సరాల

కాలమానాల కొలతల్తో కత్తిరించి

ధరల పట్టికగా తీర్చి

కరెన్సీ కాగితాలుగా మార్చి

కొంచెం కొంచెం కొరుక్కు తింటూంటాను!!

తినడమే తప్ప మరేమీ చేత కాదనే

అపవాదు-- రాత్రివేళ తప్ప

పగటి పూట నన్ను నిద్రకు దూరం చేస్తుంది.

లో లోపలి మూర్ఖాలూ ద్వేషాలు

మురికీ మశానా లై

ఒంటి మీదికి పొంగుకు వస్తే

సువాసనల సబ్బులతో తోమి

రంగుల హంగుల వస్త్రాలతో కప్పి

మనిషి తనాన్ని కూడా కొంత

మై పూతగా దట్టించి

బజారు జాత్తర్లకు

యాత్రలు చేస్తుంటాను.

ఆకారపు గుర్తింపు కోసం

యమయాతన పడుతూ

కనిపించిన ప్రతి గుంపులో

సభ్యుడిగా చేరుతునే ఉంటాను.

తడి తాగక కురియని మేఘం

ఉరుములు మెరుపుల ఆర్భాటాలతో

చివరికి శూన్యం లోనికి విలీన మైనట్లు

ప్రాణవాయువు కోటా ముగిసి

నామవాచకానికి పరిమితమైన జీవితాన్ని

చలువ రాళ్ల గోరీ చాటున దాచి పెడతాను!!!!


-సడ్లపల్లి చిదంబర రెడ్డి

Tags:    

Similar News

సుమ గీతం

కదిలే దీపం