అక్రమవలసదారుల పట్ల అమెరికాది అదే తీరు.. రెండోసారి కూడా..

డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ తర్వాత అక్రమవలసదారులను తీసుకువచ్చే వైఖరిలో అమెరికా తన తీరును మార్చుకుంటుందని అందరూ భావించారు. కానీ..;

Update: 2025-02-16 09:17 GMT
Click the Play button to listen to article

అమెరికా వైఖరి ఏ మార్పు లేదు. అక్రమవలసదారులకు స్వదేశానికి పంపే తీరును ఏ మాత్రం మార్చుకోలేదు. అమెరికా నుంచి రెండో విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం అర్థరాత్రి ల్యాడయ్యింది. ఈ సారి కూడా బేడీలు వేసి తీసుకొచ్చారు.

మొదటిసారి కూడా..

104 మంది అక్రమవలసదారులతో అమెరికా విమానం ఫిబ్రవరి 5న అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. విమానం ఎక్కించేముందు వీళ్ల చేతులకు బేడీలు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేసి తీసుకొచ్చారు. ఈ ఘటన భారతీయుల పట్ల అమెరికా తీరుకు అద్దం పట్టింది. సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. పార్లమెంటులోనూ ప్రతిపక్ష నేతలు కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇటీవల అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)తో ప్రధాని మోదీ (PM Modi) సమావేశమయ్యారు. ఇద్దరి భేటీ తర్వాత అక్రమవలసదారుల పట్ల అమెరికా వైఖరి మారుతుందని దేశమంతా భావించింది. బేడీలు వేయకుండా తీసుకువస్తారని అనుకున్నారు. కాని మొదటిసారిలాగే, రెండోసారి కూడా అక్రమవలసదారులు బేడీలతోనే తిరిగొచ్చారు. మమ్మల్ని ఖైదీల్లాగా చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేశారని, విమానం దిగే ముందు వాటిని తీసేసి బయటకు పంపారని పంజాబ్‌కు చెందిన అక్రమ వలసదారు దల్జీత్‌ సింగ్‌ వెల్లడించారు.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పార్లమెంటులో గతంలో స్పష్టం చేశారు. అక్రమవలసదారుల పట్ల అమెరికా ఇలా వ్యవహరించడం వారికి కొత్తకాదన్నారు. దాదాపు పదేళ్లుగా ఈ విధానం కొనసాగుతుందని ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు.

సెంకడ్ బ్యాచ్‌లో 116 మంది..

రెండో బ్యాచ్‌లో 116 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పంజాబ్‌కు చెందినవారు 65 మంది, 33 మంది హర్యాణా, 8 మంది గుజరాత్, ఉత్తర ప్రదేశ్,గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. వీరందరి వయస్సు 18 నుంచి 30 మధ్య ఉన్నట్లు PTIకి అధికార వర్గాలు తెలిపాయి. వీరి పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పోలీసు వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. 

Tags:    

Similar News