భారతీయ వస్తువులపై అమల్లోకి 50 శాతం సుంకాలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు 25 శాతం పెనాల్టీ విధించిన ట్రంప్;
By : The Federal
Update: 2025-08-27 09:54 GMT
అమెరికా, భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధించింది. నిన్నటి వరకు మనపై అమెరికా 25 శాతం సుంకం వసూలు చేసింది. అర్థరాత్రి 12.01 నిమిషం నుంచి మనపై మొత్తంగా 50 శాతంగా సుంకాలు అమల్లోకి వచ్చినట్లు అయింది.
రష్యా చమురును వద్దని చెప్పిన తరువాత కూడా కొనుగోలును కొనసాగించినందుకు న్యూఢిల్లీపై జరిమానా విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ సుంకాల వల్ల ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, వ్యూహాత్మక భాగస్వాముల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచినట్లు అయింది.
50 శాతం వసూలు..
ఉక్రెయిన్ లోని యుద్ధాన్ని త్వరగా ముగించాలనే వాషింగ్టన్ వ్యూహాంలో భాగంగా రష్యా నుంచి ఇంధన దిగుమతులు చేసుకోవద్దని న్యూఢిల్లీపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగానే ఈ టారిఫ్ లు విధిస్తున్నట్లు వైట్ హౌజ్ చెబుతోంది. అయితే ఇది వట్టి సాకు మాత్రమే అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా నుంచి చమురు, గ్యాస్, ఆయుధాలతో పాటు భారతీయ వ్యవసాయ మార్కెట్ లో అమెరికా ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికే ఈ నాటకం ఆడుతోందని విశ్లేషణలు వినపడుతున్నాయి.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని అమలు చేసే ప్రణాళికలను వివరిస్తూ ముసాయిదా నోటీస్ జారీ చేసంది. తాజా చర్యతో భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలు ఇప్పుడు 50 శాతంగా ఉన్నాయి.
భారత్ తో పాటు బ్రెజిల్ పై కూడా అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. సుంకాల కారణంగా దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, ఫర్నిచర్, రసాయనాలపై అమెరికాలో ధరలు పెరగనున్నాయి.
విఫలమైన వాణిజ్య చర్యలు..
రెండు పార్టీలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఐదు సార్లు సమావేశం అయ్యారు. అయినప్పటికీ అవి తుది ఒప్పందానికి రాలేకపోయారు. కానీ ఫార్మాస్యూటికల్, కంప్యూటర్ చిప్స్ వంటి వాటికి ఈ సుంకాల నుంచి మినహయింపు ఇచ్చారు.
భారత్ పై సుంకాలు అమల్లోకి రాగానే ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ‘అమెరికా ఫస్ట్’ , అమెరికా తిరిగి వచ్చిందనే నినాదాలతో చమురు బ్యారెల్ తో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు.
మోదీ స్థితిస్థాపకత..
ఈ విషయం పై ప్రధాని మోదీ స్పందించారు. భారత్ బాహ్య ఒత్తిడిని తట్టుకుంటుందని, రైతులు, పశువుల పెంపకందారులు, చిన్న తరహ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడుతోందని అన్నారు.
‘‘రైతులు, పశువుల పెంపకందారులు, చిన్న తరహ పరిశ్రమల ప్రయోజనాల అత్యంత ముఖ్యమైనవి. మాపై ఒత్తిడి పెరగవచ్చు. కానీ మేము అన్నింటిని భరిస్తాము’’ అని అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో అన్నారు.
ఒకరోజు తరువాత గుజరాత్ లో జరిగిన మరో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. భారతీయులు కేవలం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ‘‘స్వదేశీ అంటే సులభం, డబ్బు డాలర్లలో ఉందా లేదా పౌండ్లలో ఉందా లేదా అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు పట్టింపు లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే చెమట, కృషి భారతీయంగా ఉండాలి’’ అని చెప్పారు.