పాలస్తీనాలో పుచ్చకాయలతో నిరసన..
నిరసన తెలపడానికి అనేక మార్గాలున్నాయి. అందుకు పుచ్చకాయలు కూడా పనికొస్తాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఎలాగో తెలుసుకోవాలంటే..
సోషల్ మీడియాలో పుచ్చకాయల పోస్టింగ్‌లు తెగ ట్రేండ్ అవుతున్నాయి. పుచ్చకాయంటే కేవలం తినేందుకు మాత్రమే ఉపయోగిస్తారనుకుంటే పొరపాటే. దాంతో నిరసన కూడా తెలుపవచ్చంటున్నారు పాలస్తీనియన్లు. ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లు తమ నిరసనను తెలిపేందుకు పుచ్చకాయల ఫొటోలను ప్రదర్శిస్తున్నారు.
పుచ్చకాయే ఎందుకు?
1. పుచ్చకాయను ముక్కలు చేసినప్పుడు పాలస్తీనా జెండా రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, తెలుపు కనిపిస్తాయి.
2. పాలస్తీనా జెండాను మోసుకెళ్లడం, ప్రదర్శించడాన్ని ఇజ్రాయెల్ అధికారులు నిషేధించారు. దానికి ప్రతీకగా పుచ్చకాయను ఉపయోగిస్తారు.
3.పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ నుంచి గాజా వరకు పుచ్చకాయలను విస్తృతంగా పండిస్తారు.పాలస్తీనా వంటకాలలో దీన్ని విరివిగా వాడతారు.
నిషేదంతో ప్రత్యామ్నాయం..
1.ఇజ్రాయెల్ దళాలు గాజాలో రక్తపాతాన్ని సృష్టించాయి.
దీంతో పాలస్తీనా మొత్తం అట్టుడికిపోయింది.
2.జనవరిలో జైలు నుంచి విడుదలైన బయటకు వచ్చిన ఒక వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించాడు. అప్పటి నుంచి పాలస్తీనా జెండాలను ఎక్కడా ఎగురవేయకుండా, వాటిని ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ జివిర్ పోలీసులను ఆదేశించారు.
3. ఇజ్రాయెల్‌లో పాలస్తీనా జెండాను ఎగురవేయడం చట్టబద్ధంగా నిషేధం కాదు. అయితే జెండా ఘర్షణ, అంశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
4. అరెస్టులు కొనసాగుతుండగా..జూన్‌లో జాజిమ్ అనే సంస్థ టెల్ అవీవ్‌లో ట్యాక్సీలపై ముక్కలు చేసిన పుచ్చకాయ ఫోటోలను అతికించడం ప్రారంభించింది. ఆ పిక్చర్ కింద ‘ఇది పాలస్తీనా జెండా కాదు’’ అని రాసి ఉంది.
5. 2007లో సబ్జెక్టివ్ అట్లాస్ ఆఫ్ పాలస్తీనా అనే పుస్తకానికి పాలస్తీనియన్ కళాకారుడు ఖలీద్ హౌరానీ చిత్రించిన పుచ్చకాయ బొమ్మను ముఖచిత్రంగా ప్రచురించారు.
పుచ్చకాయ వెనక ఉన్న చరిత్రేంటి..
1. 1967లో అరబ్ - ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. తర్వాత పాలస్తీనా జెండా చేతబట్టడం, అందులోని రంగులను ప్రదర్శించడాన్ని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిషేధించింది. గాజా స్ట్రిప్‌లో పుచ్చకాయ ముక్కలను ప్రదర్శించిన యువకులను కూడా అరెస్టు చేసిన ఘటనలున్నాయి. దీంతో నిరసన వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయంగా పుచ్చకాయలను వాడుతున్నారు.