యుద్ధాన్ని ముగించడానికే భారత్ పై సుంకాలు: అమెరికా

ఈ చర్యతోనే రష్యాకు దారికి వచ్చిందన్న వైట్ హౌజ్;

Update: 2025-08-20 06:25 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

‘అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకుందని తెలుగులో సామెత’. భారత్ పై అమెరికా విధించిన చర్యలు అచ్చు అలాగే ఉన్నాయి.  రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు విధించారడని వైట్ హౌజ్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం ప్రకటించారు. యుద్దాన్ని నివారించడానికి అదే తమకు సరైన దారిలా కనిపించిందని తమ చర్యలకు సమర్థించుకున్నారు. 

‘‘యుద్ధాన్ని నివారించడానికి అధ్యక్షుడు ప్రజల వైపు నుంచి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. మీరు చూసినట్లుగానే ఆయన చర్యలు మంచి ఫలితాలు తీసుకొచ్చాయి. భారత్ పై ఆంక్షలు, ఇతర చర్యలు కూడా ఇందులో భాగమే.
ఈ యుద్ధాన్ని ముగించాలని తాను కోరుకుంటున్నానని ఆయన స్వయంగా స్పష్టం చేస్తున్నారు.’’ అని జోడించారు. భారత్- పాక్ మధ్య సైనిక వివాదాన్ని ముగించారని లీవిట్ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి ప్రకటించారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మిత్రదేశాలు, మన స్నేహితులు, మన విరోధుల నుంచి ఆ గౌరవాన్ని డిమాండ్ చేయడానికి అధ్యక్షుడు అమెరికా బలాన్ని ఉపయోగిస్తున్నాడు’’ అని లీవిట్ చెప్పారు.
ఏడు యుద్ధాలు ఆపాము..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పురోగతిలో ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏడు సంఘర్షణలను నివారించిందని, ఇప్పుడు మాస్కో- కీవ్ ఒప్పందం కూడా ముందుకు కదులుతోందని అన్నారు.
భారత్- పాక్ మధ్య వివాదం ముగిసింది. దాన్ని మనం చూశాము. అమెరికా అధ్యక్షుడిగా ఉండటం వల్ల వచ్చే బలం, పరపతిని నమ్మే అధ్యక్షుడు మనకు లేకుంటే అది అణు యుద్దానికి దారి తీసేదని ఆమె అన్నారు.
భారత్- పాక్ మధ్య వివాదాన్ని ముగించడానికి వాణిజ్యాన్ని శక్తివంతమైన సాధనంగా వాడుకున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మే 10 న వాషింగ్టన్ మధ్వవర్తిత్వంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. భారత్ - పాక్ మధ్య పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం 40 సార్లు ఆయన ఈ యుద్ధాన్ని ప్రస్తావించుకుని సొంతంగా క్రెడిట్ ఇచ్చుకుంటున్నారు.
భారత్ వైఖరీ..
రెండు సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ప్రత్యక్ష చర్చల తరువాత పాకిస్తాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణపై అవగాహాన కుదిరిందని భారత్ చెబుతోంది. తమ మధ్య మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించేది లేదని న్యూఢిల్లీ కుండబద్దలు కొట్టింది.
ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ దేశం కూడా చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో పేర్కొన్నారు. కానీ అమెరికా మాత్రం తన వాదనలే మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.
అంతకుముందు సీఎన్బీసీ ఇచ్చి ఇంటర్వ్యులో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి తిరిగి అమ్మకం ద్వారా భారత్ భారీగా లాభపడుతోందని అన్నారు.
ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు. ఇవి ఆగష్టు 27 న అమలులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ తనపై వేసిన సుంకాలను అన్యాయమైనవిగా అభివర్ణించింది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థ, జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని న్యూఢిల్లీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Tags:    

Similar News