పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు..

పహల్గామ్‌ ఉగ్రదాడికి ఘాటుగా బదులిచ్చిన భారత బలగాలు;

Update: 2025-05-07 07:51 GMT
న్యూఢిల్లీలో 'ఆపరేషన్ సిందూర్' గురించి మీడియాతో మాట్లాడుతున్న IAF వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ..
Click the Play button to listen to article

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరిట ఇండియన్ ఆర్మీ భారీ సైనిక ఆపరేషన్‌ ప్రారంభించింది. మొత్తం తొమ్మిది స్థావరాలను టార్గెట్ చేసింది. ఉగ్రదాడికి ప్లాన్లు వేయ‌డం, చొర‌బాట్లకు పాల్పడ‌డం ఈ కేంద్రాల నుంచే జ‌రుగుతోంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడికి ఇది ప్రతీకార చర్య.


అసలు ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయి. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారో తెలుసుకుందాం..

1. జైషే ఈ మొహ‌మ్మద్ ప్రధాన కార్యాల‌యం..

ఇది జైషే మహమ్మద్ (JeM) ఉగ్ర సంస్థ ప్రధాన శిక్షణా కేంద్రం. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బ‌హ‌వ‌ల్‌పుర్‌లో ఉంటుంది. 2015 నుంచి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి స్కెచ్ ఇక్కడే రూపొందించారు. ఇక్కడే జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్, అతని సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, మరొక కుటుంబసభ్యుడు మౌలానా అమ్మార్ వంటి కీలక నాయకుల నివాసాలున్నాయి. ఉగ్రవాదానికి ప్రేరేపించేలా 2024 డిసెంబర్లో మసూద్ అజహర్ ఇక్కడ నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించాడు. ఇక్కడే ఆయుధ శిక్షణ, మతపర భావజాల బోధనలు జరుగుతుంటాయి.


2. మురిద్కేలోని మర్కజ్ తాయిబా..

ఇది లష్కరే తోయ్బా(LeT)‌కు ప్రధాన శిక్షణా కేంద్రం. పాకిస్థాన్ పంజాబ్‌లోని షేక్‌హుపూరా జిల్లా నంగళ్ సాహ్దాన్‌లో ఉంటుంది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రాన్ని “టెర్రర్ ఫ్యాక్టరీ”గా పిలుస్తారు.

కొత్తగా చేరిన ఉగ్రవాదులకు ఇక్కడ భౌతిక శిక్షణ, రెండువారాల మతపర బోధన, ఆయుధ వినియోగ శిక్షణ ఇస్తారు. 2008 ముంబాయి దాడుల్లో పాల్గొన్న 10 మంది ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ ఇచ్చారు.

3. కోట్లీలోని మర్కజ్ రాహీల్ షహీద్ .. బాంబ‌ర్ ట్రైనింగ్‌, టెర్రర్ లాంచ్ బేస్‌..

పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో ఉన్న ఈ కేంద్రంలో సూసైడ్ బాంబ‌ర్లు, చొర‌బాటుదారుల‌కు ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఒకేసారి 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. బార్డర్ యాక్షన్ టీమ్ (సరిహద్దుల వద్ద భారత జవాన్లపై ఆకస్మిక దాడులు)లకు శిక్షణ ఇస్తారు.

4. గుల్‌పూర్‌..

రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు ఈ కేంద్రం లాంచ్‌ప్యాడ్‌లా ప‌నిచేస్తుంది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఆ రెండు జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు గుల్‌పూర్‌ను ఉగ్రవాదులు కేంద్రంగా మార్చుకున్నట్లు గుర్తించారు. 2023, 2024 సంవ‌త్సరాల్లో ఇక్కడ నుంచే ఎక్కువ దాడులు జ‌రిగాయి. భార‌తీయ భ‌ద్రతా కాన్వాయ్‌లు, పౌర కేంద్రాల‌ను ఇక్కడ నుంచి ఉగ్రవాదులు టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్నారు.

5. స‌వాయి..

వాయి క్యాంపుతో లింకు ఉన్నట్లు గుర్తించారు. సోన్‌మార్గ్‌, గుల్మార్గ్, పెహ‌ల్గామ్‌లో జ‌రిగే దాడుల్లో స‌వాయి ఉగ్ర క్యాంపుతో లింకు ఉన్నది.

6. స‌ర్జల్‌, బ‌ర్నాలా..

చొర‌బాటుదారుల‌కు ఇవి కేంద్రాలు.. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు, నియంత్ర‌ణ రేఖ‌కు ద‌గ్గర‌గా ఉన్నాయి. స‌ర్జల్‌, బ‌ర్నాలా కేంద్రాలు.. చొర‌బాటుదారుల‌కే ముఖ్య కేంద్రాలుగా భావిస్తున్నారు.

7. మెహ‌మూనా ఉగ్ర కేంద్రం..

హిజ్బుల్ ముజాహిద్దిన్ ఇక్కడ ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు. సియాల్‌కోట్ కు స‌మీపంలో ఈ క్యాంపు ఉన్నది. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దిన్ దీన్ని వాడుతున్నది. క‌శ్మీర్‌లో చాన్నాళ్ల నుంచి ఈ క్యాంపు యాక్టివ్‌గా ఉన్నది. నిజానికి ఈ గ్రూపు ప్రస్తుతం త‌న కార్యక‌లాపాల‌ను త‌గ్గించినా.. దాని ఆన‌వాళ్లు ఉన్నాయ‌న్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

8. ముజఫ్ఫరాబాద్‌లోని మార్కజ్ సయ్యద్‌నా బిలాల్ క్యాంపు..

జేషే మొహ‌మ్మద్‌కు చెందిన మ‌రో ల్యాంచ్‌ప్యాడ్ ఇది. ఈ శిబిరాన్ని ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ నడుపుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (SSG) కమాండోలు ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీన్ని కూడా గ‌త రాత్రి దాడిలో ధ్వంసం చేశారు. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఇది ప్రధాన గేట్‌వేగా ఉపయోగపడుతోంది. చొర‌బాటుకు పాల్పడ‌డానికి ముందు ఉగ్రవాదులు ఈ క్యాంపులో బ‌స చేస్తారు.

9. సియాల్కోట్‌లోని మెహ్మూనా జోయా శిబిరం..

పాకిస్థాన్ పంజాబ్‌లోని సియాల్కోట్ జిల్లా, హెడ్ మారాలాలోని భుట్టా కోట్లీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం (BHU)లో ముసుగులో నడుస్తున్న శిబిరం. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ (HM)కు చెందిన శిక్షణా శిబిరం. బయటికి మాత్రం ఆరోగ్య కేంద్రంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ఈ కేంద్రంలో సుమారు 30 మంది ఉగ్రవాదులు ఉండే వీలుంది.

Tags:    

Similar News