భార్యకి యెమెన్ పై దాడి వివరాలు చెప్పిన యూఎస్ రక్షణ కార్యదర్శి
సిగ్నల్ చాట్ నుంచి సమాచారం అందించారన్న న్యూయార్క్ టైమ్స్;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-21 05:47 GMT
ట్రంప్ పరిపాలనలో కీలక విభాగాల రహస్యాలు లీక్ అవుతున్నాయి. ఇంతకుముందు సిగ్నల్ గ్రూప్ లో యెమెన్ లో సైనిక దాడులకు సంబంధించిన రహస్యాలను చర్చించిన సంగతి మర్చిపోకముందే.. యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తన భార్య, సోదరుడితో మరో సిగ్నల్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని అక్కడ వారితో విషయాలు పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఈ సందేశాల గురించి తెలిసిన వ్యక్తి, సందేశాలను అందుకున్న వారు, గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ఈ సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు.
రెండో చాట్..
సిగ్నల్ లోని రెండవ చాట్ వాణిజ్యపరంగా వివరాలు మాత్రమే ఉండాలి. ఇందులో సున్నితమైన, వర్గీకృత జాతీయ రక్షణ సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి వీలు లేదని ఆ దేశ చట్టాలు చెబుతున్నాయి. కానీ గ్రూప్ లో 13 మంది వ్యక్తులు మెంబర్స్ గా ఉండి, ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఈ చాట్ ను ‘‘డిఫెన్స్ టీమ్ హాడిల్’’ అని పిలిచేవారని తెలిసింది.
ఎన్వైటీ నివేదిక ప్రకారం.. ఈ గ్రూపు లో హెగ్సేత్ భార్య మాజీ ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్, పెంటగాన్ లో హోంల్యాండ్ సెక్యూరిటీ అనుసంధానకర్త, సీనియర్ సలహదారుగా నియమించబడిన అతని సోదరుడు ఫిల్ హెగ్సేత్ ఉన్నారు.
వీరు ఇద్దరు రక్షణ కార్యదర్శితో కలిసి ప్రయాణించారు. అలాగే ఉన్నత స్థాయి సమావేశాలకు సైతం ఎలాంటి అధికారిక హోదా లేకుండా హజరయ్యారు.
డెమొక్రాట్ల డిమాండ్..
సిగ్నల్ లో సైనిక దాడి ప్రణాళికలు చర్చించిన అత్యున్నత జాతీయ భద్రతా అధికారులపై ఇప్పటివరకూ చర్య తీసుకోకపోవడంతో ట్రంప్ పై ప్రతిపక్ష డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘సైనిక వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. పీట్ హెగ్సేత్ జీవితాలను ఎలా పణంగా పెట్టాడో మనం చూస్తునే ఉన్నాం. కానీ ట్రంప్ ఇప్పటికీ అతడిని పదవి నుంచి తొలగించడం లేదు. ’’ అని సెనెట్ డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమర్ ఎక్స్ లో విమర్శించాడు. పీట్ హెగ్సేత్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
రెండో ఘటన..
జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ ఏర్పాటు చేసిన మొదటి చాట్ లో అనేక మంది క్యాబినేట్ సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపు లోనే అట్లాంటిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్ బర్గ్ ను కూడా ఆడ్ చేయడంతో ఈ విషయాలు అన్ని బయటకు వచ్చాయి.
ది అట్లాంటిక్ ప్రచురించిన ఆ చాట్ లోని విషయాలు హెగ్సేత్ గత నెలలో యెమెన్ లో ఇరాన్ మద్దతు గల హౌతీలపై దాడికి వాడిన ఆయుధాల జాబితాను బయటపెట్టింది.
యుద్ద విమానాల నుంచి ఆయుధాల ప్రయోగం..
అప్పట్లో వైట్ హౌజ్, జాతీయ భద్రతా మండలి, పెంటగాన్ ఈ విషయంపై ఎటువంటి స్పందనను తెలియజేయలేదు. తాను జర్నలిస్టుతో ఎటువంటి సమాచారం పంచుకోలేదని హెగ్సేత్ వాదించారు.
అయితే మొదటి చాట్ లో ఉన్న యుద్ధ విమాన ప్రయోగ సమయాలే రెండవ చాట్ లో కూడా ఉన్నాయని టైమ్స్ ఆదివారం కథనాన్ని ప్రచురించింది. ఇలాంటి వివరాలు బయటకు తీసుకురావడం పైలెట్ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని అనేకమంది మాజీ, ప్రస్తుత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు జరుగుతోంది..
హెగ్సేత్ సిగ్నల్ వాడకం, ముందస్తు సమాచారాన్ని పంచుకోవడంపై రక్షణ శాఖ తాత్కాలిక ఇన్స్పెక్టర్ జనరల్ దర్యాప్తు చేస్తున్నారు. ఇది సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ నాయకత్వం దృష్టికి వచ్చింది.
పెంటగాన్ లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సమాచార లీక్ లపై పెంటగాన్ విస్తృత దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హెగ్సేత్ అంతర్గత సర్కిల్ లోని నలుగురు అధికారులు గతవారం సెలవులపై వెళ్లిపోయారు.
వీరిలో హెగ్సేత్ సహాయకుడు డాన్ కాల్డ్ వెల్, డిప్యూటీ డిఫెన్స్ సెక్రటరీ స్టీవెన్ ఫీన్ బర్గ్ కు చీఫ్ ఆఫ్ స్టాప్ కాలిన్ కారోల్, హెగ్సెత్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ డారిన్ సెల్నిక్ లను పెంటగాన్ నుంచి బయటకు తీసుకెళ్లారు.
దర్యాప్తు ప్రారంభంలో ఈ ముగ్గురిని సెలవులపై పంపినప్పటికీ తరువాత సమాచారం ఇంకా బయటకు రాలేదు. పెంటగాన్ మాజీ ప్రతినిధి జాన్ ఉల్యోట్ కూడా గతవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లీక్ లతో సంబంధం లేకుండా ఆయనను రాజీనామా చేయాలని కోరగానే ఉల్యూట్ స్పందించారు.