కృత్రిమ జీవన సంక్షోభం

నేటి మేటి కవిత : డాక్టర్ కత్తి పద్మారావు;

Update: 2025-05-26 10:46 GMT

పెనుగాలులకు కల్లోలితం అవుతున్న కడలి

పెను వృక్షాలు కూలుతున్న చప్పుడు
నోటి కాడకు వచ్చిన పంటచేలు ఒరిగిపోయాయి
మామిడి తోటల్లో కాయలు
పిందెల్లోనే రాలుతున్న జీవన వ్యధ
నదుల అలల్లో నక్షత్రాల జాతర
ఆ పడతి కళ్ళుమూసి వుంది
సముద్రాలు అందులో కదులుతున్నాయి
భూతలంలో పొటమరిస్తున్న
చిగురాకుల చప్పుడు అందులో వుంది
పక్షులు గుంపులు గుంపులుగా
కొల్లేరు సరస్సు వేపు వెళుతున్నాయి
ఏదో వెదురు నుండి జానపదం వినిపిస్తుంది
నిజానికి అర్థనిమిలితమైన
పునశ్చరణ ఒక మధుర స్మృతి
అంతరంగం ఒక విశ్వం
అనేక పాలపుంతలు అందులో వున్నాయి
వెలుగు చీకట్ల దొంతరల సందడి
అంతర్లీనతలోనే జ్ఞానామృత ధారలున్నాయి
జీవద్భాష దాగి వుంది
భాహ్యానికే గాని అంతరంగానికి మరణంలేదు
మరోప్రక్క భాషను
విధ్వంసం చేస్తున్న రణగొణ శబ్దం
కర్ణభేరిని ఛేదిస్తున్నాయి
తుఫాన్‌ శబ్దం కంటే
అధికమైన శ్రుతి తప్పిన వాయిద్యాలు
క్లబ్‌ డాన్సులు
అర్థ నగ్న దృశ్యాల జడి
ఏమి రెచ్చగొడుతున్నారు?
కామోద్రకమైన నృత్య హేల
యువతను పెడదారి పట్టిస్తున్న కృత్యములు
మరోప్రక్క రాతి విగ్రహాల ముందు
సరిగమల శృంగారాలాపనలు
ఎవరు వింటున్నారు?
తెలియదు?
పెనురాళ్ళకు ధారబోస్తున్న సంగీతశృతి
ఎందరో గొంతులకు రంధ్రాలు
కథల్లో పాత్రలకు
నిజ జీవితాలు అంకితం
కళ్ళముందు వున్న వ్యధితులపై
కరుణలేని జీవులు
అనృత భాషా విన్యాసాలతో
జీవితాన్ని మార్మికం చేసుకుంటున్నారు
ఎన్నో గ్రంథాలు పుక్కిట గాథలను
బుర్రలకు జొన్పి వెళ్ళాయి
చెప్పిందే చెప్పి
అబద్ధాన్ని నమ్మించారు
ఇపుడు సత్యం చేదుగా వుంది
ఆ సజీవ శిల్పం
స్పృశ్యతా విహీనమై
ఆంక్షల మధ్య నిలబడి వుంది
అవివాహితలు పెరుగుతున్నారు
కులం, మతం, కట్నం, ఉద్యోగం
వివాహానికి అనేక అడ్డంకులు
స్త్రీ పురుషులను కలపడానికి
ఇన్ని అడ్డుగోడలా!
చేసుకున్నవాడు
మందు ప్రియుడై
అర్థాంతరంగా అంతరిస్తున్నాడు
భర్త మరణాంతర జీవితానికి
స్వేచ్ఛలేదు
ఇద్దరూ కలిసి కన్న పిల్లలకు
ఒకరే ఎలా బాధ్యులు?
సమాజం వేగంగా
ఒంటరితనం వేపు జరుగుతుంది
దేవాలయాలు ప్రార్థనా మందిరాలు
కిటకిటలాడుతున్నాయి
నిలువు దోపిడీలు నల్ల ధన సమర్పణలు
ఆచారాలకు ఆత్మగౌరవం బలి
విద్యావతులపై
పురుష అహం ప్రకోపిస్తుంది
ఆమె శ్రమ మీద ఈతని పెత్తనం
అడుగడుగున నిందా పూరిత భాషణం
సంభాషణల్లో మృదుత్వం మృగ్యం అవుతుంది
ఇతరులను బాధపెట్టి
ఆనందపడే అల్పానందం
నీకు నీవు ఏమిటో తెలుసుకోలేని అలసత్వం
నిన్ను నీవు నిరూపించుకోవడం ఒక సమరం
ప్రతి సూర్యోదయం ఒక మేలుకొలుపు
మనిషిలో అంతర్లీనత అంతః వివేచన
ఆత్మావలోకనం తగ్గుతున్నాయి
సృజనం ఎక్కడ నుండి వస్తుంది
మనస్సు కదలకుండా
రెండు వేళ్ళు కదలికల నుండే
నూత్న సృష్టి జరగదుగా!
ఆ కూజా మీద బొమ్మ వేస్తున్నవాడు
సాలోచనతో వేశాడు.
దాన్ని చూసే వాడికి
కళాత్మకత లేదనిపిస్తుంది
కూజాని మంచి నీళ్ళకే ఉపయోగిస్తున్నాడు
నిజమే! ఆ పడతి
ఆ కూజా మీద బొమ్మను సాకల్యంగా చూసింది
సాలోచనలో పడిరది
కృత్రిమ మేధ వచ్చాక
ఆ పెన్సిల్‌తో వేసిన సజీవ చిత్రాలు
కనుమరుగు అవుతున్నాయి
ఇక మనిషినే చూడకుడటం మానేసి
యంత్రాలతో జీవిస్తాడా?
మర బొమ్మలతో సహజీవనం చేస్తాడా?
పెన్సిల్‌తో చెక్కి వేసిన
ఆ చిత్రంలో ఎన్ని భావ చలనాలున్నాయి
అవి అంతరాంతర భావ నిధినిక్షేపాలను
అభివ్యక్తం చేస్తున్నాయి కదా!
ఈ మార్మిక జీవనం మనిషికి తృప్తినిస్తుందా?
చుట్టూ వస్తువులు
మనశ్శాంతి లేదు
అప్పుల తిప్పలు
ఇ.ఎమ్‌.ఐ.లు క్రెడిట్‌కార్డ్‌ బాకీలు
మిగిలేది అతి తక్కువ
జీవితం మళ్ళీ అర కోరే
ఏది వుందో! అది వద్దు!
ఏది లేదో! అది కావాలి!
ఇప్పటి మధ్య తరగతి జీవితం
ఆ పడతి తన ముందే వున్న చిన్న కొలనులోని
చేప పిల్ల సౌందర్యం చూడలేదు
ఆకాశంలో మేఘాలకు రంగులేస్తుంది
ఆర్భాటంలో జీవితం
చెవులు పనిచేయవు
మంచి మాట చెవికెక్కదు
భజంత్రీలకు కానుకలు
అవును! జీవితంలో ఆడంబరం పెరుగుతుంది
స్వచ్ఛత తగ్గుతుంది
తత్వవేత్తలు చెబుతూనే వెళ్ళారు
జ్ఞానేంద్రియాలకు పదును పెట్టండి
నిన్ను నీవు తీర్చిదిద్దుకోగలవు
నీ వ్యక్తిత్వ వికాసమే ప్రపంచానికి వెలుగు
వ్యక్తులు, సమూహాలుగా రూపొందుతారు
సమూహం నుండి వ్యక్తి, వ్యక్తి నుండి సమూహం
ఉత్తేజం పొందాలి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్చామి
ఆ మార్గంలో నడుద్ధాం.

-డాక్టర్‌ కత్తి పద్మారావు

లుంబిని వనం, అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌,

అంబేద్కర్‌ కాలనీ, పొన్నూరు పోస్ట్‌,

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 



Tags:    

Similar News