‘‘పాక్ కు రుణం ఇచ్చే ముందు కాస్త ఆలోచించండి’’

ఐఎంఎఫ్ కు భారత్ సూచన;

Update: 2025-05-09 09:49 GMT
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించే ముందు కాస్త లోతుగా పరిశీలించాలని భారత్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఐఎంఎఫ్ ను కోరింది.

వాషింగ్టన్ లో కీలక సమావేశం నిర్వహించే ఒక రోజు ముందు గురువారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విజ్ఞప్తి చేశారు. ‘‘ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భారత్ వైఖరిని ముందుకు తెస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు.
గత మూడు దశాబ్ధాలలో పాకిస్తాన్ కు అనేక బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఐఎంఎఫ్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘ ఆ బెయిల్ అవుట్ లు ఎన్ని విజయవంతమైన ముగింపులకు చేరుకున్నాయో కూడా మీకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది బోర్డు సభ్యులు తమలో తాము లోతుగా పరిశీలించి, వాస్తవాలను పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం అని నేను భావిస్తున్నాను’’ అని మిస్రీ అన్నారు.
గత ఏడాది ఐఎంఎఫ్ దగ్గరికి ఏడు బిలియన్ డాలర్ల రుణ సాయం కోరుతూ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది. ఇందులో కొంతమేర నిధులను ఇప్పటికే ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది.
అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చిచంపడం తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై సైనిక చర్యకు దిగింది. అలాగే పాకిస్తాన్ కు రుణ సాయం అందకుండా విజ్ఞప్తి చేసింది.
పాకిస్తాన్ కు ఇప్పటికే  నీటి పారుదల విషయంలో షాక్ ఇచ్చి భారత్, దానికి ఆర్థిక ఊపిరిని సైతం ఆపేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఐఎంఎఫ్ కు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తొంది. 
ఈ రోజు తన అధికారిక ఎక్స్ ఖాతాలో బహిరంగంగా కూడా తమకు ప్రపంచం ఉదారంగా డబ్బులు  ఇవ్వాలని ట్వీట్ చేసింది. అయితే తరువాత తమ ఖాతా హ్యాక్ అయినట్లు చెప్పుకొచ్చింది. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాదీ ఉన్మాదంతో వ్యవహరిస్తూ దేశంలోని సాధారణ ప్రజలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. 
Tags:    

Similar News