దయచేసి ఎదురు దాడి చేయవద్దు: ఇజ్రాయెల్ కు రిక్వెస్టులు, హెచ్చరికలు

ఇరాన్ తనపై ప్రతీకార దాడులు చేసిన తరువాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తామని ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయంలో టెల్ అవీవ్ ను ఒప్పించడానికి..

Update: 2024-04-16 10:33 GMT

ఇరాన్ దాడిపై తాము ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఎప్పుడు ఎలా దాడి చేస్తారో మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా టెల్ అవీవ్ ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ కూడా ఈ ప్రకటన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. " మాపై దాడి చేస్తే ఇంతముందు ఎన్నడూ’ చూడని విధ్వంసం చూస్తారని, ఇందుకోసం ఇదివరకెన్నడూ చూడని ఆయుధాలను ఉపయోగిస్తాం"అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన సెకన్ల వ్యవధిలో మా ప్రతిస్పందన ఉంటుందంది.

సిరియా రాజధాని డమాస్కస్‌లో గల ఇరాన్ కాన్సులర్ భవనంపై రెండు వారాల ముందు ఓ వైమానిక దాడి జరిగింది. ఈ దాడుల్లో ఇద్దరు ఇరానియన్ జనరల్స్ చనిపోయారు. చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్- ఇరాన్ కు శత్రుత్వం ఉన్నప్పటికీ టెహ్రన్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ పై ప్రత్యక్షంగా డాడి చేయలేదు. కానీ తొలిసారిగా అంటే 1979 ఇరాన్ విప్లవం తరువాత తొలిసారిగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది.
99% డ్రోన్లు, క్షిపణులు మధ్యలోనే..
ఈ దాడిలో ఇరాన్ వందల కొద్దీ డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అయితే 99 శాతం డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, సౌదీ, జోర్డాన్ మధ్యలోనే అడ్డగించి నేలకూల్చాయి. కేవలం కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ ను తాకాయి. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేసే అవకాశం ఉంది.
ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. సోమవారం.. మా తదుపరి చర్యలను పరిశీలిస్తున్నాం, అయితే ఇరాన్ కు " తగిన ప్రతిస్పందన ఉంటుంది" అని హెచ్చరికలు జారీ చేశారు. అయితే హలేవి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. "మేము ఎంచుకున్న సమయంలో" ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తుందని ఆర్మీ ప్రతినిధి, రియర్ అడ్మ్. డేనియల్ హగారి చెప్పారు. వీరు దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెవాటిమ్ వైమానిక స్థావరం వద్ద విలేకరులతో మాట్లాడారు, ఇరాన్ దాడిలో స్వల్ప నష్టం జరిగిందని హగారీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తన వార్ కేబినేట్ లో సహచరులతో మాట్లాడారు. వీరిలో ఎక్కువమంది దాడి చేయడానికే మొగ్గు చూపినట్లు తేలింది.అయితే అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. యుఎస్ హౌస్ మెజారిటీ లీడర్ స్టీవ్ స్కాలిస్‌తో నెత్యన్యాహూ కు జరిగిన సంభాషణలో మాత్రం, "ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైనదంతా చేస్తుంది" అని చెప్పినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
ప్రతీకారం తీర్చుకోవద్దని ఇజ్రాయెల్‌పై..
ఇరాన్ దాడుల్లో అతి స్వల్ప నష్టం సంభవించిందని, కావునా ప్రతీకార దాడులు వద్దని ఇజ్రాయెల్ ను ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. సంయమనం పాటించాలని కూడా అమెరికా ఇజ్రాయెల్ ను కోరింది. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ, ఏదైనా ప్రతిస్పందన ఇజ్రాయెల్‌పై ఆధారపడి ఉంది, "మేము పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా చేయాలనుకోవడం లేదు. అయితే ఈ ప్రాంతంలో మా దళాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము. ” అని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ - మితవాద అరబ్ దేశాల మధ్య సంబంధాలు
ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ - మితవాద అరబ్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి యుఎస్ బాగా కృషి చేస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే US సెంట్రల్ కమాండ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా ఇతర అరబ్ దేశాలతో సహా ప్రాంతం అంతటా ఉన్న మిలిటరీలతో సన్నిహితంగా పనిచేస్తోంది.
ఇరాన్‌ ఆయుధాలు కూడా సౌదీ ఆకాశం గుండా వెళ్లాయని ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసిన ఓ మ్యాప్‌లో పేర్కొంది. చాలా వాటిని ఇజ్రాయెల్ గగనతలంలోకి రాకముందే తమ మిత్ర దేశాలు కూల్చివేశాయని టెల్ అవీవ్ ఇంతకుముందే ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, జోర్డాన్ లను ఇజ్రాయెల్ తమ మిత్ర దేశంగా ప్రకటించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఎవరి మాట వినకుండా దాడులు చేస్తే తెరవెనక చేస్తున్న అన్ని శాంతి ప్రయత్నాలు ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి దేశాలతో ఏర్పడబోయే ప్రయత్నాలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఘర్షణ వాతావరణం..
ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి 12 వందల మందిని చంపివేసి, 250 మందిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టడం ప్రారంభించింది. ఈ యుద్దాల్లో వేలాది మంది ప్రజలు సైతం మరణిస్తున్నారు. రషాపై దాడులకు కూడా ఐడీఎఫ్ సిద్ధం అవుతుండడంతో ఉత్తర వైపు సరిహద్దు నుంచి దాడులు చేయడానికి హెజ్ బుల్లా ను సైతం ఇరాన్ సిద్దం చేసింది. దాంతో ఇజ్రాయెల్ సిరియా, లెబనాన్ లపై దాడులకు దిగింది. దీంతో ఘర్షణలు విస్తృతం అవుతాయని ప్రపంచం భయపడుతోంది.
శాంతంవహించండి: బ్రిటన్
పెరుగుతున్న హింసాకాండను నివారించడానికి "అన్ని పక్షాలు సంయమనం పాటించాలి" అని బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అన్నారు.ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ " ఉద్రిక్తతలు పెంచకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం " US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, US ఘర్షణ కోరుకోవడం లేదు. ఇరాన్ తో దౌత్య ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నామని అన్నారు.
అణుశక్తి సంస్థల ఆందోళన
ఇరాన్‌లోని అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. "భద్రతా పరిశీలనల" కారణంగా ఇరాన్ తన అణు కేంద్రాలను ఆదివారం మూసివేసిందని, అయితే వారు సోమవారం వాటిని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. ఐఎఇఎ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం (ఏప్రిల్ 16) సౌకర్యాలపై తమ తనిఖీలను కొనసాగిస్తారని ఆయన చెప్పారు.ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారని సంయమనం పాటించాలని గ్రోస్సీ అన్నారు. IAEA క్రమం తప్పకుండా ఇరాన్ అణు కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తుంది. పాశ్చాత్య దేశాలు ఆ దేశం అణు బాంబులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా ఉందని చెబుతోంది.
Tags:    

Similar News