బంగ్లాదేశ్‌లో హిందూ నేతలతో ముహమ్మద్ యూనస్ సమావేశం..

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ హిందూ నేతలతో సమావేశం కానున్నారు.

Update: 2024-08-13 08:21 GMT

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ హిందూ నేతలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా దేశం వీడి భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోబుల్ గ్రహీత తాత్కాలిక దేశాధినేతగా ముహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు.

మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతోన్న దాడులు అత్యంత హేయమని ఆయన ఇటీవల పేర్కొన్నారు. హిందూ, క్రైస్తవ, బౌద్ధ కుటుంబాలకు రక్షణ కల్పించాలని యువతను కూడా కోరారు.

రంగ్‌పూర్ నగరంలోని బేగం రోకేయా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి యూనస్ ఇలా మాట్లాడుతూ ..“వారు ఈ దేశ ప్రజలు కాదా? దేశాన్ని రక్షించగలిగిన మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా? వారు నా సోదరులు. మనం కలిసి పోరాడాం. కలిసి ఉందాం..” అని పేర్కొన్నారు.

హిందూ సంస్థలయిన బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్‌, బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ ప్రకారం.. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి మైనారిటీ కమ్యూనిటీల సభ్యులపై బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో కనీసం 205 దాడులు జరిగాయి. ప్రాణభయంతో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు దేశం వీడి పొరుగున ఉన్న భారతదేశానికి చేరుకుంటున్నారు. తమను రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌లోని పలు హిందూ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

Tags:    

Similar News