అమెరికా బాల్టీమోర్ లో కుప్పకూలిన భారీ వంతెన...ఎలా జరిగిందంటే
అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నదిలో నిర్మించిన వంతెనను ఓ భారీ షిప్ ఢీ కొట్టడంతో అది కాస్త నదిలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో..
By : The Federal
Update: 2024-03-26 14:55 GMT
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ నదిలో నిర్మించిన వంతెనను ఢీ కొట్టడంతో దాని పైన ప్రయాణిస్తున్న అనేక వాహనాలు అందులో పడిపోయాయి. ఇప్పటి వరకూ కేవలం ఇద్దరిని రక్షించినట్లు అగ్నిమాపకశాఖ ప్రకటించింది. అసలు ఎంతమంది నదిలో పడిపోయారో వివరాలు తెలియని అధికారులు అంటున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం ౨౦ మంది వ్యక్తులు నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ వద్ద ఉన్న పటాప్ స్కో నదిపై నిర్మించిన ‘ఫ్రాన్సిస్ స్కాట్’ బ్రిడ్జిని నౌక ఢీ కొట్టింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన సంభవించింది.
వంతెన ఎలా కూలిపోయింది
ఓడ వేగంగా వచ్చి వంతెన పిల్లర్లను ఢీ కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్స్ లో ఉన్న వీడియో ప్రకారం నౌక వేగంగా వచ్చి సెంట్రల్ సపోర్ట్ లోని ఒక ఇనుప పియర్స్ ని వేగంగా ఢీ కొట్టింది. దాంతో పేకమేడల వంతెన మొత్తం నదిలో కూలిపోతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు ఓడలో సైతం మంటల చెలరేగాయి. అయితే అందులోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
బాల్టిమోర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కెవిన్ కార్ట్‌రైట్, ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ, ఏజెన్సీలకు తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో 911 కాల్‌లు వచ్చాయని, బాల్టిమోర్ నుంచి బయలుదేరిన ఓడ వంతెనపై స్తంభాన్ని తాకినట్లు అందులో వివరించినట్లు తెలిపారు.
బాల్టిమోర్ కోస్ట్ గార్డ్ అధికారి మాథ్యూ వెస్ట్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఉదయం 1.27 గంటలకు తమకు సమాచారం వచ్చిందన్నారు. సింగపూర్ కు చెందిన ఓడ, బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తున్నట్లు చెప్పారు. ఓడ పేరు డాలీ అని వెల్లడించారు. ఓడ దారి తప్పి వంతెనపైకి దూసుకెళ్లడానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. ఛానెల్ దాదాపు 350 మీటర్ల వెడల్పుతో ఉంది ఓడ దాని మధ్యలో ఉండాలి. ఈ వంతెనను 47 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీనికి అమెరికా జాతీయగీతం రాసిన ఫ్రాన్సిస్ స్కాట్ పేరు పెట్టారు.
ట్రాఫిక్‌ను ఎలా..
2.6-కి మీ పొడవు, నాలుగు లేన్ల వంతెన ఇంటర్‌స్టేట్ 695లో భాగంగా ఉంది. ఇది 1977లో నిర్మించబడింది, ఇది ఒక ముఖ్యమైన మార్గం. బాల్టిమోర్ నౌకాశ్రయంతో పాటు, తూర్పు తీరంలోని సముద్ర వాణిజ్యానికి అనువుగా ఉంటుంది. 2023లో దాదాపు 8,00,000 వాహనాలు ఈ నౌకాశ్రయం గుండా ప్రయాణించగా రికార్డు స్థాయిలో 1.3 మిలియన్ టన్నుల దిగుమతి చేసుకున్న కార్గోను రవాణా చేశాయని అంచనా. ఈ వంతెన సంవత్సరానికి 11.5 మిలియన్ వాహనాలను ప్రయాణిస్తుంటాయి. సగటు రోజువారీ ట్రాఫిక్ 31,500 వాహనాలు. ప్రస్తుతం ట్రాఫిక్ ను దారి మళ్లించారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.