ఆగని హైజాక్ ల పర్వం, భారత సిబ్బంది ఉన్న నౌక మాయం

అరేబియా సముద్రంలో కొన్ని రోజుల కింద మొదలైన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు అపహరించారు.

Update: 2024-01-05 07:38 GMT
ప్రతీకాత్మక చిత్రం

ఆసియా వాణిజ్యానికి దిక్సూచీ లా ఉన్న అరేబియా సముద్రంలో అలజడులు ఇప్పట్లో శాంతించేలా లేదు. ఇప్పటికే యెమెన్ తీవ్రవాదులైన హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు, హైజాక్ లకు పాల్పడుతూ ఉండగా, తాజాగా సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు సైతం సందట్లో సడేమియాలా తయారైయ్యారు. తాజాగా లైబీరియా వాణిజ్య నౌకను అహపరించారని తెలుస్తోంది. ఇందులో పలువురు భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

హైజాక్ కు గురి అయినా నౌకను లైబీరియాకు చెందిన ‘ఎంవీ లీలా నార్ఫోక్’గా యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది. ఈసంస్థ సముద్ర వాణిజ్య నౌకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమాచారం అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థే తాజాగా నౌక హైజాక్ గురి అయినట్లు వెల్లడించింది.

లైబీరియా నౌక హైజాక్ కు గురికావడంపై ఇండియన్ నేవీ స్పందించింది. ‘లైబీరియా జెండాతో కూడిన నౌక హైజాక్ గురి అయిందనే సమాచారం రాగానే మేం అప్రమత్తం అయ్యాం. జనవరి 4న నలుగురైదుగురు సాయుధ దుండగులు యూకే మారిటైమ్ సంస్థకు సమాచారం పంపించారనే వార్త మాకు అందింది’ అని నేవీ అధికారి వెల్లడించారు.

నౌకలో పలువురు భారతీయ సిబ్బంది

హైజాక్ గురి అయిన నౌకలో పలువురు భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఎంతమంది ఉన్నారు, వారి ఎక్కడివారు లాంటి వివరాలు తెలియరాలేదు. అరేబియాలో వరుసగా నౌకలపై దాడులు జరగడం, హైజాక్ కావడంపై భారత నేవీ దృష్టి సారించింది. ఇప్పటికే రెండు యుద్ద నౌకలను మోహరించగా తాజాగా ఐఎన్ఎస్ చెన్నైని సైతం అటువైపు మళ్లించింది. ‘మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇతర ఏజెన్సీలు, సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నాం’ అని నేవీ అధికారి వెల్లడించారు. విదేశీ భాగస్వాముల సహకారంతో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడానికి భారత నేవీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News