అడవిలో జంతువులకు ఆహారం అందిచడం ‘దయ’ కాదు డేంజర్...
అడవిలో జంతువులు ఎదుర్కొంటున్న మోటారు ప్రమాదాల మీద ప్రకృతి ఔత్సాహికుడు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఎం. గోవిందరాజ భాస్కర్ ఏమంటున్నారంటే…;
ఎం.గోవిందరాజ భాస్కర్
ఇటీవల అడవికి సమీపంలోని రోడ్లపై వాహనాలు ఢీకొని జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనికి కారణం చాలా మటుకు మనుషులే. అడవుల గుండా ప్రయాణిస్తున్నపుడు జంతవులకు పళ్లు, ఇతర ఆహార పదార్థాలు అందించి ఆనందిస్తుంటారు. జంతువులకు చేరువ కావాలనే మనిషి ఆరాటం ఇందులో కనబడుతుంది. అందుకే చాలామంది అడువుల గుండా ప్రయాణిస్తున్న కనిపించిన కోతులకు జింకలకు పళ్లు తినిపిస్తుంటారు. కొందరు పళ్లు, ఇతర ఆహార పదార్థాలను జంతువులకోసం రోడ్డు పక్కన వదిలేసి వెళ్తుంటారు. వీటిని జంతువుల తింటాయని భావిస్తారు. అడవుల్లో జంతువుల ఆహారం అందించాలన్న ఆలోచన బాగుంది కాని, అది మంచిది కాదు. అడవిలో రోడ్డు పక్కన జంతువులకు ఆహారం పెట్టడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలున్నాయి. ఇవి తెలియక చాలా మంది అనువుకాని చోట జంతు ప్రేమ ప్రదర్శిస్తుంటారు.
అడవి సమీపంలో జంతువులకు ఆహారం అందించడం, ఆహారాన్ని వదిలేయడం వల్ల వాటి సహజ జీవన విధానం మారిపోతుంది. జంతువులు స్వయంగా ఆహారం వెతుక్కోవడం మానేసి, మనుషుల మీద ఆధారపడిపోతాయి. దీని వల్ల అవి తమ సహజమైన వాతావరణాన్ని, అహార అన్వేషణ విధానాన్ని విడిచిపెట్టి రోడ్ల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాలు: సురక్షిత నెలవైన అడవి కాని ఆహారం కోసం రోడ్ల దగ్గరికి వచ్చే జంతువులు రోడ్ల పై నియంత్రణ లేకుండా తిరగడం జరుగుతుంది. దీని మూలాన వాటిని వాహనాలు ఢీకొని గాయపడటం లేదా మరణించే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వాహనదారులు కూడా మృత్యువాత పడుతుంటారు.
మనుషుల-జంతువుల మధ్య ఘర్షణలు (Man-Animal Conflict):
జంతువులు రోడ్ల వద్ద ఎక్కువగా చేరిపోవడం వల్ల వాటిలో దాహం, ఆకలి వల్ల ఆక్రోశం పెరిగి, కొన్ని సమయాల్లో మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ భూతదయ వల్ల కలిగే మరొక దుష్ప్రభావం పర్యావరణ సమతుల్యత భంగం కలగడం. కొన్ని రకాల జంతువులకు ఎక్కువగా ఆహారం అందడం వల్ల అవి అడవిలో సంచరించడం మానేస్తాయి. అపుడు ఇతర జంతువుల ఆహారపు సరఫరాపై ప్రభావం పడుతుంది, దీనివలన జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
మనుష్యులు అందించే ఆహారానికి అలవాటుపడిన కొన్ని జంతువుల సంఖ్య ఒక నిర్దిష్ట ప్రదేశంలో అధికమై ఇతర జీవుల జీవన విధానాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు భగ్నమవుతుంది.
మనుషులు అందించే ఆహారం వల్ల జంతువులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మనుషులు ఇచ్చే ఆహారం కొన్ని జంతువులకు అనుకూలం కాకపోవడం వల్ల వాటిలో అవి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు ఆ ఆహారం జంతువులకు విషపూరితం కూడా కావచ్చు, లేదా మనుషులు ఇచ్చే ఆహారం జంతువుల సహజ ఆహారపు అలవాట్లను మార్చి వాటిలో ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు.
మనుషులు వన్య ప్రాణులకు అందించే ఆహారం వల్ల అపరిశుభ్రత, కాలుష్యం ఏర్పడుతుంది.జంతువులు తినగా మిగిలిన ఆహారం ఇతర క్రిమి-కీటకాలను ఆకర్షిస్తుంది. ఇది స్థానికంగా అపరిశుభ్రతను పెంచి వ్యాధుల్ని వ్యాపింపజేస్తుంది.
ఈ సమస్య మీద బాలపల్లి రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి కొన్ని వివరాలు అందించారు. అడవులు గుండా పోతున్నపుడు మనుషులు జంతువులకు ఆహారం అందించడం మానేయాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అటవీ శాఖ తరఫున ఘాట్ రోడ్లలో, ఇతర ప్రదేశాల్లో హోర్డింగ్ల ద్వారా జంతువులకు ఆహారం అందించవద్దని ప్రజలకు సూచిస్తున్నామని పేర్కొన్నారు.
తిరుపతి సమీపాన ఉన్న భాకరాపేట రేంజ్‌లో పని చేసిన సమయంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. “ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని రైతులు, తమ పంటలకు తగిన ధర లేకపోయినప్పుడు, అవి పనికిరావని భావించి భాకరాపేట ఘాట్ ప్రాంతంలో పారవేయడం పరిపాటిగా ఉండేది. ఈ విధానంతో అడవిలోని జంతువులు ఆహారం కోసం రహదారులపైకి వచ్చేవి. ఫలితంగా వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు వాటిని ఢీకొనడం, జంతువులు మృత్యువాతపడటం నేను చాలా సార్లు చూశాను. దీనికి పరిష్కారం కోసం ఆ మండలాల రైతులతో చర్చించాను. ఇలా మార్కెట్ లేనపుడల్లా పంటను అడవి సమీపంలోని రోడ్ల మీద పడేయం ఎంత ప్రమాదరమమో వారికి వివరించాను. రైతులు అది నిజమేనని అంగీకరించారు. దీనితో ఈ ప్రమాదాలను కొంతవరకు తగ్గించగలిగాము,” అని ప్రభావకర్ రెడ్డి చెప్పారు.
అడవి సమీపాన మోటారు ప్రమాదాలకు సరైన పరిష్కారం ఏమిటి?
* జంతువులను సహజంగా జీవించనివ్వాలి – వాటికి మనం సహాయం చేయాలనుకుంటే, వాటి సహజ వాతావరణాన్ని కాపాడేందుకు సహాయపడాలి.
* అభయారణ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాల ద్వారా సహాయం అందించాలి – అవసరమైనపుడు వాటిని సహాయంగా తీసుకుని అభయారణ్యాల్లో సంరక్షించాలి.
* అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి – జంతువులను ఆకర్షించేలా కూరగాయలు, పండ్లు బహిరంగంగా ఉంచకూడదని అవగాహన కల్పించాలి.
ముగింపు
జంతువులకు మనం ఆహారం ఇవ్వడం అనేది మంచి ఉద్దేశంతో చేసినా, దీని వల్ల వాటి సహజ జీవన విధానం మారిపోయి, చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. అడవిలో ఎలా జీవించాలో వన్యప్రాణులకు తెలుసు. పరిణామ క్రమంలో అవి ఒక జీవినవిధానం అలవర్చుకున్నాయి. దాన్ని భగ్నం చేయకూడదు. మనుషులు జంతు ప్రేమతోనే ఆహారం అందించినా దాని పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు వన్యప్రాణులన వాటిని సహజ రీతిలో జీవించనివ్వడమే ఉత్తమ పరిష్కారం.
(Dr M Govindaraja Bhaskar, Veterinarian, Trekker and Nature enthusiast Tirupati)