చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలను ట్రంప్ తాజాగా రెట్టింపు చేసిన తరువాత చైనా తీవ్రంగా స్పందించింది. ‘‘ అమెరికా యుద్దమే కోరుకుంటే, తాము చివరి వరకూ పోరాటానికి సిద్దంగా ఉన్నాము’’ అని ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత చైనా పై మొదట 10 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దానిని మరో 10 పెంచడంతో చైనా భగ్గుమంది.
ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించింది. అలాగే చైనా నుంచి మత్తుపదార్థాల తయారీకి కారణమవుతున్న ఫెంటానిల్ న విషయంలో కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం కూడా వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం కూడా స్పందించింది.
చైనా వాదన..
చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను పెంచడానికి ఫెంటానిల్ అనేది చిన్న సాకు మాత్రమే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ‘‘ఫెంటానిల్ సమస్య చైనా దిగుమతులపై అమెరికా సంకాలను పెంచడానికి ఒక చిన్న సాకు. మా హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మా ప్రతినిధులు పూర్తిగా చట్టబద్దమైనవి అవసరమైనవి.’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మీ బెదిరింపులు మమ్మల్ని భయపెట్టలేవు..
ఫెంటానిల్ సంక్షోభం పై అమెరికా ఏకపక్షంగా చైనాపై నిందలు మోపుతోందని, సుంకాల పెంపుతో బీజింగ్ ఒత్తిడి పెంచి బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రిత్వశాక ఆరోపించింది.
ఈ బెదిరింపులు తమను భయపెట్టలేవని కూడా హెచ్చరించింది. అమెరికా అంతర్గతంగా జరుగుతున్న ఫెంటానిల్ సంక్షోభానికి ఆ దేశమే బాధ్యత వహించాలని తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
మానవత్వంతో అమెరికన్ ప్రజల పై సద్భావన దృక్ఫథంతో ఈ సమస్యను పరిష్కరించడానికి తాము సాయం చేయడానికి బలమైన చర్యలు తీసుకున్నామంది.
కానీ తమ చర్యలను హర్షించాల్సింది పోయి, చైనాపై నిందలు వేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేసి బీజింగ్ ను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అమెరికా సమస్యను పరిష్కరించలేవని పేర్కొంది.
ఫెంటానిల్ సమస్య ఏంటీ?
ఫెంటానిల్ అనేది అమెరికాలో అక్రమంగా వస్తున్న మాదక ద్రవ్యాలు. అక్రమ వలసదారుల ద్వారా ఇవి దేశంలోకి చేరుతున్నాయని ట్రంప్ వాదన. మొదట ఈ మాదక ద్రవ్యాలు కెనడా, మెక్సికో దేశాలకు అక్కడ నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయి.
అందువల్ల అమెరికన్ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని వైట్ హౌజ్ స్పష్టం చేసింది. విదేశీ సంస్థాగత ముఠాలకు ఈ ప్రమాదకర మాదక ద్రవ్యాలను అందకుండా చేయడంలో చైనా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ అమెరికా ఈ చర్యలు తీసుకుంది.
అంతకుముందు ట్రంప్ తో మెక్సికో, కెనడా దేశాధినేతలు, చైనా ఉన్నత స్థాయి బృందం చర్చలు జరిపారు. ఇందులో అక్రమ వలసలు, ఫెంటానిల్ సమస్యపై ఆయా దేశాలు హమీ ఇచ్చాయని, మాట తప్పడంతో ఈ చర్య తీసుకున్నామని శ్వేత సౌధం అధికారులు వెల్లడించారు.
‘‘అక్రమ వలసదారులు, ఫెంటానిల్ సహ ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అసాధారణ ముప్పు ద్వారా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక నేరాల చట్టం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఫెంటానిల్ వలన మరణాలు..
గత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సరిహద్దుల వద్ద 21,000 పౌండ్లకు పైగా ఫెంటానిల్ పట్టుకున్నట్లు ఇది, 4 బిలియన్లకు పైగా ప్రజలను చంపడానికి సరిపోతుందని శ్వేత సౌధం తెలిపింది.
‘‘అమెరికా అధికారులు దక్షిణ సరిహద్దు మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఫెంటానిల్ కొంత భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలరని అంచనా. ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన ప్రతి సంవత్సరం లక్షల మంది అమెరికన్లు చనిపోతున్నారు.
వీటిలో ఫెంటానిల్ వలనే 75 వేల మంది చనిపోతున్నారు. ఈ మరణాలు వియత్నాం యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల కంటే ఎక్కువ’’ అని శ్వేత సౌధం అధికారులు వెల్లడించారు.