ఆఫ్గానిస్తాన్: సల్మాడ్యామ్ ను పరిశీలించిన భారత ఇంజనీర్ల బృందం?
భారత ప్రభుత్వం ఆఫ్గానిస్తాన్ లో ఎనిమిది సంవత్సరాల కింద నిర్మించిన సల్మా డ్యామ్ ను పరిశీలించడానికి ఇంజనీర్ల బృందాన్ని పంపినట్లు సమాచారం
By : The Federal
Update: 2024-02-29 05:46 GMT
భారత్- ఆఫ్గానిస్తాన్ స్నేహంలో భాగంగా అప్పట్లో భారత ప్రభుత్వం హెరాత్ ప్రావిన్స్ లో నిర్మించిన సల్మా డ్యామ్ ను భారత ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఎనిమిది సంవత్సరాల క్రితం దాదాపు 265 మిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ దీనిని నిర్మించి ఆప్గాన్ ప్రజలకు కానుకగా అందించింది.
అయితే 2021 లో అమెరికా అర్థాంతంరంగా వైదొలగడంతో అప్గాన్ ప్రభుత్వాన్ని తాలిబన్ వశం చేసుకుంది. ఆ తరువాత కాబూల్ నుంచి భారత ఎంబసీ అధికారులు సహ, ఇంజనీర్లు, సాధారణ ప్రజలు భారత్ కు చేరుకున్నారు. ప్రస్తుతం జాతీయ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ డ్యామ్ ను భారత ఇంజనీర్ల బృందం మూడు రోజుల పాటు పరిశీలించింది.
వాయువ్య ఆప్గాన్ లో హరిరుద్ నదిపై ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇది మూరుమూల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించడంతో పాటు, సాగునీరు సైతం అందిస్తుంది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా దీనిపై సరిగా నిర్వహించకపోవడంతో చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాటితో పాటు కొన్ని సమస్యలు డ్యామ్ ప్రారంభించిన తరువాత ఉత్పన్నం అయ్యాయి.
వీటిని పరిష్కరించే సమయంలోనే తాలిబన్లు రావడంతో పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోయాయి. చాలా కాలం నుంచి తాలిబన్ ప్రభుత్వం ఈ డ్యామ్ ను పరిశీలిందుకు తగిన ఇంజనీర్ల బృందాన్ని పంపాలని భారత్ ను కోరుతోంది. అయితే అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం, మారుమూల ప్రాంతంలో డ్యామ్ ఉండడం, ఇంజనీర్లకు తగిన భద్రత కల్పిస్తారో లేదో అన్న సందేహం తో న్యూ ఢిల్లీ ఇన్ని సంవత్సరాలు మౌనం వహించింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం వ్యాప్కోస్ చెందిన ఇంజనీర్లు బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హెరాత్ ప్రావిన్సు చేరుకుని డ్యామ్ ను పరిశీలన ప్రారంభించారు. వీరితో పాటు ఆప్గాన్ భద్రతా నిఫుణులు, ఇంధన, జల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సాప్ట్వేర్, ఎలక్ట్రిక్ సిస్టమ్ నిఫుణులు కూడా ఉన్నారు.
భారత ప్రభుత్వం తన దౌత్యవేత్తలు తిరిగి 2022 లో తిరిగి కాబూల్ వెళ్లాక క్రమంగా సఖ్యత ఏర్పడింది. ప్రస్తుత సల్మా డ్యామ్ వద్ద ఈ పేరు చెక్కు చెదరకుండా ఉంది. అలాగే తాలిబన్ ప్రభుత్వం జెండా నాశనం చేసిన, భారత జెండా మాత్రం ఇంకా అలా ఎగురుతూనే ఉంది.
సల్మా డ్యామ్ ను నిర్మించడానికి భారత దేశం వ్యాప్కోస్ తో పాటు, ఎస్ ఎస్ జేవీ, ఏంజెలిక్ లిమిటెడ్ అను రెండు ప్రైవేట్ సంస్థల జాయింట్ వెంచర్ లతో ఒప్పందం చేసుకుంది. అలా 2016లో దీనిని ప్రధాని మోదీ, ఆప్గాన్ అధ్యక్షుడు అఫ్రష్ ఘనీ ప్రారంభించారు.
సమస్యలు
ఇందులో డ్యామ్ ను నియంత్రించడానికి కేంద్రీకృత సాప్ట్ వేర్ ఎస్ సీ ఏడీఏ వ్యవస్థ ఉంది. అయితే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పని చేయట్లేదు. నీటిపారుదల తూమూ గేట్లు తెరవడం, మూయడం కూడా కష్టంగా పనిచేయట్లేదు. ప్రస్తుతం ఈ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం హెరాత్ వెళ్లింది. డ్యామ్ పరిశీలన అనంతరం వీరంతా తిరిగి కాబూల్ రానున్నారు.