ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆగిపోయింది?

డాక్టర్ . యస్. జతిన్ కుమార్ రెండు భాగాల విశ్లేషణలో మొదటి భాగం;

Update: 2025-05-21 10:21 GMT


ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ పచ్చిక మైదానాలలో సాధారణ పౌర పర్యాటకు లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా (2019), యురి (2016), ముంబై ఆర్థిక కేంద్రం(2008) లో పారా మిలటరీ దళాలు, సైనికులపై జరిగిన ఉగ్రవాద దాడుల మాదిరిగా కాకుండా ఇది సాధారణ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుంది. భారతీయ హిందూ మహిళల సింధూరాన్ని తుడిచి వేసే కిరాతక చర్య గా దాన్ని అభివర్ణించి దానికి శిక్ష ఎంత కఠోరంగా ఉంటుందో చవి చూపిస్తామని భారత ప్రభుత్వం మే ఏడు న సైనిక చర్యలు మొదలు పెట్టింది. ఉగ్రవాద హత్యల తర్వాత పెరిగిన, [పెంచిన] జాతీయ భావోద్వేగాలను, ప్రభుత్వ ప్రతిస్పందన ను మేళవించి దానికి ఆపరేషన్ సింధూర్ అనే ఉద్వేగ భరితమైన పేరు ఎన్నుకున్నారు.

కశ్మీర్ లో ఏప్రిల్ 22న జరిగిన దాడికి పాకిస్థాన్ సహకరించిందని, భారత్ ఆరోపించింది. ఆ దాడిలో తమ ప్రమేయం లేదని పాక్ ఖండించింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తరువాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి మధ్య ఇరు పక్షాలు అనేక చర్యలు తీసుకున్నాయి. పాకిస్తాన్ ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా భారతదేశం సైనికేతర శిక్షా చర్యల పరంపరను అమలు చేసింది. వాటిలో అనేకం ఆర్ధికంగా ప్రభావం కలిగించేవి

పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలు రద్దుచేసి గంటల వ్యవధిలో వారిని మన దేశం విడిచి వెళ్ళ వలసిందిగా ఆజ్ఞాపించారు. 1960 నుంచి సింధు బేసిన్ నుంచి ఇరు దేశాలు నీటిని సమకూర్చుకునేందుకు వీలు కల్పించే కీలకమైన నీటి పంపకాల ఒప్పందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారు. దీనివల్ల తమ దేశం కరువు పీడిత ప్రాంతంగా మారిపోతుందని ఈ సస్పెన్షన్ ను యుద్ధ చర్య గా పరిగణిస్తామని పాక్ పేర్కొంది.అట్టారీ-వాఘా సరిహద్దు మూసివేత వల్ల ఒక కీలక వాణిజ్య మార్గం మూతపడింది.[2023–24లో సుమారు రూ.3,886 కోట్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.] ఇది వ్యవసాయం, తయారీ రంగం తో సహా వివిధ రంగాలను ప్రభావితం చేసింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలకు భారతదేశం 25 విమాన మార్గాలను మూసివేసింది. దీనితో సుదీర్ఘ మార్గాల ద్వారా విమానాలను నడపవలసి వచ్చింది. సగటు నిర్వహణ ఖర్చులను నెలకు రూ.80–100 కోట్లు పెంచింది, ప్రాంతీయ కనెక్టివిటీని తగ్గించింది. దీనికి ప్రతిగా భారత విమానాలకు పాక్ తన గగనతల దారులను మూసివేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు దూరమైనవి కావటంతో ఇంధన వినియోగం పెరిగింది. ప్రయాణ వ్యవధి పెరిగింది. అదనపు సిబ్బంది అవసరమయ్యింది. భారతీయ విమానయాన సంస్థలపై సుమారు రూ.307 కోట్లు అదనపు ఆర్ధిక భారం పడింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం గా పని చేసిన 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ నిలిపివేసింది. ఇక పరిస్థితులు వేగంగా మార్పు చెందుతూ వచ్చాయి.

టెర్రరిస్టు దాడులకు ప్రతీకారంగా వారి శిబిరాల పై దాడి అని భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఆ తర్వాత డ్రోన్లు, క్షిపణి దాడులతో ఘర్షణలు పెరిగాయి. వరుస దాడుల నేపథ్యంలో ఇరు వైపులా అనేకమంది పౌరులు మృతిచెందినట్లు సమాచారం. 100 మంది ఉగ్రవాదులను ఖతం చేశామని అందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర వాదులు ఐదుగురు వున్నారని భారత్ సగర్వంగా ప్రకటించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఒక ఆయుధ తయారీ కేంద్రాన్నినాశనం చేశామని భారత లెఫ్టీనెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ ప్రకటించాడు.

మొదటి దశలో మురిద్కే, ముజఫరాబాద్, బహవల్పూర్ల లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ స్థావరాలతో సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిచ్చే మౌలిక సదుపాయాలను నిర్మూలించడమే మాలక్ష్యం అని చేపట్టిన ఈ ఆపరేషన్ తో భారత్-పాక్ ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. పాక్ ప్రతి దాడులు చేసింది. భారత వాయు సేన ఈ దశలో పాకిస్థాన్ లో సరిహద్దు లకు సుదూరంగా విస్తృత పరిధిలో నెలకున్న మిలిటరీ స్థావరాలను గురి చూసి దెబ్బతీసింది. నూర్ ఖాన్, రఫీఖీ, మురిద్, సుక్కూర్, సియాల్ కోట్, పాస్రూర్, చునియన్, సర్గోధా, స్కర్దు, భోలారి, జకోబాబాద్ లోని సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పలు ఉగ్రవాద బంకర్లు, పాక్ ఆర్మీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాక్ సైన్యం సుమారు 50 మంది సిబ్బందిని కోల్పోయిందని, కొన్ని యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేశామని భారత సైనిక కమాండర్లు చెప్పారు. పాక్ వైమానిక దళంలో 20% మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి.లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, నూర్ ఖాన్ వంటి అనేక పట్టణాలకు చాలా నష్టం కలిగినట్లు న్యుయార్క్ టైమ్స్, రాయిటర్స్ లాంటి సంస్థలు శాటిలైటు చిత్రాల ఆధారంగా నివేదించాయి.లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహి దీన్ లకు చెందిన 9 శిబిరాలు ధ్వంసం కావటం తో సేఫ్ హౌస్ లు, ఆయుధాల డిపోలు, శిక్షణ పరికరాలు, వాహనాలకు కలిగిన నష్టం మొత్తం రూ.150-200 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ పలు క్షిపణులను ప్రయోగించి, యుద్ధ ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్లను మోహరించింది. దానికి రోజువారీ ఆపరేషన్, మందుగుండు సామగ్రి ఖర్చులు సుమారు రూ.60-80 కోట్లు అవుతుంది. భారత వైమానిక దాడుల్లో దెబ్బతిన్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించిన సమీపంలోని హౌసింగ్ క్లస్టర్ల పునరుద్ధరణ, నష్టపరిహారం ఖర్చులు రూ.100-120 కోట్లుగా అంచనా వేశారు. అట్టారీ-వాఘా వాణిజ్య కారిడార్ మూసివేయటంతో ఇరు దేశాల మధ్య ఎగుమతులు నిలిచి పోయి రూ.1,100-1,400 కోట్లు ప్రత్యక్ష వాణిజ్య నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

ఇండియా స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో కూడిన రాఫెల్ జెట్ విమానాలను మోహరించింది. ఒక్కో క్షిపణి రూ.30–35 కోట్లు, హ్యామర్ బాంబులకు రూ.3–5 కోట్లు, యుద్ధ సామగ్రి, ఇంధనం, లాజిస్టిక్స్ కోసం మొత్తం రూ.500-700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మిలిటరీ మొబిలైజేషన్ కోసం రూ. 14,700 కోట్లు; ఉపయోగించిన మందుగుండు, ఆయుధ సామగ్రి, విమానాలకు జరిగిన నష్టం రూ. 600–1,000 కోట్లు, మౌలిక సదుపాయాల నష్టం ₹ 150–200 కోట్లు వుంటుందని అంచనా వేశారు.

పాకిస్థాన్ దాదాపు పాతిక ఇండియా నగరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి నిర్వహించింది. అయితే భారత్ ఆకాశ్ రక్షణ వ్యవస్త ద్వారా వాటిలో అధిక శాతాన్ని నిర్వీర్యం చేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ దాడులలో భారత్ రఫెల్ తో సహా 5 యుద్ద విమానాలు కోల్పోయినట్లు, కనీసం 15 మంది మరణిం చి నట్లు పాశ్చాత్య మీడియా సాక్ష్యాధారాలతో చెబుతోంది. పాక్ వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు, అనేక డ్రోన్లు క్షిపణులను అడ్డుకునేందుకు భారత్ ఎస్-400 'సుదర్శన చక్ర' గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది. ఒక్కో ఎస్-400 సముదాయం విలువ సుమారు రూ.10,000 కోట్లు. మరి ఈ యుద్దం ఏ సమస్యను పరిష్క రించింది? కాశ్మీర్ లేక పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి ఏదైనా సమాధానం దొరికిందా? కనీసం పహల్గామ్ దుండగులైనా పట్టుబడ్డారా? గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఉగ్రవాదుల మూలాలు పెకలించి వేశామని చెప్పారు. భారత్ వైపు చూడాలంటే వణుకు పుడుతుందని చెప్పారు. ఇప్పుడూ అంతేనా?

ఇకపోతే మే 9, 2025 న, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పాకిస్తాన్ కు 1.4 బిలియన్ డాలర్ల కొత్త రుణా న్ని ఆమోదించింది. ఇప్పటికే పరిశీలనలో ఉన్న 7 బిలియన్ డాలర్ల ఋణ స్థిరీకరణ కి ఒక సమీక్షను పూర్తి చేసింది అదనంగా 1 బిలియన్ డాలర్ల నగదును అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంతో పెరుగుతున్న సంఘర్షణ ఐఎంఎఫ్ నిబంధనలకు విరుద్ధం కనుక ఈ రుణం కోసం పాకిస్థాన్ వెనుకంజ వేసింది అనుకునే వారున్నారు. అయితే యుద్దం మధ్యలోనే రుణం పొందగలిగిన పాకిస్థాన్ దానిగురించి వెనుకంజ వేసిందనుకునే అవకాశం లేదు. రక్షణ వ్యయంతో ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని భయపడిందను కోవటానికి కూడా ఆస్కారం లేదు. 2024-25లో భారత దేశపు రక్షణ బడ్జెట్ రూ.6.22 లక్షల కోట్లు [జీడీపీలో 1.9%] కాగా పాకిస్థాన్ ది రూ.2.12 లక్షల కోట్లు [వారి జీడీపీ లో 1.7%] పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ మీడియాతో 10 వ తారీఖున మాట్లాడుతూ “పరిస్థితులు చూస్తుంటే ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. తిరిగి చెల్లించడం తప్ప ఇస్లామాబాద్ కు మరో మార్గం లేదు. భారత్ తో పూర్తి స్థాయిలో యుద్ధం ఒక్కటే మార్గమని” అన్నారు అయితే భారత్, పాక్ ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే ఇరు దేశాలకు విపత్కర ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయి అనేక అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఎవరు విజయం సాధించినా యుద్దం కొనసాగితే ఇరువైపులా ఎంత ప్రాణ నష్టం జరుగుతున్నదీ, ఎంత సింధూరం కరిగిపోతున్నదీ, ఎంత కన్నీరు ప్రవహిస్తున్నదీ, ఎంత సంపత్తి, వనరులు ఆహుతి అయిపోతు న్నదీ గమనించాలి. ఇవన్నీ తక్షణం కనిపించే నష్టాలు. ఇక దీర్ఘకాల జీవన విధ్వంసం ఏ లెక్కకూ అందనిది.

ఈ స్థితిలో 10 వ తేదీ సాయంత్రం కాల్పులు విరమిస్తున్నట్లు గా ప్రకటించారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రకటన అనేక అనుమానాలకు, అసంతృప్తికి దారితీసింది. యుద్దం ముగిసిన నందుకు ఒక పక్క సంతోషి స్తూనే, ఏదో గూడుపుఠాణీ జరిగినట్లు ప్రజలు భావించారు.

'10వ తేదీ తెల్లవారు జామున మేం పాక్ పై అత్యంత ప్రభావ వంతమైన దాడి చేశాం. దానిని చావు దెబ్బ తీసాం” అని భారత్ ప్రకటించిన రోజునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ ద్వారా “ఈ రోజు నుండి [భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటల నుండి] పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందని” మొదట ప్రకటించారు."పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా దౌత్య జోక్యాన్ని ఆయన ప్రశంసించారు. కాల్పులు జరుపుకుంటున్న పక్షాలయిన రెండు అణ్వస్త్ర దేశాలు భారత్, పాక్ దేశాల సైనిక కమాండ్లు ముందుగా ఈ ప్రకటన చేయలేదు. తరువాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయం లో రాజీపడ కుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం పాకిస్థాన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. పాక్ ప్రధాని ఈ విషయంలో అమెరికా పాత్రను ప్రశంసించి ధన్యవాదాలు తెలపగా భారత్ మాత్రం అమెరికా గురించి ప్రస్తావించ లేదు. భారత్ పాక్ మిలిటరీ అధికారుల మధ్య జరిగిన ఒప్పందంగా మాత్రమే పేర్కొన్నది. భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ "కాల్పులు మరియు సైనిక చర్యను నిలిపివేయడంపై భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ రోజు ఒక అవగాహనకు వచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అన్ని రూపాల్లో దృఢమైన, రాజీలేని వైఖరిని కొనసాగి స్తోంది. ఇది కొనసాగుతుంది' అని పేర్కొన్నారు.

తాత్కాలికంగా కాల్పులు విరమించినా ఈ సమస్యకు మూలాలు లోతైనవి. సుదీర్ఘమైనవి. ఎంతోకాలంగా వైషమ్యాలకు కారణభూత మవుతున్నవి. 1947 లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి కాశ్మీర్ ప్రాంతం భారత్-పాకిస్తాన్ల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోని కొన్ని భాగాలను రెండు దేశాలు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ రెండూ కాశ్మీర్ పూర్తిగా తమకే దక్కాలని వాదించు కుంటున్నాయి. ఇది కేవలం భూమి పై అధికారం సమస్య మాత్రమే కాదు. దీని వెనుక రెండు మతాల [ద్విజాతి] సమస్య అంతర్లీనంగా వున్నది. అందుకే అమెరికా అధ్యక్షుడు దీన్ని 1500 సంవత్సరాల సమస్య అన్నాడు. మత మౌఢ్యం, పెంచిన వైషమ్యం కారణం గా ఈ సమస్య అపరిష్కృతంగా వుందని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయన చెప్పని మరో కారణం కూడా వున్నది. ప్రస్తుత భౌగోళిక రాజకీయాలలో కొన్ని ప్రాంతాలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందులో కాశ్మీర్ ప్రాంతం ఒకటి. దీనిపై ఆధిపత్య శక్తులు తమ ప్రభావం కోల్పోవటానికి ఇచ్చగించవు. ఏదైనా పరిష్కారం కుదిరినా అది తమ కనుసన్నల లోనే జరిగేట్లు, సమస్యను అంతర్జాతీయం చేయాలని ప్రయత్నిస్తాయి. పరిష్కారం పేరుతో అమెరికా కాశ్మీర్లో తిష్ట వెయ్యటానికి ప్రయత్నించేది ఇందుకే. రొట్టెకోసం కొట్లాడుకున్న రెండు పిల్లుల కథలో కోతిలా ప్రవేశించ టానికి అమెరికా వేచి చూస్తున్నది.

12-5-25 రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఎలా ప్రయోగించినదీ చెబుతూ ఇకనుంచీ ఇటువంటి చర్యలు "కొత్త సాధారణం" అవుతాయని, భారత గడ్డపై లేదా భారతీయ పౌరులపై ఉగ్రవాద చర్యకు పాల్పడితే తాము అదే మోతాదులో ప్రతిస్పందిస్తామని, అదే విధంగా ప్రతీకారం తీర్చుకుంటా మని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త లక్ష్మణ రేఖను [ఎర్ర రేఖను] గీసిందని, అంతేకాక భారత దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, సమర్ధన, వారికి రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ అణ్వస్త్ర ఆయుధాలు ఉపయోగించడానికి కూడా సిద్దపడుతున్నదని ప్రపంచం ముందు బట్ట బయలు అయ్యిందని అన్నారు. అయితే అణ్వాయుధ ప్రయోగ మనే బెదిరింపులను, బూకరింపులను ఆపరేషన్ సింధూర్ తో తిప్పి కొట్టామని ఆయన చెప్పారు.పాకిస్థాన్ సైనిక పాటవాన్ని ఇది ఛిన్నాభిన్నం చేసిందని ఆయన అన్నారు. ప్రధాని తన టెలివిజన్ ప్రసంగంలో, భారతదేశం "ఎటువంటి అణు బ్లాక్మెయిల్ను అంగీకరించదు" అని అన్నారు. పాకిస్థాన్ శరణువేడి నందువల్ల ప్రస్తుతానికి కాల్పులు నిలిపి వేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే కాల్పుల విరమణకు దారితీసిన పరిస్థితుల గురించి కానీ లేక పాకిస్థాన్ పై తాము విధించిన షరతుల గురించి కానీ ఏమీ చెప్పలేదు. అమెరికా పాత్ర గురించి కూడా ఆయన పూర్తిగా మౌనం పాటించారు. మోడీ ప్రసంగంలో శాంతి ప్రియత్వం ఏమీ లేకపోగా ఆయన భాష, దేహ భాష యుద్ద ప్రేరకంగానే ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ ఒక నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పటంలో తాను తలచిన వెంటనే తిరిగి యుద్దం మొదలవుతుందనే సూచన వున్నది.

భారతదేశం రావల్పిండిలోని నూర్ ఖాన్ స్థావరం [ప్రధాన మిలిటరీ కమాండ్] మరియు సర్గోధాలోని ముషాఫ్ వైమానిక స్థావరంపై [దాని పక్కనే కిరానా హిల్స్ లో భూగర్భ అణు నిల్వల కేంద్రం వుందని చెబుతున్నారు ]ఊహాతీతమైన దాడులు జరగటంతో రేడియో ధార్మికత లీక్ అయ్యే ప్రమాదం వుందని భావించి పాకిస్తాన్ భయాందోళనలతో యుద్దం ఆపి వేయించమని అమెరికాను వేడుకుందని అనేక మీడియా సంస్థలు రాస్తు న్నాయి. నూర్ ఖాన్ స్థావరం పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీకి చాలా దగ్గరలో వుంది. పాకిస్తాన్ అణ్వా యుధాల నిర్వహణ అథారిటీ అయిన కిరానా హిల్స్ అమెరికా నిపుణుల నియంత్రణ లేక వారి సాంకేతిక నిర్వహణలో వుందని విశ్లేషకులు కొందరు వెల్లడించారు. ఈ కారణం గానె 10 వ తారీఖు అమెరికా రంగంలోకి దిగి ఇరు ప్రభుత్వాల పై ఒత్తిడి చేసి కాల్పుల విరమణకు ఒప్పించి ఆ విషయాన్ని తానే ముందుగా ప్రకటిం చిందని బావించే వారున్నారు.

పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ తమ అణుయుద్ద విధానాన్ని 2002 లో వివరించారు . అది ప్రధానంగా భారతదేశం చుట్టూనే కేంద్రీకృత మయ్యింది. ఇది నాలుగు కీలక పరిస్థితులను [“ఫోర్ రెడ్ లైన్స్] పేర్కొంది. వాటిని పాకిస్తాన్"అస్తిత్వ ముప్పుకు"చిహ్నాలుగా భావిస్తారు. వీటిలో 1. ప్రాదేశిక సమగ్రత కు భంగం (భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేసి దాని భూభాగాన్ని ఆక్రమిస్తే) 2. సైన్యానికి తీవ్ర నష్టం ( సైనిక లేదా వైమానిక దళంలో ఎక్కువ భాగాన్నిభారత్ నాశనం చేస్తే), 3. ఆర్థిక నష్టం (భారతదేశం పాకిస్తాన్ ను ఆర్థికంగా గొంతు నులిమివేస్తే), 4. దేశీయ అస్థిరత (భారతదేశం పాకిస్తాన్ లో అంతర్గత అశాంతిని ప్రేరేపిస్తే) వాళ్ళు అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ప్రకటించారు. ఏ యుద్దంలో నైనా తాను మొదటగా అణ్వాయు ధాలు ప్రయోగించనని భారత్ విధానం చెబుతుంది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై తన ప్రతీకార దాడులతో, భారతదేశం ఈ "రెడ్ లైన్స్" లో కనీసం రెండింటిని ఉల్లంఘించింది. అయితే భారత వైమానిక దళం తాము కిరానా కొండలపై దాడి చేయలేదని ప్రకటించింది. అక్కడ అణ్వాయుధాల నిల్వలు వున్నాయని మాకు తెలియదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. అయితే అణ్వాయుధాలను తటస్థీకరించే తన సామర్థ్యా లను ప్రదర్శిస్తూ, ఆ నూక్లియర్ వార్ హెడ్స్ ను తరలించే యుద్ద విమానాలను, వాహనాలను నిర్మూలించ గలమనే హెచ్చరికను భారత్ ఇచ్చిందని మిలిటరీ వ్యవహారాల విశ్లేషకులు అంటున్నారు. “తన న్యూక్లియర్ కమాండ్ అథారిటీ శిరచ్ఛేదం జరుగుతుందని పాకిస్తాన్ తీవ్ర భయాందోళన చెందుతోందని, నూర్ ఖాన్ పై క్షిపణి దాడిని భారత్ ఆ పని చేయగలదనే హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చని” అమెరికా మాజీ అధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్ కు తెలిపారు. ఇప్పుడు పాకిస్థాన్ వున్న భౌతిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితిలో భారత్ పై పూర్తి స్థాయి యుద్దం చేసి దీర్ఘకాలం కొనసాగించే స్థితిలో లేదని, మరో పక్కన బెలూచిస్తాన్ లో సాయుధ దాడులు పెరుగుతున్న తీరు వల్ల పాకిస్థాన్ నాయకత్వం ఆందోళన తో కాల్పుల విరమణ కోసం ప్రయత్నిం చి ఉండవచ్చు అని చాలామంది భావిస్తున్నారు.” పాకిస్తాన్, భారత్ ల మధ్య జరిగిన డ్రోన్, క్షిపణి దాడులు అలుపెరగనివి, తీవ్రమైనవి, ఘనిష్టమైనవి. ఇరువురూ అదే తీవ్రతతో ప్రతిస్పందించారు. ఈ వైమానిక శక్తి సమర్థత వల్లనే శాంతి దిశగా రాజకీయ, దౌత్యపరమైన చర్చల పర్వం మొదలయ్యింద”ని రిటైర్డ్ మిలిటరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ "అణు సంఘర్షణ", "భీకర అణు యుద్ధం" నివారించామనీ లేకపోతే, "మిలియన్ల మంది చనిపోయి వుండేవారని” పేర్కొనటం గమనించాలి. ఈ అనూహ్యమైన అణు పరిణామాలే ప్రస్తుత యుద్ధ విరమణకు దారి తీసాయని పలువురు భావిస్తున్నారు. అవును ఇది కాల్పుల విరమణ కాదు, కాల్పులలో విరామమే. ఏ సమస్యా తీరలేదు. మే 10న కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కాశ్మీర్ లోని శ్రీనగర్, జమ్మూ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. “ఇప్పుడేం జరిగిందని కాల్పుల విరమణకు అంగీకరించారు?” అని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ ప్రశ్న దేశమంతటా వినిపిస్తోంది.

"అయితే మనం ప్రధానంగా గుర్తించాల్సింది ప్రస్తుతం తీసుకున్న ఈ మిలిటరీ చర్య ఒక దీర్ఘ కాల యుద్దం గా నిర్వహించాలని ప్రారంభించలేదు. దేశ ప్రజల లో తామే పెంచిన భావోద్వేగాలకు ఒక వ్యక్తీకరణగాను , వారి ఆవేశాలను చల్లార్చే ప్రతీకాత్మక ప్రతీకార చర్యగాను, పాక్ పాలకులకు, టెర్రరిస్తులకు ఒక హెచ్చరిక గాను, తమ పరువు ప్రతిష్టలు పెంచుకునే అవకాశం గాను, తద్వారా ఎన్నికల ప్రయోజనాలు నెరవేర్చుకోవటం లక్ష్యంగాను ఆపరేషన్ సింధూర్ రచించబడింది. యుద్దంగా కాక ఒక ఉద్రేక ఉపశమన చర్య కనుకనే అది వెంటనే ముగించబడింది. " (సశేషం)


Tags:    

Similar News