‘ట్రంప్ సుంకాలు పెంచడానికి కారణం అదే..’
అధిక సుంకాల వల్ల అమెరికాతో భారత్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అర్థమవుతుంది' మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్;
భారత్(India)పై అమెరికా(America) 50 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకున్న నిర్ణయం.. ప్రధాని మోదీ ప్రభుత్వానికి "మేల్కొలుపు" లాంటిందని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) పేర్కొన్నారు. అధిక సుంకాల విధింపు రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"ఇది మనకు మేల్కొలుపు. మనం ఏ ఒక్క దేశంపైనా పెద్దగా ఆధారపడకూడదు. యూఎస్‌తో వాణిజ్యం కొనసాగిస్తూనే.. యూరప్, ఆఫ్రికా దేశాల వైపు దృష్టి సారించాలి. నేడు వాణిజ్యం, పెట్టబడులు, ఆర్థిక అవసరాలు యుద్ధానికి ఆయుధాలుగా మారుతున్నాయి. వీటిపట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. యువతకు ఉపాధి కల్పించే సంస్కరణలను తీసుకురావాలి’’ అని సూచించారు.
‘వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థికం ఆయుధంగా మారాయి’
వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థికం ఆయుధంగా మారాయని చెబుతూ.. ఆసియాలోని ఇతర దేశాలు తక్కువ రేటుతో వ్యవహరిస్తున్నా.. బేస్ టారిఫ్‌ను 25 శాతంగా నిర్ణయించడం వల్ల భారత్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు.
భారతదేశంపై కఠినమైన సుంకాల విధానాన్ని విధించాలని ట్రంప్ ఎందుకు నిర్ణయించుకున్నారో వివరిస్తూ రాజన్ ఇలా అన్నారు.. ‘‘కరెంటు ఖాతా లోటు, ద్రవ్య లోటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాను ఇతర దేశాలు వాడుకుంటున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. కానీ, చౌక ధరకు వస్తువులను దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా వినియోగదారులే ప్రయోజనం పొందుతున్నారన్న విషయాన్ని ఆయన మరిచినట్లున్నారు. ఈ సుంకాలను ఆయన ఇతర దేశాలపై పన్నులుగా పరిగణిస్తున్నారు. ఫలితంగా తన దేశానికి ఆదాయం వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు. అయితే దీని వల్ల సొంత ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదు.’’ అని రాజన్ పేర్కొన్నారు.
రాజన్ 2013 - 2016 మధ్యకాలంలో ప్రధాని మోదీ, అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.