కాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం: జపాన్ ప్రధాని కిషిడా

జపాన్ ను సోమవారం సాయంత్రం శక్తివంతమైన భూకంపం కుదిపేసిన నేపథ్యంలో మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీనిపై ప్రధాని స్పందించారు.

Update: 2024-01-02 06:39 GMT
జపాన్ లో భూకంపంతో పగుళ్లు పడిన రోడ్డు

జపాన్ లో భారీభూకంపం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 13 మంది మరణించినట్లు క్యోడో వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు సహాయ కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భూకంపం పై ప్రధాని పుమియే కిషిదా విచారం వ్యక్తం చేశారు. ‘సమయం మాకు ప్రతికూలంగా ఉంది. కాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, ప్రజలను రక్షించడం మా బాధ్యత’ అని ప్రధాని అన్నారు.

ప్రమాద ప్రాంతాలలో సాయమందించడానికి 1000 మంది సైన్యాన్ని పంపినట్లు ప్రధాని వెల్లడించారు. దెబ్బతిన్న ఇళ్ల వివరాలను సేకరిస్తున్నామని, చాలా పెద్ద ఎత్తున నష్టపోయామని చెప్పారు.

ప్రధాని మాట్లాడుతుండగానే భూకంపం

జపాన్ ప్రధాని మాట్లాడుతుండగానే రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో కొంతసేపు ఆందోళన నెలకొంది.

వాజిమా నగరంలో భూకంపం వలన అగ్ని ప్రమాదాలు చెలరేగాయి. ఆకాశం మొత్తం పొగతో నిండిపోయింది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

వాజిమా నగరంలో అనేక అణుకర్మాగారాలు ఉన్నాయి. 2011 నాటి ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాదం తిరిగి ఎక్కడ సంభవిస్తుందో అని ప్రజలు ఆందోళన చెందారు. ఆనాటి దుర్ఘటనలో మూడు అణు రియాక్టర్ల కూలింగ్ నియంత్రణా వ్యవస్థ పాడైపోయి.. పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల అయింది. తరువాత అణు వ్యర్థాలు పసిఫిక్ సముద్రంలో విడుదల చేయాల్సి వచ్చింది. దీనిపై దక్షిణ కొరియా, చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే స్థానిక అణు కర్మాగారాలు పని చేస్తున్నాయని, ఎలాంటి ఆందోళన అక్కరలేదని అధికారులు హమీ ఇచ్చారు.

మరికొన్ని భూకంపాలు రావచ్చు

జపాన్ ను రాబోయే కొద్ది గంటల్లో మరికొన్ని భూకంపాలు వణికించే ప్రమాదం ఉందని స్థానిక ఏజేన్సీ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లను వదిలి ఆడిటోరియాలు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో కాలం వెళ్లదీస్తున్నారు. బుల్లెట్ రైళ్లు నిలిచిపోయాయి. రహదారులు అన్ని మూసివేశారు. నీటి సరఫరా చేసే పైపులు పగిలి పోయాయి. కొన్నిప్రాంతాల్లో మొబైల్ సేవల సైతం నిలిచిపోయాయి.

భూకంపం ప్రభావంతో ఇశికావా తో పాటు ప్రధాన జపాన్ ప్రధాన భూభాగం హోన్షు పశ్చిమ తీరం, ఉత్తర ద్వీపం హక్కైడోకు సోమవారం దిగువ స్థాయి సునామీ హెచ్చరికలు జారీ చేయగా, మంగళవారం నాడు ఎత్తివేశారు. అయితే కొన్ని తీర ప్రాంతాలలో మూడు అడుగుల స్థాయిలో అలలు ఎగిసిపడుతున్నాయి.

జపాన్ కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో అన్నారు.

జపాన్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లో ఉంది. ఈబేసిన్ లో నాలుగు ప్రధాన భూపలకాలు తరుచుగా కదలుతూ ఉంటాయి. అంతే కాకుండా 450 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అందుకే తరచుగా జపాన్ ను భూకంపాలు సంభవిస్తుంటాయి.   

Tags:    

Similar News