రగులుతున్న రావణ కాష్ఠానికి పూర్తయిన ఏడాది
జాతుల సమరమా లేక మతం మత్తు మందులా పని చేసి విచక్షణ కోల్పోయేలా చేసిందో తెలియదు కానీ.. నిప్పుల కొలిమి అంటుకుని సంవత్సరం పూర్తయింది. ఇది ఇప్పటికీ ఆరకుండా..
By : The Federal
Update: 2024-10-07 10:22 GMT
ఈ రోజు ఉదయం హమాస్, ఇజ్రాయెల్ పై దాడి చేసి సంవత్సరం అయిన సందర్భంగా హెజ్ బొల్లా పదుల సంఖ్యలో మళ్లీ రాకెట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా ఉత్తర ఇజ్రాయెల్ లో అతిపెద్ద నగరమైన హైఫా ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించారు. ఈ దాడుల్లో కనీసం పదిమంది గాయపడ్డారు. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.
ఆదివారం ఐడీఎఫ్ లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఇదే రోజు గాజాలోని పాఠశాల, మసీదుపై కూడా బాంబులు జారవిడిచింది. ఇందులో 26 మంది మృతి చెందారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా ఆయుధ-నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
అక్టోబర్ 7 హమాస్ దాడులు
పశ్చిమాసియా అంటేనే ఓ నిప్పుల కుంపటి.. అయితే అక్టోబర్ 7, 2023 కంటే ముందు కొంచెం ప్రశాంతంగా ఉండేది. హమాస్ గత ఏడాది జరిపిన పాశవిక దాడిలో వందలాంది మంది ఇజ్రాయెల్ అమాయక పౌరులు ఘోరంగా చంపబడ్డారు. మరో రెండు వందల మంది బందీలుగా చిక్కారు. ఈ పరిణామంతో ఒడవని సమరం తిరిగి ప్రారంభమైంది.
సరిగ్గా..
హమాస్ ఇజ్రాయెల్‌లోకి వేలాది రాకెట్లను ప్రయోగించి, యూదు దేశంపై అంతకుముందు ఎవరూ చూడని, సాహసోపేతమైన దాడి చేసింది. తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లోని సరిహద్దు ప్రాంతాలపై దాడి చేశారు. ఒక సంగీత ఉత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణాలకు తెగబడ్డారు. దాదాపు 1,200 మందిని హత్య చేశారు, వందలాది మందిని గాయపరిచారు. కనీసం 250 మందిని బందీలుగా తీసుకున్నారు.
తన గడ్డపై జరిగిన ఘోరమైన దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. తీవ్రవాద గ్రూపును నాశనం చేస్తామని ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ సైన్యం కనికరం లేకుండా గాజా స్ట్రిప్‌ను వైమానిక దాడులతో బెంబెలెత్తిచింది. మొత్తం గాజాను నేలమట్టం చేసింది. తరువాత భూతల దాడులతో హమాస్ భరతం పట్టింది.
గాజాలో ఒక సంవత్సరం బాంబు దాడులు, భూ దండయాత్రల తరువాత, సుమారు 42,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. హమాస్‌ను నాశనం చేయడానికి, బందీలను రక్షించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలలో నివాస, వాణిజ్య భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హెబ్ బొల్లా..
ఇజ్రాయెల్ గాజాలో దాడులు చేస్తుండగానే, హెజ్ బొల్లా మరో వైపు యూదుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్లు ప్రయోగించడం మొదలు పెట్టింది. గాజాలో హమాస్ పని ముగిసింది అని భావించిన ఇజ్రాయెల్ ఇప్పుడు దాని కంటే శక్తివంతమైన హెజ్ బొల్లా పని పడతామని ఐడీఎఫ్ ప్రకటించి, భూతల దాడులకు దిగింది. రాకెట్ దాడుల వల్ల దాదాపు 70 వేల మంది యూదు పౌరులు తమ నివాసాలను విడిచిపెట్టి పోయారు. వారందరికి సురక్షిత స్థానం ఇవ్వడమే తమ లక్ష్యం అని ఇజ్రాయెల్ ప్రకటించింది.
గత నెలలో, హెజ్ బొల్లా ఉగ్రవాద సంస్థ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. వారు ఉపయోగిస్తున్న పేజర్లు, వాకీ టాకీలు, పేలడంతో దాని సిబ్బంది కొంతమంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ దాని చీఫ్ హసన్ నస్రల్లాను చంపి హెజ్ బొల్లా నడుం విరగగొట్టింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నస్రల్లా ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించారు. పశ్చిమాసియాలో దీనిని అత్యంత శక్తివంతమైన ఉగ్రవాద సంస్థలో ఒకదానిగా మలిచారు.
ఇరాన్ మాట..
ఇరాన్ తన "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" - హమాస్, హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీల ద్వారా ఇజ్రాయెల్‌పై ప్రాక్సీ యుద్ధంలో పోరాడుతున్నది. హసన్ నస్రల్లా సీనియర్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా గత వారం ఇజ్రాయెల్‌లోకి 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడికి తాము ఎంచుకున్న సమయంలో ప్రదేశంలో ప్రత్యుత్తరం ఇస్తామని ఇజ్రాయెల్ తెలిపింది.
భవిష్యత్తు..
గాజా- లెబనాన్‌లలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ వాటిని పట్టించుకోవడం లేదు. ఇరాన్ దాడి చేసిన విషయానికి కౌంటర్ గా ఇజ్రాయెల్ దాడి చేస్తే పరిస్థితి ఎటువెళ్తుందో అని ప్రపంచం ఆందోళన చెందుతోంది.