యూఎస్ ఎయిడ్ నిధులపై భారత్ లో దుమారం.. రాహుల్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు

శ్వేతపత్రం విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్;

Update: 2025-02-21 10:15 GMT

భారత్ లో ఎవరినో గెలిపించడానికి యూఎస్ కు చెందిన 21 మిలియన్ డాలర్ల టాక్స్ పేయర్ల సొమ్మును గత బైడెన్ ప్రభుత్వం ఖర్చు చేసిందని అధ్యక్షడు ట్రంప్ వ్యాఖ్యానించడంలో భారత్ లో దుమారం రేపింది. ఆయన వ్యాఖ్యలపై రెండు జాతీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లక్ష్యంగా అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎన్జీఓలతో సంబంధాలు నెరుపుతున్న కాంగ్రెస్ అమెరికా నిధులను వాటికి మళ్లించి తిరిగి దేశంలో జరిగే ఎన్నికలల్లో వాడుకుందని ఆరోపించింది.
అయితే కాంగ్రెస్ పార్టీ, ట్రంప్ వ్యాఖ్యలను రబ్బిష్ గా కొట్టిపారేసింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కు యూఎస్ ఎయిడ్ నుంచి ఎన్ని నిధులు నాన్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూషన్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ లు గా విభజించి  శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
రాహుల్ విదేశాల్లో మాట్లాడిన ప్రసంగాల అర్థం ఏమిటీ?
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చాలా సార్లు విదేశాలకు వెళ్లినప్పుడూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంపై ఆందోళన వ్యక్తం చేయడం పచ్చి బూటకమని, ఆయన దేశంలోని వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్లు స్పష్టమైందని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
కాంగ్రెస్ తో జట్టుకట్టిన కొన్ని ఎన్జీఓలు దేశ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించాయనడానికి ఇదే రుజువని అన్నారు. ఆయన రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియో క్లిప్ లతో పాటు, ట్రంప్ వీడియో క్లిప్ ను ప్లే చేశారు.
‘‘కాంగ్రెస్ చేసింది సిగ్గుచేటు. ఆయన ఓడిపోతాడని ముందే తెలుసు. అయినప్పటికీ విదేశాలలో భారత ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసి, అక్కడి ప్రజాస్వామ్యాల నుంచి సాయం కోరాడు.’’ అని అన్నారు. అసలు మన దేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా 21 మిలియన్ డాలర్ల నిధులు ఎందుకు విడుదల చేయాలని, ఎవరికి గెలిపించడానికి ఈ ప్రయత్నం జరిగిందని ప్రశ్నలు సంధించారు.
2023 నాటి వీడియోలో రాహుల్ ప్రసంగం..
‘‘భారత్ ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్య రక్షకులుగా పిలవబడే అమెరికా, యూరోపియన్ దేశాలు భారత్ ను విస్మరించినట్లు కనిపిస్తున్నాయి’’ అని రాహుల్ గాంధీ విదేశాలలో మాట్లాడిన వీడియోను ఆయన ప్లే చేశారు.
దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేయడానికి విదేశీ ప్రయత్నాలు జరగుతుండటంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు విదేశీ కుట్రతో సంబంధాలు ఉన్నట్లు రుజువు చేస్తున్నాయని అన్నారు.
మోదీ అంతకుముందే హెచ్చరించారు
ప్రధాని మోదీ 2024 ఎన్నికల్లో అనేక ప్రచార సభల్లో మాట్లాడుతూ.. దేశంలో విదేశీ కుట్రలను అనేక సార్లు ప్రస్తావించినట్లు అప్పటి వీడియో క్లిప్పులను కూడా ప్లే చేశారు.
‘‘భారత్ ను అణగదొక్కాలని చూస్తున్న విదేశీశక్తులతో రాహుల్ పొత్తు పెట్టుకున్నారు. ఆయన విదేశీ ఏజెన్సీలకు సాధనంగా వ్యవహరిస్తున్నారు.’’ అని మాల్వియా ఆరోపించారు.
రాహుల్ విదేశీ ఏజెంట్..
ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. విదేశీ శక్తులు మోదీ ని అధికారంలోకి రాకుండా ప్రయత్నాలు జరుపుతున్నారని, దాని కోసమే వివిధ పేర్లతో , వివిధ ఎన్జీఓలకు నిధులు అందించారని ఆరోపించారు. 2023 మార్చిలో రాహుల్ గాంధీ లండన్ వెళ్లారని, 2024 ఎన్నికల్లో భారత్ లో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరాడని అన్నారు.
ట్రంప్ వాదనలు అర్థరహితం: కాంగ్రెస్
తమపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ కొట్టి పారేసింది. ట్రంప్ వ్యాఖ్యలు అర్థరహితమని అంది. దేశానికి అమెరికా గత దశాబ్దాలుగా ఇస్తున్న ఎయిడ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
యూఎస్ ఎయిడ్ ను 1961 లో స్థాపించారని, అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం, దీనిపై భారత ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
డోజ్ ప్రకటన..
స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య విభాగం( డోజ్) ‘‘యూఎస్ పన్ను చెల్లింపుదారుల డాలర్లను దేని కోసం ఖర్చుచేశారో ఆ జాబితాలను విడుదల చేసింది.
ఇందులో భారత్ లోని ఓటర్ల సంఖ్యను పెంచడానికి 21 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది’’ దీనితో దేశంలో దుమారం చెలరేగింది. ప్రపంచంలోని అన్ని దేవశాలకు అందుతున్న సాయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.


Tags:    

Similar News