కళ తప్పిన బెత్లెహెం..
పాలస్తీనాలోని బెత్లెహెంలో ఈ సారి క్రిస్మస్ కళ తప్పింది. యుద్ధం నేపథ్యంలో అక్కడి పర్యాటక రంగానికి భారీ నష్టం వాటిల్లింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో.. జీసస్ జన్మస్థలం జెరుషలేం(Jerusalem)లో ఈ సారి క్రిస్మస్ వేడుకలను దూరంగా ఉండాలని అక్కడి అధికారులు సూచించారు. దీంతో మాంగర్ స్క్వేర్ పండుగ వాతావరణం, క్రిస్మస్ చెట్లు లేకుండా కళావిహీనంగా కనిపిస్తోంది.
సాధారణంగా వేలాది మంది సందర్శకులు కిస్మస్ వేడుకలను (Christmas Celebrations) తిలకించేందుకు ఇక్కడికి వస్తారు. కాని ఈ సారి వాటిని రద్దు చేయడం పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. గాజాలో పాలస్తీనియన్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని..ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని మేయర్ హనా హనియే పేర్కొన్నారు.
యుద్ధం కారణంగా 18,700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా.. 50వేల మందికి పైగా గాయపడ్డారు, అక్కడి ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. 2.3 మిలియన్ల మందిలో 85 శాతం మంది వలస వెళ్లారు.
మిలిటెంట్లు దాదాపు 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో ఎక్కువ మంది పౌరులు. 240 మంది బందీలయ్యారు.
పర్యాటక రంగానికి భారీనష్టం..
యుద్ధం కారణంగా సందర్శకుల సంఖ్య పడిపోయింది. పాలస్తీనా (Palestine) పర్యాటక రంగం రోజుకు 2.5 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తోందని, ఈ ఏడాది చివరి నాటికి 200 మిలియన్ డాలర్లు నష్టపోతున్నట్లు పాలస్తీనా పర్యాటక మంత్రి తెలిపారు.
బెత్లెహెమ్‌లో క్రిస్మస్ వేడుకలను అర్మేనియన్, కాథలిక్ ఆర్థోడాక్స్‌లు కలిసి ఘనంగా జరుపుకుంటారు. వార్షిక ఆదాయంలో 70 శాతం వాటా పర్యాటక రంగం నుంచే సమకూరుతుంది. కానీ ఈ సీజన్‌లో వీధులు ఖాళీగా ఉన్నాయి.
ప్రధాన విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతో బెత్లెహెమ్‌లోని 70 హోటళ్లు మూసివేయాల్సి వచ్చింది. పర్యాటక రంగంలోని దాదాపు 6వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు.
‘‘నేను టీ, కాఫీ తాగుతూ రోజులు గడుపుతున్నాను, ఎప్పుడూ రాని కస్టమర్ల కోసం వేచి చూస్తున్నా.. ఈ రోజు టూరిజం లేదు,’’ అని బెత్లెహెమ్ షాప్ యజమాని అహ్మద్ దన్నా అన్నారు.
క్రిస్మస్ ఉత్సవాలు రద్దయినా, సంప్రదాయం ప్రకారం చర్చిల్లో మతపరమైన వేడుకలు జరుగుతాయని హనియే చెప్పారు.
‘‘పాలస్తీనాలో బెత్లెహెం ఒక ముఖ్యమైన భాగం,’’ అని మేయర్ చెప్పారు. ‘‘కాబట్టి ఈ సంవత్సరం అర్ధరాత్రి మేము శాంతి కోసం ప్రార్థిస్తాం. గాజాలో మరణించిన వారికి సంతాపంగా సైలెంట్ మార్చ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇజ్రాయెల్‌లో 1,82,000 మంది క్రైస్తవులు, వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలో 50,000 మంది, గాజాలో 1,300 మంది క్రైస్తవులు ఉన్నారు. అత్యధికులు పాలస్తీనియన్లు.
జెరూసలేంలో దుకాణాలు చాలా వరకు మూసి ఉన్నాయి. తెరవడానికి యజమానులు భయపడుతున్నారు. ఒక వేళ తెరిచి ఉంచినా పెద్దగా వ్యాపారం లేదని వాపోతున్నారు.
వేడుకలను రద్దు చేస్తున్నట్లు జెరూసలేంలోని ప్రధాన చర్చిల అధిపతులు నవంబర్‌లో ప్రకటించారు. పండుగ కార్యక్రమాలను మినహాయించి బాధల్లో ఉన్న వారికి అండగా నిలవాలని సూచించారు.
‘‘ప్రపంచం సంబరాలు చేసుకుంటుంటే.. మన పిల్లలు శిథిలాల కింద ఉన్నారు. మా గృహాలు నాశనం అయ్యాయి. కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి’’ అని చర్చి పాస్టర్ ముంథర్ ఐజాక్ ఆవేదనతో అన్నారు.