ఇనుము, అల్యూమినియంపై సుంకాలు ప్రకటించిన ట్రంప్
మెక్సికో, కెనడాపై కూడా ఇవి వర్తిస్తాయన్నా అమెరికా అధ్యక్షుడు;
By : The Federal
Update: 2025-02-10 10:51 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల పరంపరంను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే యూఎస్ సరిహద్దు రాష్ట్రాలైన కెనడా, మెక్సికో లపై 25 శాతం సుంకం విధించిన ఆయన తాజాగా తమ దేశంలోకి ప్రవేశించే అన్ని ఉక్కు, అల్యూమినియం పై 25 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ ఈ వారం చివరలో అధికారికంగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
‘‘యునైటెట్ స్టేట్స్ లోకి వచ్చే ఏ ఉక్కుకైనా 25 శాతం సుంకం ఉంటుంది. ’’ అని ఆయన ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ లో సూపర్ బౌల్ లో పాల్గొనడానికి ఫ్లోరిడా నుంచి న్యూ ఓర్లీన్స్ కు విమానంలో వెళ్తూ విలేకరులతో అన్నారు.
అల్యూమినియం పై కూడానా అని విలేకరులు అడిగినప్పుడు ‘‘ అల్యూమినియం పై కూడా’’ వాణిజ్య జరిమానాలకు లోబడి ఉంటుందని ఆయన చెప్పారు.
సుంకాలు అందరికి వర్తిస్తాయి..
ఈ సుంకాలు మెక్సికో, కెనడాకు కూడా వర్తిస్తాయా? అని ప్రశ్నించినప్పుడూ కూడా చాలా స్పష్టంగా ‘‘అవును’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే ఈ దేశాలకు ఎప్పుడూ అమల్లోకి వస్తాయో ఆయన చెప్పలేదు.
అల్యూమినియం దిగుమతుల కోసం అమెరికా ప్రధానంగా కెనడా, చైనా, యూఏఈ పై ఆధారపడుతోంది. దాని ఉక్కు దిగుమతులు అంత ఎక్కువగా లేవు. కానీ అమెరికాలో ఉత్పత్తి చేయబడని స్పెషాలిటీ గ్రేడ్ లపై ఆధారపడే ఆయిల్ డ్రిల్లర్లు, పవనశక్తి డెవలపర్ల వంటి రంగాలకు ఇది ముఖ్యమైనది.
అమెరికా ఉక్కు పరిశ్రమ సంవత్సరం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. దిగుమతుల పెరుగుదల తమ ఆదాయాలు, లాభాలను దెబ్బతీసిందని పరిశ్రమలో కొందరు ఫిర్యాదు చేశారు. అయితే తాజా సుంకాలు భారత దేశంపై పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మన దేశం అమెరికాకు ఇనుము, ఉక్కు వస్తువులను ఎగుమతి చేస్తోంది.
తన ప్రయత్నాలు నిలిపివేయనున్న.. జపాన్..
జపాన్ కు చెందిన నిప్పాన్ స్టీల్ కార్ప్, యూఎస్ స్టీల్ కార్ప్ ను 14.1 బిలియన్లకు కొనుగోలు చేయడానికి వేసిన బిడ్ ను అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేసిన సమయంలో ఉక్కు సుంకాల గురించి ప్రకటన వచ్చింది.
ట్రంప్, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మధ్య జరిగిన సమావేశం తరువాత నిప్పాన్ స్టీల్ ఇప్పుడు ఆ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయడానికి బదులుగా యూఎస్ లో స్టీల్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. జపాన్ కంపెనీకి యూఎస్ స్టీల్ లో మెజారిటీ వాటా ఉండదని ట్రంప్ విలేకరులతో అన్నారు.
పరస్పర సుంకాలు..
ట్రంప్ కూడా పరస్పర సుంకాలు ప్రకటిస్తానని ఉద్ఘాటించారు. ‘‘ బహుశా మంగళవారం లేదా బుధవారం వాటిని ప్రకటిస్తా’’ అన్నారు. తమ ఉత్పత్తులపై సుంకాలు విధించే ఏదైన దేశంపై తాము కూడా అంతే మొత్తంలో పన్నులు విధిస్తామని ఆయన చెప్పారు.
కొన్ని దేశాలు అమెరికా ఉత్పత్తులపై 130 శాతం పన్నులు విధిస్తున్నారని, కానీ అక్కడి నుంచి మా దేశానికి వచ్చే ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు విధించడం లేదన్నారు. ఇకముందు ఇలాంటివి కొనసాగవని హెచ్చరించారు.
అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండో సారి పీఠమెక్కిన ఆయన సుంకాలతో ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి, ఉద్యోగాలను రక్షించడానికి వాణిజ్య లోటును తగ్గించడానికి, పన్ను ఆదాయాలను పెంచడానికి వాటని ఒక మార్గంగా ఆయన భావిస్తున్నారు.
అయితే సుంకాలు విధించడం వలన అమెరికాకు దిగుమతి చేసుకునే వస్తు తయారీదారులకు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతాయని, వినియోగదారులకు ధరలు పెరగడానికి, వాణిజ్య ప్రవాహాలను తగ్గించడానికి, యూఎస్ కు తక్కువ పన్ను ఆదాయాలకు దారితీయవచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.