భారత్ తాము చెప్పినట్లు వినకపోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు సృష్టించడానికి అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతం విధించిన 50 శాతం సుంకాలే చివరివి కావని రెండో దశలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో ఆంక్షలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
వైట్ హౌజ్ లోని ఓవల్ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ , రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే భారత్ పై అదనపు సుంకాలు తగ్గిస్తారా? అని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ‘‘మేము దానిని తరువాత నిర్ణయిస్తాం. కానీ ప్రస్తుతం వారు 50 శాతం సుంకాన్ని చెల్లిస్తారు’’ అన్నారు.
చైనా లాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని భారత అధికారులు అంటున్నారని అనగా.. ఏం పర్వాలేదని ఆయన సమాధానమిచ్చారు. కేవలం భారత్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా‘‘ ఎనిమిది గంటలు మాత్రమే గడిచాయి.
కాబట్టి రాబోయే కాలంలో ఏం జరగబోతుందో చూద్దాం.. మీరు ద్వితీయ ఆంక్షలు చూడబోతున్నారు’’ అని హెచ్చరించారు. ప్రస్తుతం రష్యాతో చమురు కొనుగోలు చేసినందుకు భారత్ పై ఆగష్టు 27 నుంచి అదనంగా 25 శాతం సుంకాలను అమెరికా ప్రకటించింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, తుర్కియేలపై ట్రంప్ ఎలాంటి అదనపు సుంకాలు విధించలేదు. చైనాపై 30 శాతం, తుర్కియేపై 15 శాతం ప్రకటించారు.
చైనాపై ట్రంప్ విమర్శలు..
భారత్ పై అదనపు సుంకాలు, జరిమానాలు విధించిన తరువాత మరో విలేకరి చైనా గురించి ప్రశ్నించారు. ఏవైన అదనపు సుంకాలు విధించే ప్రణాళిలు ఉన్నాయా?.. దీనికి సమాధానమిస్తూ ఏదైనా జరగవచ్చు.. మనం ఎలా చేస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. జరగవచ్చు అని హింట్ ఇచ్చారు.
చాలా దురదృష్టకరం: భారత్
ట్రంప్ భారత్ పై వేసిన అదనపు సుంకాలపై భారత్ స్పందించింది. ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కోసం తీసుకుంటున్న చర్యలకు బదులుగా భారత్ పై సుంకాలు విధించడం చాలా దురదృష్టకమరమని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘మా దిగుమతులు మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉంటాయి. భారత్ లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను నిర్థారించే మొత్తం లక్ష్యంతో జరుగుతాయనేది వాస్తవం. మా వైఖరిని మేము ఇది వరకే స్పష్టం చేశాము’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కార్యనిర్వహాక ఆదేశం..
‘‘రష్యన్ ఫెడరేషన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకుంటున్న భారత దేశ వస్తువుల దిగుమతులపై అదనపు సుంకం విధించడం సముచితం’’ అని తాను నిర్ణయించినట్లు ట్రంప్ తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు నేను గుర్తించాను. దీని ప్రకారం చట్టానికి అనుగుణంగా యూఎస్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలోకి దిగుమతి చేసుకునే భారత వస్తువులుు 25 శాతం అదనపు ప్రకటన విలువ రేటుకు లోబడి ఉంటాయి’’ అని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు.
అమెరికా ఇప్పటికే తమ దేశంలోకి వచ్చే చిప్స్, సెమీ కండక్టర్లప దాదాపు 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నింటిని యూఎస్ లోనే తయారు చేయాలని ట్రంప్ కోరిక. ఇక్కడ తయారు చేస్తే వాటికి ఎలాంటి రుసుములు విధించమని ఆయన హమీ ఇస్తున్నారు.
రష్యా అతిపెద్ద సరఫరాదారు..
భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 88 శాతం విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. ఇందులో ప్రధానంగా పశ్చిమాసియా దేశాల వాటా గణనీయంగా ఉండేది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రష్యా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 2021 వరకూ మన చమురు దిగుమతుల్లో మాస్కో వాటా కేవలం 0.2 శాతం మాత్రమే.
క్రిమ్లిన్ ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలు పెట్టిన తరువాత పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యన్ చమురు మార్కెట్ ధరల కంటే తక్కువగానే భారత్ కు లభిస్తుంది. జూలై నెలలో భారత్ రోజుకు దాదాపు ఐదు మిలియన్ బ్యారెల్లు దిగుమతి చేసుకుంటున్నారు. అందులో 16 లక్షల బ్యారెళ్లు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి ఉన్నాయి.
భారత్ పోటీదారులు..
భారత్, బ్రెజిల్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. తరువాత మయన్మార్ 40 శాతం, థాయిలాండ్, కంబోడియా 36 శాతం, బంగ్లాదేశ్ 35 శాతం, ఇండోనేషియా 32 శాతం, చైనా, శ్రీలంక 30 శాతం, మలేషియా 25 శాతం ఫిలిప్పీన్స్, వియత్నాం పై 20 శాతం విధించారు. టారిఫ్ ల వల్ల మిగిలిన దేశాల ఉత్పత్తులు మనకంటే చవకగా అమెరికాలో లభిస్తాయి.