పారిపోయే స్థలం లేదు.. పరిగెత్తే సమయమూ లేదు..

దక్షిణ గాజాపై ఐడీఎఫ్ వరుసగా దాడులు చేస్తుండటంతో తాము ఎక్కడి వెళ్లాలో తెలియట్లేదని పాలస్తీనియన్లు ఆక్రందనలు చేస్తున్నారు.

Update: 2023-12-12 10:38 GMT
గాజాపై జరిగిన బాంబుదాడుల అనంతరం

ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇప్పటి వరకూ 17,700 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో మూడో వంతు మహిళలు, చిన్నారులే అని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే ఇప్పట్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే సూచనలు కనిపించటం లేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

గాజా లోని హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుద ముట్టించడానికి తమకు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) చెబుతోంది. అప్పటి వరకూ భూతల, వైమానిక, మోర్టార్ దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. అప్పటి వరకు కాల్పుల విరమణ ప్రసక్తే లేదని అంటోంది.

ఇంతవరకూ మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతర్.. ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్దాన్ని ఆపడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకోకపోవడంతో ఘర్షణ ఇంకా తీవ్రమవుతోంది. భూతల పోరాటంతో సామన్య పాలస్తీయన్లు మరణిస్తున్నారనే అంతర్జాతీయ ఒత్తిడి వస్తున్న ఇజ్రాయెల్ లెక్క చేయట్లేదు.

23 లక్షల జనాభా ఉన్న గాజా స్ట్రిప్ లో 90 శాతం మంది ప్రజలు టెల్ అవీవ్ దాడిలో బాధితులుగా మారారని పలు అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అసలు గాజాలో సురక్షిత స్థానం అంటూ ఏదీ లేదని వివరిస్తున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను శాశ్వతంగా బయటకు పంపించే కార్యక్రమాలను ఇజ్రాయెల్ చేస్తోందని ఇప్పటికే కొంతమంది హమాస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అందుకే మానవతా సాయాన్ని సైతం అందించడానికి ఒప్పుకోవడం లేదని వాదిస్తున్నారు.

రెండో క్రాసింగ్ తెరిచాం

గాజాలో నిత్యవసరాల పంపిణీకి రెండో క్రాసింగ్ ను తెరిచినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. తమ ఆధీనంలో ఉన్న గాజాకి మానవత సాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం నిట్టానా క్రాసింగ్ ద్వారా మాత్రమే నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు.

మంగళవారం నుంచి షాలోమ్ క్రాసింగ్ ను సైతం తెరుస్తామని కోగాట్ అనే పాలస్తీనా పౌర వ్యవహరాలకు బాధ్యత వహించే సంస్థ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ నేరుగా ఎటువంటి సాయాన్ని పంపించదు. ఈజిప్ట్ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి మానవ సాయాన్నిమాత్రమే అనుమతి ఇస్తుందని వెల్లడించింది.

100 మిలియన్ డాలర్ల ఆయుధ విక్రయాలు

ఇజ్రాయెల్- అమెరికా మధ్య ఆయధ బంధం మరింత బలపడింది. ఈ మధ్య కాలంలో వాషింగ్టన్ నుంచి టెల్ అవీవ్ 100 మిలియన్ల డాలర్ల విలువ చేసే ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిచ్చిన సమయంలో ఈ ఒప్పందం జరిగింది. కాల్పుల విరమణ అంశంపై ఈ రోజు యూన్ లో ఓటింగ్ జరగనుంది. అయితే ఎప్పటిలాగే అమెరికా దాని మిత్ర దేశాలు ఈ తీర్మానంపై వీటో అధికారాన్ని ఉపయోగించే అవకాశాలు ఫుష్కలంగా ఉన్నాయి.

అమెరికా ఆందోళన

లెబనాన్ లో జరిగిన ఘటనలో అమెరికా అందించిన తెల్ల భాస్వరం ఆయుధాలను ఐడీఎఫ్ మోహరించిందనే వార్తలపై తాము ఆందోళన చెందుతున్నామని అమెరికా జాతీయ భద్రతామండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే ఇదీ చట్టబద్దమైన సైనిక ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా మా మిత్ర దేశాలకు వాటిని అందజేస్తాం అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ ఆయధాల మోహరింపును వాషింగ్టన్ పోస్ట్ సోమవారం బయటపెట్టింది.

అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి తెగబడింది. పసిపిల్లలు సహ 1200 మంది సాధారణ పౌరులను చంపింది. 240 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. ఈ దాడిలో 97 మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం చేస్తామని ఇజ్రాయెల్ శపథం చేసింది. భూతల దాడులకు ముందు భారీగా వైమానిక దాడులు నిర్వహించిన ఐడీఎఫ్ తరువాత హమాస్ ను పూర్తిగా తుదముట్టించే పోరును ప్రారంభించింది.      

Tags:    

Similar News