‘‘కెనడా ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంది’’
సొంత ఇంటలిజెన్స్ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిన అట్టావా వర్గాలు;
By : The Federal
Update: 2025-03-25 05:02 GMT
కెనడాలో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో భారత్, చైనాతో పాటు రష్యా, పాకిస్తాన్ లు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడియన్ ఇంటలిజెన్స్ సర్వీస్(సీఎస్ఐఎస్) ను ఉటింకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
కెనడా తన భూభాగంలో భారత వ్యతిరేక వేర్పాటువాద శక్తులను అరికట్టడంలో విఫలం అయిందని గత కొంతకాలంగా ఇండియా తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఖలిస్థాన్ ఉగ్రవాదీ హర్డిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీ - అట్టవా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సందర్భంలో ప్రస్తుతం ఇంటలిజెన్స్ నివేదిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జోక్యం చేసుకుంటుందేమో అని భయం..
కెనడా ఇంటలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వెనెస్సా లాయిడ్ మాట్లాడుతూ.. కెనడియన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ప్రస్తుత ఎన్నికల్లో కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం, సామర్థ్యం రెండు భారత్ కు ఉందని మేము గమనించాము’’ అని డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు. ‘‘విదేశీ జోక్యాలు, ఎన్నికల ఫలితాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడం తరుచుగా చాలా కష్టమైన పని. అయినప్పటికీ బెదిరింపు కార్యకలాపాలు, కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలు, సంస్థల సమగ్రతపై ప్రజల సమ్మాకాన్ని దెబ్బతీస్తాయి’’ అని ఆమె రాయిటర్స్ తో అన్నారు.
అలాగే కెనడాకు వ్యతిరేకంగా భారత్, చైనా మాత్రమే కాకుండా రష్యా, పాకిస్తాన్ లు కూడా ప్రయత్నిస్తున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
పాత చింతకాయ ఆరోపణలు..
కెనడా చేసిన అభియోగాలను ఆసియా అగ్రదేశాలైన భారత్, చైనా రెండు ఖండించాయి. ఇంతకుముందు జరిగిన కెనడా ఎన్నికల్లో కూడా భారత్ జోక్యం చేసుకుందనే అట్టావా ఆరోపణలను న్యూఢిల్లీ తిరస్కరించింది.
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నేరుగా జోక్యం చేసుకుందని , కెనడియన్ కమిషన్ తన నివేదికలో కొన్ని ఆరోపణలు చేయగా, ఎంఈఏ దానిని తోసిపుచ్చింది. అలాగే అంతకుముందు జరిగిన 2019, 2021 ఎన్నికల్లో కూడా చైనా, భారత్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాయని, అయితే విషయం తెలిసినప్పటికీ కెనడా ప్రభుత్వం దీనిపై నిదానంగా చర్యలు తీసుకున్నారని తన నివేదికలో ఆరోపించింది.
కెనడా కమిషన్ నివేదికకు బదులుగా, భారత్ అంతర్గత వ్యవహారాల్లోనే అట్టావా జోక్యం చేసుకుంటోందని ఆరోపణలు చేసింది.
‘‘వాస్తవానికి భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా నిరంతరం జోక్యం చేసుకుంటోంది. ఇది అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. భారత్ పై నివేదికలోని సూచనలు, ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాము. అక్రమ వలసలకు వీలు కల్పించే మద్దతు వ్యవస్థను ఇకపై ఆమోదించబోమని ఆశిస్తున్నాము’’ దఅని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.