భారత అంతర్గత వ్యవహరాలలో యూఎస్ జోక్యం చేసుకుంటుందని కొన్ని రోజుల క్రితం ఆరోపించిన బీజేపీ నేతల మాట నిజం లాగే కనిపిస్తున్నాయి. బైడెన్ సర్కార్ భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేటాయించిన 21 మిలియన్ డాలర్ల నిధులను మస్క్ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డీఓజీఈ, డోగ్) నిలిపివేసింది.
ఇవే కాకుండా విదేశీ సాయం కింద కేటాయించిన మరో 750 మిలియన్ డాలర్లకు పైగా రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించడానికి డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చేస్తున్న పెద్ద ప్రయత్నాల్లో భాగంగా ఈ నిధుల్లో కోతలు విధించాయి. భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో రాజకీయాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మరో 29 మిలియన్ డాలర్లను సైతం డోగ్ నిలిపివేసింది.
యూఎస్ ఎయిడ్ నిధులు..
‘‘యూఎస్ పన్ను చెల్లింపుదారుల డాలర్లను వేరేవేరే అంశాలపై ఖర్చు చేయబోతున్నారు. అవన్నీ రద్దు చేస్తున్నాం’’ అని డోగ్ విడుదల చేసిన ప్రకటనలో నిధులు నిలిపివేసిన జాబితాను పేర్కొంది.
వీటిని విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజాస్వామ్య రంగాలలో విదేశీ సాయాన్ని అందిస్తున్నామని బైడెన్ సర్కార్ బయటకు చెప్పినప్పటికీ తమకు గిట్టని దేశాలలో రెజిమ్ ఛేంజ్ పాలసీకి ఉపయోగించుకుంటున్నారని కొన్ని దేశాల అధినేతలు ఆరోపిస్తున్నారు.
దేశ ఎన్నికల్లో జోక్యం: బీజేపీ
యూఎస్ ఎయిడ్ నిధుల విషయం బయటకు రాగానే బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పై విరుచుపడింది. భారత ఎన్నికల్లో ‘‘బాహ్య శక్తుల జోక్యం’’ జరిగిందనడానికి ఇదే రుజువు అని బీజేపీ ఆరోపించింది. ఈ కార్యక్రమం వల్ల ఎవరూ ప్రయోజనం పొందుతున్నారో ప్రత్యేకంగా చెప్పాలా అని కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేసింది.
‘‘ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ బలోపేతం కోసం కన్సార్టియం కు 486 మిలియన్ల డాలర్లు, మోల్డోవాలో సమ్మిళిత, భాగస్వామ్య రాజకీయ ప్రక్రియ కోసం 22 మిలియన్ డాలర్లు, భారత్ లో ఓటర్ల సంఖ్య కోసం 21 మిలియన్ డాలర్లు.
ఇది కచ్చితంగా దేశ ఎన్నికల ప్రక్రియలో బాహ్య జోక్యం. దీని వల్ల ఎవరు పాలకపడతారు? కచ్చితంగా పాలక పార్టీ కోసం కాదు’’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి అమిత్ మాల్వియా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మరోక పోస్టు లో బిలియనీర్ పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ తో సహ విదేశీ శక్తులు భారతీయ సంస్థలలోకి అక్రమంగా చొరబడ్డారని ఆయన ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి, గాంధీల సహచరుడు జార్జ్ సోరోస్ నీడ మన ఎన్నికల ప్రక్రియపై అలుకుంటోంది’’ అని ఆయన విరుచుకుపడ్డారు.
ఈసీని విదేశాలకు అప్పగించే పని చేశారు
అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూఎస్ ఎయిడ్ నిధులు, సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తో కలిసి ఉన్న సంస్థతో కలిసి భారత దేశ ఎన్నికల అధికారాన్ని విదేశీ ఆపరేటర్లకు అప్పగించిందని మాల్వియా ఆరోపించారు.
ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నియామకం, పారదర్శకత, సమగ్ర ప్రక్రియను ప్రశ్నించే వారు ఇప్పుడేమంటారో అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన శక్తులు, ప్రతిసారి దేశాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు. భారత్ సంస్థలోని క్రమ పద్దతిలో చొరబడటానికి వీలు కల్పించిందని, ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
యూఎస్ ఎయిడ్ నిధులు..
ఇటీవల లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ మాట్లాడుతూ.. దేశంలో యూఎస్ ఎయిడ్ నిధులు సమకూర్చే సంస్థలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అలాంటి సంస్థలు కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉన్నాయని, దేశంలో అశాంతిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాయని ఆరోపించారు.
వాషింగ్టన్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. 2020 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలత పాటు, భారత్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూఎస్ ఎయిడ్ పాత్ర ఉందా? అని అడిగితే ఆయన సానుకూలంగా స్పందించారు.