ప్రభుత్వం కాదు.. ఇక నుంచి పార్టీ ఆదేశాలే..

చైనా లో ఇక నుంచి పార్టీ ఆదేశాలు మాత్రమే సుపీరియర్.. ప్రభుత్వం ఆదేశాల కంటే కూడా పార్టీ నిర్ణయాన్ని అందరూ ఆచరించాలని నిబంధనలను మార్చింది.

Update: 2024-03-13 11:39 GMT
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

ఏ దేశంలో నైన పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కొంత మౌలికమైన తేడా కనిపిస్తుంది. ప్రభుత్వమే దేశంలోని అన్ని వ్యవస్థలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఒక వేళ పార్టీ, ప్రభుత్వం మధ్య ఆధిక్యత విషయంలో తేడాలు వస్తే ప్రభుత్వమే సుపీరియర్..

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే.. కానీ ప్రపంచం మొత్తం ఆచరిస్తున్నదాన్ని తాము అనుసరిస్తే కిక్ ఏముందని అనుకున్నారో ఏమో కానీ చైనా నియంత, షీ జిన్ పింగ్ తాజాగా రాజ్యాంగాన్ని సవరించారు. ఇక నుంచి మంత్రి మండలి తీసుకునే నిర్ణయాల కన్నా.. కమ్యూనిస్టు పార్టీకే ఎక్కువ అధికారాలు ఉండబోతున్నాయి. దీనిని చైనా అధికారికంగా ప్రకటించింది.

బీజింగ్‌లో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ముగింపు సందర్భంగా సవరించిన స్టేట్ కౌన్సిల్ చట్టాన్ని 2,883 మంది ప్రతినిధులు ఆమోదించారు. ఎనిమిది మంది చట్టసభ సభ్యులు వ్యతిరేకించగా, తొమ్మిది మంది గైర్హాజరయ్యారు.
చైనాకు సంబంధించిన 21 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, స్థానిక ప్రభుత్వాలను నామమాత్రంగా పర్యవేక్షిస్తున్న చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ నేతృత్వంలోని స్టేట్ కౌన్సిల్ కార్యనిర్వాహక అధికారాన్ని శాశ్వతంగా తొలగించడానికి చైనా అధ్యక్షుడు తీసుకున్న తాజా నిర్ణయం ఇది.
లీ కియాంగ్ మీడియా సమావేశం రద్దు
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ముగింపులో లీ కియాంగ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కూడా తరువాత రద్దు చేయబడింది. దీనిపై ఎలాంటి సమాచారం లేదు. 1982 తర్వాత తొలిసారిగా స్టేట్ కౌన్సిల్ చట్టానికి సవరణ చేయడం వల్ల రాష్ట్రం నుంచి మరిన్ని అధికారాలను కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి తీసుకుంది. దీనివల్ల, పార్టీ ఆదేశాలను ప్రభుత్వం విశ్వసనీయంగా అమలు చేయాల్సిందే అని న్యాయ నిపుణులు మీడియాకు తెలిపారు. ఇక నుంచి స్టేట్ కౌన్సిల్ తప్పనిసరిగా "పార్టీ సెంట్రల్ కమిటీ అధికారాన్ని, దాని కేంద్రీకృత ఏకీకృత నాయకత్వాన్ని దృఢంగా అనుసరించాలి" దౌత్యం నుంచి సంస్కృతి వరకు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆలోచన వైఖరిని అవలంభించాలి.
పార్టీయే సర్వోన్నతమైనది
"చైనాలో ఎగ్జిక్యూటివ్ అథారిటీ పునర్వ్యవస్థీకరణలో ఇది గణనీయమైన మార్పు" అని హాంకాంగ్ చైనీస్ విశ్వవిద్యాలయంలో న్యాయ ప్రొఫెసర్ ర్యాన్ మిచెల్ అన్నారు. "మొత్తం అధికార క్రమంలో పార్టీ అధినేత అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంది. అయితే పాలసీల రూపకల్పన, పాలసీలను అమలు చేయడంలో మాత్రం ఇక నుంచి పారదర్శకత లోపిస్తుంది" అని అభిప్రాయపడ్డారు.
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ లి హాంగ్‌జోంగ్ గత వారం పార్లమెంటులో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికే ఇది మారుస్తున్నట్లు వివరించారు. అయితే ఇవన్నీ కూడా 2018లో పార్టీ అధినాయకత్వం చేసిన సూచనల ప్రకారం జరిగిందని అన్నారు.
"పార్టీ రాష్ట్ర శాఖలపై తన స్పష్టమైన నియంత్రణను, పట్టును పెంచుకోవడానికే, అన్నింటికి బాధ్యత వహించేలా చేయడానికి చైనా ఈ నిర్ణయం తీసుకుంది" అని వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో ఆసియా న్యాయ ప్రొఫెసర్ థామస్ కెల్లాగ్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులకు ఒకే నాయకత్వం నుంచి ఆదేశాలు వస్తాయని చెబుతున్నారు.
2012లో అధికారం చేపట్టినప్పటి నుండి, షీ జిన్ పింగ్ తనకు నేరుగా నివేదించే బహుళ మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తూ అనేక కొత్త కేంద్ర పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. కొత్త పని నియమాలు ఆమోదించబడినందున, స్టేట్ కౌన్సిల్ కూడా ఇకపై వారం వారం రెగ్యూలర్ గా నిర్వహించే సమావేశాలను జరపదు. బదులుగా నెలకు ఒకటి లేదా రెండుసార్లు సమావేశమవుతుంది. ఈ మార్పులు రాష్ట్రాల నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వంపైన, ప్రభుత్వంపైన షీ జిన్ పింగ్ కు సంపూర్ణ నియంత్రణ సాధించినట్లు చెప్పవచ్చు.
Tags:    

Similar News