రాత్రంతా చీకట్లోనే..సరిహద్దు జిల్లాల ప్రజల్లో ఆందోళన

పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసే అవకాశం ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు.;

Update: 2025-05-09 08:38 GMT
Click the Play button to listen to article

భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో.. పంజాబ్(Punjab), కశ్మీర్‌ సరిహద్దు జిల్లాలయిన అమృత్సర్, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్‌లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. జలంధర్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో అలాగే పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లోనూ విద్యుత్తును నిలిపివేశారు. జమ్మూ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్ డ్రోన్‌(Pak strikes)లతో దాడులు చేస్తోందని వార్తలు రావడంతో కశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరా ఆపేశారు.

డ్రోన్లను తిప్పికొట్టిన భారత్..

దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల పరిధిలోని 15 నగరాల్లోని భారత సైనిక స్థావరాలతో పాటు జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

పంజాబ్‌లోని అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, అడంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ప్రయత్నించింది. సైనిక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పఠాన్‌కోట్ డిప్యూటీ కమిషనర్ ఆదిత్య అప్రమత్తమయ్యారు. ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండి విద్యుత్ దీపాలను ఆర్పేయాలని కోరారు. ముందు జాగ్రత్త చర్యగా రూప్‌నగర్, ఫాజిల్కా, కపుర్తలా, లూథియానా, సంగ్రూర్, బటిండా, పాటియాలా, హర్యానాలోని పంచకులాలలో కూడా బ్లాక్‌అవుట్ అమలులో ఉంచారు.

విద్యా సంస్థల మూసివేత..

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో గురువారం సాయంత్రం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ను కూడా రద్దు చేశారు. ఆటగాళ్లు, ప్రేక్షకులను సురక్షితంగా తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలను మూడు రోజులు పాటు మూసివేయాలని ఆదేశించింది. చండీగఢ్‌లో కూడా అధికారులు శనివారం వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

‘భారత సైన్యంపై నమ్మకం ఉంది.’

పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో బ్లాక్ అవుట్ పాటించిన ప్రాంతాల్లో సైరన్‌లు మోగాయి. ఈ పరిణామాలపై తమకు ఆందోళన ఉన్నా.. భారత సాయుధ దళాలు పాక్ ప్రయత్నాలను తిప్పికొడతాయన్న నమ్మకం ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. అమృత్సర్, ఫిరోజ్‌పూర్ వంటి కీలక సరిహద్దు జిల్లాలలో శుక్రవారం ఉదయం ప్రశాంత వాతావరణం కనిపించింది.

డైరెక్టర్ జనర్సల్‌తో అమిత్ షా భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా CRPF, BSF, SSB డైరెక్టర్ జనరల్‌లతో మాట్లాడారు. పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలను సమీక్షించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల 9 స్థావరాలపై భారత సైనిక దళాలు క్షిపణులతో దాడులు నిర్వహించారు. దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం.

Tags:    

Similar News