బెల్జియం కోర్టులో చోక్సీకి దక్కని ఊరట..
కేసును వాయిదా వేసిన న్యాయమూర్తి;
తన అరెస్టు చట్టవిరుద్ధమని, వెంటనే బెయిల్ విడుదల చేయాలని కోరుతూ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి(Mehul Choksi) వేసిన పిటీషన్‌ను బెల్జియం కోర్టు కొట్టివేసింది. చోక్సి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇది రెండోసారి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.13,500 కోట్ల రుణం పొంది, తిరిగి చెల్లించకుండా భారత్‌ను వీడిన కేసులో చోక్సీతో పాటు ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ నిందితులు. వీరిద్దరూ 2018లో దేశం నుంచి పారిపోయారు. భారత్ అభ్యర్థన మేరకు ఇటీవల బెల్జియం(Belgium) పోలీసులు చోక్సినీ అరెస్టు చేశారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు తిరస్కరించింది. ఇటీవల రెండోసారి కూడా దరఖాస్తు చేసుకున్నారు. అరెస్టు సమయంలో బెల్జియం పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోలేదని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ కోర్టుకు విన్నవించారు. చోక్సీ అరెస్ట్ సమయంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ తక్షణమే ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని కోరినా ఈ రోజు బెయిల్ మంజూరు కాకపోగా న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. దీంతో చోక్సీతో పాటు ఆయన న్యాయవాది నిరాశకు లోనయ్యారు. బెయిల్ కోసం ఎన్నిసార్లు అయినా దాఖలు చేసుకోవచ్చని, ఈ సారి కేసు రాజకీయ స్వరూపం, చోక్సీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరుతామని న్యాయవాది చెప్పారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని గతంలో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తాము ఇండియాలో ఉంటే ఇక ఇబ్బందులు తప్పవని దేశం వీడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. కాగా ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ పొందాడు. అందుకు అతడు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. అతడికి భారత్‌లో, అంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న విషయాన్ని దాచి పెట్టాడు. ఈ కారణాలతోనే అక్కడి అధికారులు ఛోక్సీని అరెస్టు చేశారు. మరోవైపు.. అతడిని భారత్‌కు రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.