US UPDATES: అమెరికా శ్వేత సౌధం ట్రంప్ దే!
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నిక ఖాయమైంది. గెలుపునకు అవసరమైన 270 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో 267 సాధించారు. ఇండియా అల్లుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడవుతారు
By : The Federal
Update: 2024-11-06 08:32 GMT
అమెరికా 47వ అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన ఎలక్ట్రోరల్ ఓట్లు 270కి చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన 267 ఓట్లు సాధించారు. మరికొన్ని రాష్ట్రాలలో లీడింగ్ లో ఉన్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా 53 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఎలక్ట్రోరల్ ఓట్ల వేటలో వెనుకబడ్డారు. ఇప్పటికి ఆమెకి 188 మాత్రమే వచ్చాయి.
డోనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తన భార్య మెలినీయాకు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల (US Election Results) ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.
ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించినట్లైంది. రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపాయి.
ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. గతంతో పోలిస్తే ఒకటి ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాలు సాధించారు. దీంతో ఈసారి ట్రంప్ విజయం సాధిస్తే.. ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (US Elections) వెలువడుతున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMP) మెజారిటీకి చేరువయ్యారు. ఇంకో మూడు ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే. చాలా రాష్ట్రాలలో ఆయన పాపులర్ ఓటుతో పాటు ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లను సంపాయించారు. ప్రస్తుతం ఆయనకు ఎలక్ట్రోరల్ కాలేజీలో కావాల్సిన 270 ఓట్లలో 267 గెలిచారు. ఆయన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 188 ఓట్లను గెలిచారు. ఓట్లలో పెద్దగా తేడా లేకపోయినా ఎలక్ట్రోరల్ కాలేజీ (అధ్యక్షుణ్ణి ఎన్నుకునే వారు)లో సీట్లు ట్రంప్ కే ఎక్కువగా ఉన్నాయి. నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా.. 17 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 178 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.
ఇక, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (KAMALA HARRIS) ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి.
అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ వెనకబడిపోయారు. తీవ్రపోటీ నెలకొన్న పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ విస్తృత ప్రచారం చేశారు. తాజాగా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో (US Election Results) ఎక్స్ వేదికగా స్పందించారు. టెన్నిస్ గేమ్ లో వాడే ‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అనే పదాలను వాడారు. ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానన్నారు.
సెనేట్ లోని 100 సీట్లలో మెజారిటీ రావాలంటే 50 దాటాలి. ఇప్పటి సమచారం ప్రకారం రిపబ్లికన్లకు 51, డెమోక్రాట్లకు 38 వచ్చాయి. పార్లమెంటులోనూ రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. మెజారిటీ రావాలంటే 218 సీట్లు రావాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం రిపబ్లికన్లకు 103, డెమోక్రాట్లకు 63 వచ్చాయి. వ్యామింగ్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, టెక్సాస్ లో ట్రంప్ గెలిచారు. డెమోక్రాట్లకు పట్టున్న ఇల్లినాయిస్, రోడ్ ఐలాండ్ లో కమలా హారిస్ గెలిచారు.
Earlier Up-dates
అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఎన్నికలు ఈ తెల్లవారుజామున ముగియనున్నాయి. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి అన్ని ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వనున్నాయి. అప్పటి నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అమెరికన్ ఇటీవలి చరిత్రలో ఇంత పోటాపోటీగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా దేశ భవిష్యత్, ప్రపంచ రాజకీయాలను నిర్దేశించేవిగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు.
ఎన్నికల అప్ డేట్స్..
1. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), తన భార్య మిలానియాతో వచ్చి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈసారి ఎన్నికల్లో గత మూడు సార్లు కంటే గొప్ప ప్రచారం జరిగిందన్నారు.
డెమోక్రటిక్ నేత కమలా హారిస్ (Kamala Harris) మాత్రం ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మెయిల్ ద్వారా ఆమె ఓటేశారు.
2. చారిత్రాత్మకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మాజీ అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు బారక్ ఒబామా ఓటర్లకు పిలుపిచ్చారు. ప్రతి ఒక్క ఓటూ ఈసారి విలువైందేనన్నారు.
3.ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం కీలకంగా మారింది. ట్రంప్, హారిస్ హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. కమలా హారిస్ నేరుగా ఇంటింటి ప్రచారాన్ని కూడా చేశారు.
4. కమలాహారిస్ వాషింగ్టన్ డీసీలోని హార్వార్డ్ యూనివర్శిటీలో మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
5. జార్జియా రాష్ట్రంలోని రెండు పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు రావడంతో కాసేపు పోలింగ్ కి అంతరాయం కలిగింది. రష్యా నుంచి ఈ వదంతులు వ్యాపించినట్టు జార్జియా రాష్ట్ర గవర్నర్ చెప్పారు. ఆ రెండు కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.
6. న్యూ హాంప్‌షైర్ కమ్యూనిటీలోని చిన్న ఊరు డిక్స్‌విల్లే నాచ్ నుంచి పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు కూడా ముగిసింది. కమలాహారిస్, ట్రంప్ కి చేరో మూడు ఓట్లు వచ్చాయి. ఈ ఊళ్లో ఉన్న మొత్తం ఓట్లు ఆరే. అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం ఎప్పుడైనా ఇక్కడి నుంచే వెలువడుతుంది. గత ఎన్నికల్లో బైడెన్ కు నాలుగు ఓట్లు రాగా ఈసారి కమలా హారిస్ మూడు మాత్రమే వచ్చాయి.
7.కంప్యూటర్లు మొరాయించడంతో కాంబ్రియా, పెన్సిల్వేనియాలో ఓటింగ్ వేళలను రాత్రి 10 గంటల (అమెరికన్ టైం) వరకు పొడిగించేందుకు పెన్సిల్వేనియా కోర్టు అనుమతి ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా బ్యాలెట్ స్కానింగ్‌కు అంతరాయం కలిగించింది.
8.జార్జియాలోని గ్విన్నెట్ కౌంటీలో 2020నాటి ఎన్నికలకు మించి ఈసారి పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెప్పారు.
9.మిచిగన్ రాష్ట్రంలో ఈసారి ఓట్ల లెక్కింపు వేగంగా జరుగనుంది. బుధవారం మధ్యాహ్నానికే ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాటు చేశారు.
10.పెన్సిల్వేనియాలో హారిస్, ఆమె మద్దతు దారులు సుమారు లక్షకు పైగా ఇళ్లకు వెళ్లి డెమోక్రాటిక్ అభ్యర్థికి ఓటు వేయమని అర్థించారు.