"అడవులకు కూడా నియమాలు ఉంటాయని నేను విన్నాను!"
జెహ్రా నిగా (Zehra Nigah) పాకిస్తానీ కవయిత్రి కవిత (అనువాదం గీతాంజలి);
అవును !
అడవులకు కూడా
కొన్ని నియమాలు ఆచారాలు ఉంటాయని
నేను విన్నాను!
ఇక్కడ క్రూరమైన సింహం కడుపు నిండితే
ఎవరి మీద దాడి చేయదు
దట్టమైన చెట్ల నీడల్లోకి వెళ్లి
విశ్రాంతి తీసుకుంటుందని విన్నాను
ఎప్పుడైనా అడవిలో
తీవ్రమైన తుఫాను గాలులు వీచినప్పుడు
మైనా తన స్వంత పిల్లల్ని వదిలేసి
పక్క కొమ్మ మీది కాకి గుడ్లను
తన రెక్కల కింద దాచుకుని
కాపాడుకుంటుందని విన్నాను!
అడవిలో ఏదైనా పక్షి గూడు చెదిరి
బిడ్డ పిట్ట కింద పడితే అడవి..
అడవంతా ఉలిక్కిపడి మేలుకొంటుందని విన్నాను !
నది నీటిలో
కందిరీగ గూటి మురికి దుమ్ము పడి
మృదువైన నీడలా పరుచుకుని
సన్నగా వణికిందనుకోండి....
నదిలోని వెండి రంగు చేపలు కూడా
దాన్ని తమ పొరుగు వాడిగా అంగీకరిస్తాయని విన్నాను!
ఇక అనుకోని తుఫానులో
నదికి వరదలు వచ్చినా..
వంతెన విరిగిపోయినా ..
ఒక ఉడుత, పాము,
మేక చిరుత పులి అన్నీ కలిసి
ఒకే చెక్క బల్ల పైన ఆశ్రయం తీసుకుంటాయనీ విన్నాను!
అడవికి కూడా కొన్ని నియమాలు..
ఆచారాలూ ఉంటాయని విన్నాను!
ఓ భగవంతుడా..
గౌరవనీయమైన అజ్ఞానమైన...
గుడ్డివాడవైన న్యాయమూర్తీ...
ఓహ్ నా అక్బర్ !
ఈ హృదయమే లేని మనుషులున్న నగరంలో
ఇప్పటికిప్పఈ కొత్త అటవీ చట్టాన్ని అమలు చేయవా ?
***
(భూమి కోసం ఉద్యమిస్తున్నహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులకు మద్దతుగా)