కేలరీలు - ఎత్తుకు తగ్గ బరువుల కథ కమామీషు !

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆరోగ్యంపై ధ్యాస పెరిగిందనే చెప్పాలి. ఎవరిని కదిలించినా.. ఏమి తినమన్నా ఎక్సెస్ కేలరీస్ బ్రో అంటున్నారు. ఇంతకీ ఈ కేలరీల కథ కమామీషు ఏంటి?

Update: 2024-04-19 07:55 GMT
Source: Twitter

(గొర్రెపాటి రమేష్ చంద్రబాబు)

ఆహార పరిభాషలో కిలోకేలరీగా పిలుస్తారు. ఉష్ణాన్ని సెంటీగ్రేడ్‌లలో, బరువును కిలోగ్రాములలో, ఎత్తు పల్లాలను మీటర్లలో, ద్రవాలను లీటర్లలో కొలిచినట్లే ఆహారం ద్వారా మన శరీరానికి లభించే శక్తిని కేలరీలలో లెక్కిస్తారు.

మనం తినే ఆహారాన్ని కార్బోహైడ్రేట్లు(పిండిపదార్ధాలు), ప్రొటీన్లు (మాంసకృతులు, ఫాట్స్ (కొవ్వులు), ఫైబర్ (పీచు పదార్థాలు), మినరల్స్ (లవణాలు), విటమిన్లు, సూక్ష్మ పోషక పదార్థాలుగా విభజిస్తారు. ఒక గ్రాము పిండిపదార్థము, మాంసకృత్తుల ద్వారా 4 కేలరీలు, ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. శరీరక శ్రమ చేసే వారికి రోజుకు 2500 నుండి 3000 కెలోరీల శక్తి అవసరమవుతుంది. అదే సాధారణ పనులు చేసేవారికి 1500 నుండి 2000 కేలరీల శక్తి సరిపోతుంది.

కేలరీ ద్వారా శరీరానికి లభించే శక్తిని ఎలా లెక్కించటం ? ఒక లీటరు నీళ్లను తీసుకుని వాటి ఉష్ణోగ్రత ఒక సెంటీగ్రేడు పెరిగేలా వేడిచేయటానికి అయ్యే ఉష్ణ శక్తికి ప్రమాణమును ఒక కేలరీగా చెప్పవచ్చును. 2000 కేలరీల ద్వారా లభించే ఉష్ణశక్తి 20 లీటర్ల నీటిని 100 సెంటీగ్రేడు (నీరు మరుగు ఉష్ణోగ్రత ) కు చేర్చే ఉష్ణశక్తితో సమానంగా పోల్చుకోవచ్చు. ఆహారం ద్వారా శరీరానికి లభించే కేలరీలు వివిధ శరీర క్రియలకు ఖర్చు కాబడే కెలోరీల కంటే ఎక్కువగా సమకూరితే శరీరం ఆ మిగులు కేలరీలను క్రొవ్వులుగా మార్చుకొని నిల్వ చేసుకుంటుంది. అలా కొవ్వు నిల్వలు పోగు పడే కొద్దీ బరువు పెరుగుతారు.

ఒక ముద్ద అన్నంలో 20 కేలరీల శక్తి ఉంటుంది. రోజూ మూడుపూటలా మూడు ముద్దలు ఎక్కువ తింటే 60 కేలరీల కొవ్వులు శరీరంలో చేరుతాయి. అలా 7700 కెలోరీలు అధికంగా శరీరంలో చేరితే ఒక కిలోగ్రాము బరువు పెరుగుతారు. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే శరీరం సౌష్టవంగా ఉంటుంది. ఎత్తుతో పోల్చి బరువును కొలిచే ప్రమాణాన్ని రూపొందించి దానిని బాడీ మాస్ ఇండెక్స్ గా ( BMI ) పిలుస్తున్నారు - బరువును కిలోలలోను, ఎత్తును మీటర్లలోను కొలిస్తే, బరువు (kg) / ఎత్తు x ఎత్తు ( మీటర్లు ) ను BMI గా లెక్కిస్తారు . ఉదాహరణకు 5 అడుగుల 10 అంగుళాలు ( 1.778 మీటర్లు ). ఉన్న మనిషి 90 కిలోల బరువుంటే అతని BMI 28.47 ఉంటుంది.

BMI 18.5 నుండి 24.9 వరకు ఉంటే ఆరోగ్యకరమైన బరువు ఉన్నట్లు లెక్క. దీని ప్రకారం ఆ వ్యక్తి ఉండాల్సిన బరువు 60 నుండి 78 కిలోల మధ్య. ఆ ప్రకారము 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉండి 60 నుండి 78 కిలోల మధ్య బరువున్న వాళ్ళందరూ ఎత్తుకు తగ్గ బరువున్నట్లు చెప్పటానికి ఇంకో ప్రమాణం కూడా సరిచూసుకోవాలి. అదేమిటంటే ?నడుము చుట్టుకొలత , ఎత్తులో సగానికి మించి ఉండకూడదు - అంటే 177.8 సెంటీమీటర్లలో సగం 89 సెంటీ మీటర్లకంటే ఎక్కువ వుండని పక్షంలోనే ఎత్తుకు తగ్గ బరువున్నట్లు లెక్క!

Tags:    

Similar News