మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత్ కు అండగా ఉంటామని ప్రకటన;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-05 12:25 GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయం ముందు నిలబెట్టాలని అన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయకులు మరణించడం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతును ప్రకటించారు.
మద్దతు ఇస్తాము..
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా మద్దతుగా నిలుస్తుందని క్రిమ్లిన్ నాయకుడు, మోదీకి చెప్పారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ‘‘అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు’’ అని మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు.
‘‘అమాయకుల ప్రాణనష్టంపై ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు పూర్తిగా మద్దతును ప్రకటించారు’’ అని ఆయన అన్నారు.
పహల్గామ్ దాడి..
ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు సాధారణ ప్రజల ఐడీకార్డులు, ప్యాంట్లు విప్పి హిందువులనే కారణంతో తుపాకీతో కాల్చి చంపారు.
ఈ దారుణమైన కల్లోలానికి పాకిస్తాన్, అది పెంచిపోషించిన ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. పాక్ సైన్యంలోని స్పెషల్ ఫోర్స్ కు చెందిన మూసా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి.
ఈ ఘోర కలితో భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. న్యూఢిల్లీ తమపై భారీ సైనిక దాడికి దిగబోతుందంటూ ఇస్లామాబాద్ నాయకులు ప్రపంచమంతా తిరుగుతూ గగ్గోలు పెడుతున్నారు.
భారత్ - రష్యా సంబంధాలు..
ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయం ముందు నిలబెట్టాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు భారత్ ప్రకటించింది. భారత్ - రష్యా ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ నిబద్దతను మోదీ, పుతిన్ పునరుద్ఘాటించారు.
రెండో ప్రపంచ యుద్దంలో జర్మనీపై రష్యా విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పుతిన్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరల్లో భారత్ లో జరగనున్న రష్యా- భారత్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మోదీ, పుతిన్ ఆహ్వనించారు.