ఎట్టకేలకు నిజం అంగీకరించిన పాకిస్తాన్
ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందని అంగీకరించిన పాక్ ప్రధాని షరీఫ్;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-17 05:04 GMT
పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిందని ఆ దేశం అంగీకరించింది. కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై భారత్ మిస్సైల్ దాడి చేసిందని ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మే 9, 10 తేదీల మధ్య అర్ధరాత్రి తరువాత 2.30 నిమిషాలకు పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై మిస్సైల్ స్ట్రైక్ జరిగిందని తనకు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని పాక్ ప్రధాని చెప్పారు.
ఈ విషయంలో తనను అలర్ట్ చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ చరిత్రలో ఇలా భారత్ దాడులు చేశారని చెప్పుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరిగింది. కొన్ని రోజుల క్రితమే పాక్ నేషనల్ అసెంబ్లీ(పాక్ పార్లమెంట్) లో మాట్లాడిన షహబాజ్ షరీఫ్ భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. ఇంతలోనే మాట మార్చి ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందనే విషయాన్ని బయటపెట్టారు.
ఈ దాడుల్లో ఎంతమేర ప్రాణనష్టం జరిగింది, వైమానిక దళాలకు జరిగిన నష్టం వివరాలను పాకిస్తాన్ నాయకత్వం ఇప్పటిదాక బయటపెట్టలేదు.
నివాళులర్పించిన ప్రధాని..
దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ‘యోమ్ ఈ టాష్కూర్‘( ధన్యవాదాల దినోత్సవం) సంబరాలు జరపుకుంటున్న తరుణంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ లు మూడు యుద్దాలు చేసుకున్నాయని, కానీ ఏమి సాధించలేకపోయాయని చెప్పారు.
‘‘ మా ఇరుగుపొరుగు వారి దేశాలతో శాంతియుతంగా కూర్చుని ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ వంటి సమస్యలపై చర్చించుకుంటే ప్రపంచంలోని ఈ భాగం శాంతియుతంగా ఉండేది’’ అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
భారత్ తో యుద్ధం విషయంలో కాల్పుల విరమణకు తోడ్పడిన తమ మిత్రదేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరించాని కృతజ్ఞతలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్..
పహల్గాంలో ఉన్న పర్యాటకులపై వారి మతం అడిగి హిందువులని గుర్తించి పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చాడంతో దేశ వ్యాప్తంగా తీవ్రంగా అలజడి రేగింది. ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తీవ్రవాద మూలాలపై దాడులు చేస్తామని ప్రతినబూనారు.
దాదాపు రెండు వారాల తరువాత మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో 9 ప్రదేశాలలోని 24 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేసి వందలాది ఉగ్రవాదులను అంతం చేసింది.
దీనికి పాకిస్తాన్ ప్రతిగా భారత్ లోని వైమానిక స్థావరాలు, ఆర్మీ కంటోన్మెంట్ లు, పౌర ఆవాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీనికి భారత్ కూడా ఎదురుదాడికి దిగి పాక్ లోని అన్ని వైమానిక స్థావరాలు, రాడార్లు, ఆర్మీ కంటోన్మెంట్ లపై దాడులు చేసి ధ్వంసం చేసింది. ఇందులో పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులతో పాటు, తుర్కియో సైనికులు కూడా మృతి చెందారని సమాచారం.