భారత్ - పాక్ సంయమనం పాటించాలంటున్న ప్రపంచ దేశాలు..
సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని, అవసరమైన జోక్యం చేసుకుంటామంటున్న అమెరికా, రష్యా, జపాన్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలు..;
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉగ్రమూకలో దాడిలో 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత..భారత్, పాక్ (India - Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత్ ప్రతీకార దాడికి పూనుకుంది. తొలుత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత రక్షణ దళాలు క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడిలో సుమారు 100 మంది టెర్రరిస్టులు హతమయినట్లు సమాచారం.
గత మూడు రోజుల నుంచి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వేడెక్కుతున్న క్రమంలో.. సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. శాంతియుతంగా చర్చించుకుని సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చైనా సహా అమెరికా(USA), రష్యా(Russia), యూరోపియన్ యూనియన్, జపాన్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలు సలహా ఇస్తున్నాయి.
నిర్మాణాత్మక పాత్రకు సిద్ధమన్న చైనా..
పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహిత దేశమయిన చైనా(China).. ఉద్రిక్తతను తగ్గించి శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొంది.
మునీర్‌కు రూబియో ఫోన్..
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు వెనక్కు తగ్గి, శాంతియుత మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అవసరమయితే ఇద్దరి మధ్య నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కూడా చెప్పారు. భారత్-పాక్ వివాదంలో జోక్యం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు రూబియో వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
శాంతికి పిలుపునిచ్చిన రష్యా..
న్యూఢిల్లీతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్న రష్యా కూడా భారత్ - పాక్ దేశాల మధ్య శాంతికి పిలుపునిచ్చింది. "పహల్గామ్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. పరిస్థితి మరింత దిగజారకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాం, " అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అదే వరుసలో సౌదీ, ఇరాన్, G7 దేశాలు..
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కూడా దౌత్య మార్గం అనుసరించాలని కోరింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చి కూడా రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. బ్రిటన్, జపాన్ కూడా ఇదే విజ్ఞప్తి చేశాయి. G7 చర్చలు కోరుతోంది
గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు కూడా పాకిస్తాన్, భారతదేశానికి ఇదే విజ్ఞప్తి చేశాయి. సైనిక సంఘర్షణ వెంటనే తగ్గించుకోవాలని పిలుపునిచ్చాయి.