ఇద్దరి అధ్యక్షుల అపరిపక్వతే ఈ యుద్దానికి కారణం
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండు సంవత్సరాలు పూర్తయింది. నాటో లో ఉక్రెయిన్ చేరే ప్రక్రియ వేగం చేయడంతో పుతిన్ ఆగ్రహంతో దండయాత్రకు పూనుకున్నాడు. కానీ..
By : KS Dakshina Murthy
Update: 2024-02-23 07:39 GMT
యుద్దాలు.. ఎన్నోసార్లు చరిత్ర గతిని మార్చినా, మానవ నాగరికతకు మాయని మచ్చను తెచ్చాయి. తీరని కళంకం ఆపాదించి పెట్టాయి. ఇప్పుడు కొనసాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్దం కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇప్పుడు మెజారిటీ రష్యన్లు- ఉక్రెనియన్లు దీనిని ఆపాలని కోరుకుంటున్నారు. యుద్దం అంటేనే విముఖత చూపుతున్నారు. ‘నాటో’లో చేరాలో వద్దో అన్నా భిన్నాభిప్రాయాలు రెండు దేశాల మధ్య రావణకాష్ఠం రగిలేలా చేశాయి. లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లేలా చేశాయి. వేలాదిమంది చంపబడ్డారు.
యుద్దం ప్రారంభమై రెండు సంవత్సరాలైన దాని ముగింపు మాత్రం కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఇప్పటికే ఉక్రెయిన్ పున: నిర్మించడానికి వీలుకాని స్థితిలో ధ్వంసం అయింది. నాటో కూటమి తన తన సరిహద్దులో ఉండడానికి వీలులేదని రష్యా, నాటో లో చేరతామని ఉక్రెయిన్ రెండు కూడా పట్టినపట్టు వీడకుండా ఉండడం ఈ పరిణామాలకు కారణం. పశ్చిమ దేశాలు, పుతిన్ దాడి చేస్తాడా లేడా అనే విషయంలో చివరి నిమిషం వరకూ పూర్తిగా అంచనవేయలేకపోయాయా? లేదా అని ప్రపంచానికి స్పష్టంగా తెలియదు. కానీ ఫిబ్రవరి 24, 2022న దాడికి దిగిన పుతిన్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
తప్పుగా ఆలోచించిన జెలెన్ స్కీ
రాజకీయంగా అంతగా అనుభవం లేని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనేక దఫాల చర్చల అనంతరం రష్యాపై ఎదురు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. పుతిన్ దండయాత్ర చేయడానికంటే ముందు ఉక్రెయిన్, అమెరికా, దాని మిత్ర దేశాలు నాటో కూటమిలో చేరే విషయమై దానిని పోస్ట్ పోన్ చేశాయి. దండయాత్ర జరిగిన తరువాత ఇలాంటిది ఏదో జరుగుతుందని అనిపించింది. అలాగే జరిగింది కూడా.
జెలెన్ స్కీ పుతిన్ పోరాటాన్ని తక్కువగా అంచనా వేసి ఈ పోరాటానికి దిగాడు. అలాగే పశ్చిమ దేశాలు కూడా తనతో పాటు యుద్ద రంగంలోకి దిగుతాయని అతడు భావించి ఉండొచ్చు. కానీ నాటో కూటమిని నడిపిస్తున్న అమెరికా మాత్రం తమ యుద్దంలో ఆసక్తి లేదని ప్రకటించింది.
కానీ పశ్చిమ దేశాలు ప్రత్యక్షంగా యుద్దంలోకి దిగలేదు అన్నమాటే గానీ నిధులు, ఆయుధాలు, అత్యాధునిక ఆయుధ సామగ్రిని పంపారు. దాంతో పాటు రష్యా ను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆంక్షలను ప్రయోగించారు. ఇలా చేయాల్సిదంతా చేసి పోరాటాన్ని ఉధృతం అయ్యేలా తమ వంతు పాత్ర పోషించారు.
రష్యాకు ఎదురుదెబ్బలు
ఉక్రెయిన్ పోరాటాన్ని మొదట తక్కువగా అంచనా వేసిన రష్యా భారీ స్థాయిలో ఎదురుదెబ్బలు తింది. అంతకుముందు రష్యా స్వాధీనం చేసుకున్న వందలాది సైనిక స్థావరాలను తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
ఆధునిక డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి నల్ల సముద్రంలో కీలకమైన రష్యన్ యుద్దనౌక సీజర్ కునికోవ్ ను ముంచివేసింది. రష్యా సరిహద్దులోని ప్రాంతాలపై కూడా దాడులకు దిగింది దీంతో సైనికులను అత్యధిక సంఖ్యలో కోల్పోయింది. దీనిని పూరించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకోవడానికి చట్టాలు చేశారు.
వెనకడుగు వేస్తున్న ఉక్రెయిన్
మొదట ఉక్రెయిన్ అడ్వాన్స్, రష్యన్ బ్యాక్ ఆఫ్ గురించి ప్రపంచం లో చర్చ జరిగింది. కానీ గత సంవత్సరం నుంచి రష్యా తిరిగి పోటీలోకి రాగలిగింది. తాజాగా అవ్దివ్కా నగరం పుతిన్ సేన వశమయింది. మారింకా నగరం పతనం అంచున ఉంది. యుద్దంలో రష్యా,ఉక్రెయిన్ రెండు కూడా తమ జనరల్లను మార్చే పనిలో ఉన్నాయి. సైనిక వ్యూహంలో లోపాలు, విబేధాల కారణంగా జెలెన్క్సీ తన ఆర్మీ చీఫ్ వాలెరీ జలుజ్నీని తొలగించారు. అంతకుముందు రక్షణమంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ను టెటియానా స్థానంలో నియమించాడు.
పుతిన్ కూడా నల్ల సముద్రం నౌకాదళ అడ్మిరల్ విక్టర్ సోకోలోవ్ ను మార్చాడు. అంతకుముందే ఏరోస్పేస్ కమాండర్ జనరల్ సెర్గీ సురోవికిన్ ను మార్చాడు. ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధిపతి ఫ్రిగోషిన్ తిరుగుబాటు తరువాత అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఇవన్నీ కూడా పుతిన్ తన సైన్యం పట్ల నమ్మకంగా లేదని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
యుద్దంలో అలసట.. దేశాల మధ్య విభేధాలు
యుద్దం దీర్ఘకాలంగా కొనసాగుతుండడంతో ఉక్రెయిన్ ఆయుధాలు, డబ్బు ఇతర వనరులను సప్లై చేస్తున్న పశ్చిమ దేశాలు ఇప్పడుమల్లగుల్లాలు పడుతున్నాయి. ఇది వాటి మధ్య విభేదాలు సృష్టిస్తోంది. జెలెన్ స్కీ పై ఒత్తిడి తెచ్చి చర్చల ప్రక్రియను పట్టాలెక్కించాలని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వీటిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. పుతిన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏం లేదు. యుద్దానికి మొత్తం వనరులను కేటాయించడంతో స్వదేశంలో పరిస్థితి మొత్తం వ్యతిరేకంగా ఉంది. అయితే ఎవరు నోరు విప్పి ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు మాత్రం యుద్దం పై విముఖత ప్రదర్శిస్తున్నారు.
ఇద్దరి నాయకుల అపరిపక్వత
ఈ యుద్దం ఇరు దేశాధినేతల అపరిపక్వతను బయట పెట్టింది. నాటో చేరడం ఉక్రెయిన్ ఇప్పటికిప్పుడే అత్యవసరం కాదు. కానీ జెలెన్ స్కీ పట్టుదల వల్ల ఇది జఠిలమైంది. మరోవైపు పుతిన్ ఉక్రెయిన్ ఓడించి తన బలాన్ని పెంచుకోవాలనే ఆత్రుత ప్రదర్శించాడు. దీంతో ఒకప్పటి సోవియట్ ప్రాంతాలైన ఈ రెండు దేశాలు ప్రజలను కుంపటిలోకి తోశాయి.
మరోవైపు ప్రపంచానికి మరో రెండు కొత్త సమస్యలు తోడవడంతో ఈ దేశాల గురించి అవి మర్చిపోయాయి. మొదటిది గాజా పై ఇజ్రాయెల్ యుద్దం కాగా, అరేబియా ప్రాంతంలో నౌకలపై హౌతీల దాడులు. దీంతో ప్రపంచం మొత్తం చూపు ఇటు వైపు పడింది.
ఒకప్పుడు సోవియట్ యూనియన్ ను ముక్కలు చేయడంలో పశ్చిమ దేశాలు విజయం సాధించాయి. ఇప్పుడు రెండు సోవియట్ దేశాల మధ్య యుద్దం చేసేందుకు కారణం అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ స్థితిని ఎంతత్వరగా మార్చితే అంత మంచింది.